Bharat Today : సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో జనవిజ్ఞానవేదిక కార్యాలయంలో మహాకవి శ్రీశ్రీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీశ్రీ కవిత్వం కష్టజీవుల పక్షాన ఎలా నిలబడిందో, ఆయన సమాజాన్ని చూసే కోణాన్ని ఎలా మార్చారో వక్తలు కొనియాడారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ ఓబుల్ రెడ్డి హాజరయ్యారు. సాహితీ స్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షులు పిళ్ళా కుమారస్వామి మాట్లాడుతూ కష్టజీవులకు కుడి ఎడమల ఉండేవాడే కవి అని శ్రీశ్రీ పేర్కొన్నారని చెప్పారు. శ్రీశ్రీ అంటేనే విప్లవ కవిత్వానికి సంకేతం అని శ్రీశ్రీ కవిత్వం అనగానే అది కష్టజీవులు వైపు నిలబడే కవిత్వమని అందరికీ తెలుసు. శ్రీశ్రీ చరిత్రను చూసే విధానాన్ని మార్చాడు . పరస్పరం సంఘర్శించిన శక్తులలో చరిత్ర పుట్టెను అన్నాడు. అంటే చరిత్ర అనేది రాజుల చరిత్ర కాదు అది సమాజంలో ఉన్న రెండు వర్గాల మధ్య సంఘర్షణ అని చెప్పాడన్నారు . ఆ రెండు వర్గాలలో ఒకటి దోపిడీ చేసే వర్గం రెండోది దోపిడీ చేయబడుతున్న వర్గం, ఈ రెండు వర్గాలలో కవి ఎటువైపు ఉండాలో తేల్చుకోవాలన్నాడు. శ్రీ శ్రీ ఆకాశపు దారుల వెంట హడావిడిగా వెళ్లే కవిత్వాన్ని భూమార్గం పట్టించి భూకంపం సృష్టించాడని అన్నారు. తాజమహల్ నిర్మాణానికి కూలీలు ఎవరని చెబుతూ చరిత్ర నిర్మాణానికి ఎవరు సమాధి రాళ్లుగా ఉన్నారో గుర్తించాల్సిన అవసరాన్ని శ్రీశ్రీ చెప్పాడు అన్నారు. శ్రీశ్రీ జీవితం అనేక ఆటుపోట్ల కు గురైనా చివరకు ఆయన కమ్యూనిస్టు పార్టీ వైపు నిలబడ్డాడని అన్నారు. ఆయన నిబద్ధత ఆయన రాసిన కవిత్వ శైలి తర్వాత వారు ఎవరు అందుకోలేకపోయినారని అన్నారు. కవి కొత్తపల్లి రామాంజనేయులు మాట్లాడుతూ శ్రీ శ్రీ సాధారణ వ్యక్తి లా మసులుకొంటూ అసాధారణమైన ప్రతిభను కనబరిచి ప్రజల వైపు నిలబడ్డాడని అన్నారు. శ్రీశ్రీ గురించి నాలుగు మాటలు మాట్లాడటం అంటే ఆధునికతెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేయడమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కామనూరు శ్రీనివాసులు రెడ్డి, కెవిపిఎస్ నాయకులు నరసింహ , విశాలాంధ్ర బుక్ స్టాల్ నాగేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



