Home » Nation » ఆత్మవిశ్వాసమే ఆమె ఆయుధం: రైలు ప్రమాదంలో కాలు కోల్పోయినా, హిమశిఖరాన్ని ముద్దాడిన అరుణిమా సిన్హా!

ఆత్మవిశ్వాసమే ఆమె ఆయుధం: రైలు ప్రమాదంలో కాలు కోల్పోయినా, హిమశిఖరాన్ని ముద్దాడిన అరుణిమా సిన్హా!

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

అంగవైకల్యాన్ని జయించి.. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన ధీరవనిత “అరుణిమా సిన్హా” సాహసగాథ! 🧗‍♀️🚩

ఉత్తరప్రదేశ్ కి చెందిన 23 ఏళ్ళ వాలీబాల్ ప్లేయర్ “అరుణిమా సిన్‌హా ” 2011 ఏప్రిల్ 11 న లక్నో నుండి ఢిల్లీ కి రైలులో ప్రయాణం చేస్తుంది.

నలుగురు దుండగులు సడెన్ గా ఆమె మెడలోని బంగారు గొలుసుని లాక్కోవటానికి ఆమె మీద దాడి చేశారు.

తోటి ప్రయాణికుల్లో ఒక్కరూ సహాయానికి రాకపోయినా ఆత్మాభిమానంగల ఆమె వాళ్ళని తీవ్రంగా ప్రతిఘటించింది.

గొలుసుని లాక్కొన్నాక ఎదురు తిరిగిందనే ఉక్రోషంతో ఆ దుండగులు ఆమె ని వేగంగా వెళుతున్న రైలు లోనుండి బైటికి తోసేశారు.

రైలు పట్టాల మధ్య పడిన ఆమె ఒక్కసారిగా స్థాణువయ్యి తేరుకుని చూస్తే సగం తెగిపోయిన తన కాలు దూరంగా పడివుంది. మరొక కాలు మడం వరకూ నుజ్జునుజ్జు అయివుంది.

స్పృహ లోనే వున్న ఆమె 7 గంటలు మీదికొస్తున్న కుక్కలను తరుముకుంటూ సహాయం కోసం అరుస్తూనే వుంది.

పక్క ట్రాక్‌లమీద రైళ్ళు పరిగెడుతూనే వున్నాయి.

తెల్లవారాక అక్కడి గ్రామస్థులు చూసి జిల్లా హాస్పిటల్ కి తీసుకెళ్ళారామెని.

ఎక్కువ సమయం గడిచినందున వెంటనే ఆపరేషన్ చెయ్యకపోతే ఉన్న ఒక్క కాలు కూడా దక్కని పరిస్థితి.

కానీ అక్కడ ఎనస్తీషియా, రక్తం అందుబాటులో లేవు. అక్కడి డాక్టర్స్ నర్సులు తామే రక్తదానం చేసి ఆపరేషన్ చేసి మరో పెద్ద హాస్పిటల్ కి తరలించారు.

ఆమెకి స్పృహ వచ్చాక ఆమెని బాధించింది నొప్పి కాదు. సొంత సమస్యలవల్ల ఆమె రైలు లో నుండి దూకి ఆత్మహత్య కి ప్రయత్నించింది అని మీడియా చేసిన ప్రచారం.

ఎలాగైనా బ్రతుకులో గెలిచి ప్రపంచానికి చూపాలని ఆ క్షణం లోనే నిర్ణయించుకుంది.

6 నెలల తరువాత కృత్రిమ కాలును అమర్చుకున్న ఆమె తన భవిష్యత్ నిర్ణయాన్ని ప్రకటిస్తే అందరూ ఆశ్చర్యపోయారు.

తన చిన్ననాటి లక్ష్యమైన “పర్వతారోహణ” నే ఎంచుకున్నానన్నది.

తమతోపాటు మామూలుగానే నడవలేని ఆమె కొండలెక్కుతుందట అని నవ్వుకున్నారందరూ ఒక్క తన బావ[అక్క భర్త} తప్ప .

అందరికీ తనలోవున్న అంగవైకల్యమే కనిపిస్తుంది గానీ కనిపించని కొండంత ఆత్మవిశ్వాసం కనిపించదు కనుక ఎవరినీ ఆమె తప్పు పట్టలేదు.

పర్వతాలనధిరోహించిన విజేతలను కలిసింది. కొందరి సహకారంతో ట్రైనింగ్ తీసుకుంది.

శ్రమించింది.శ్రమించింది.శ్రమించింది.

ఫలితం… యాక్సిడెంట్ అయిన తరువాత కేవలం రెండేరెండు సంవత్సరాలలో తన కృత్రిమకాలుతోనే మే 21,2013 న తాననుకున్నది సాధించింది.

అవరోధాలన్నీ దాటి అధిరోహించి ఆమె సగర్వంగా త్రివర్ణపతాకాన్ని ఎగురవేసిన ఆ పర్వత శిఖరం ఏదో తెలుసా?

అలాంటిలాంటి శిఖరం కాదు అది.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన “ఎవరెస్ట్ శిఖరం”.

“అరుణిమా సిన్‌హా”లోని ఆత్మస్థైర్యంలో ఓ పది శాతం మనలో ఉన్నా, అధిగమించగలిగిన అనారోగ్యాలను ఆత్మవిశ్వాసంతో వెనక్కి నెట్టిమరీ ముందడుగు వేయకుంటామా!

{అరుణిమా సిన్‌హా వీడియోలన్నీ యూట్యూబ్ లో వున్నాయి. చూడండి.)

Share to...