Home » Latest » గ్యాస్ దొంగల ఆటకట్టించిన తండ్రీకొడుకులు: సీపీ సజ్జనర్ చేతుల మీదుగా ఘన సత్కారం!

గ్యాస్ దొంగల ఆటకట్టించిన తండ్రీకొడుకులు: సీపీ సజ్జనర్ చేతుల మీదుగా ఘన సత్కారం!

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

➡️ గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం

➡️ ప్రశంసా పత్రంతో పాటు నగదు రివార్డు అందజేత

గ్యాస్ సిలిండర్ల సరఫరాలో సామాన్యుల కళ్లముందే జరుగుతున్న దోపిడీని అప్రమత్తతతో ఎండగట్టిన తండ్రీకొడుకులను హైదరాబాద్ పోలీస్ కమిషనర్  వీసీ సజ్జనర్ అభినందించారు. ధైర్యంగా గ్యాస్ మాఫియా గుట్టురట్టు చేయడాన్ని కొనియాడుతూ, శనివారం బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలో వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేసి, పౌర చైతన్యానికి మారుపేరుగా నిలిచారని ప్రశంసించారు. సమాజంలో జరుగుతున్న అక్రమాలపై ప్రతి పౌరుడు ఇలాగే చైతన్యంతో స్పందించినప్పుడే నేరరహిత సమాజం నిర్మించగలమని పేర్కొన్నారు.చూడిబజార్‌కు చెందిన వ్యాపారి అశోక్ తివారీ గత నెల 21న గ్యాస్ సిలిండర్ ను బుక్ చేశారు. డెలివరీ సమయంలో బరువు తక్కువగా ఉండటాన్ని ఆయన కుమారుడు 16 ఏళ్ల నమాన్ తివారి  గమనించారు. గత డెలివరీ సమయంలోనూ ఇలాగే సిలిండర్ రెండు కిలోలు తక్కువగా ఉందని తన తండ్రి దృష్టికి  తీసుకెళ్లారు. నిబంధనల ప్రకారం 30.4 కిలోలు ఉండాల్సిన సిలిండర్, కేవలం 28 కిలోల బరువు మాత్రమే ఉందని చెప్పారు. గత కొంతకాలంగా గ్యాస్ త్వరగా అయిపోతుండటంతో అనుమానం వచ్చి బరువు తనిఖీ చేయగా, సుమారు రెండు కిలోల గ్యాస్ తక్కువగా ఉన్నట్లు తేలింది.తనకు గ్యాస్ సిలిండర్ ను సరఫరా చేసే సిద్ధార్థ ఎంటర్‌ప్రైజెస్ ఏజెన్సీ ప్రతినిధులను ప్రశ్నించగా వారు దురుసుగా సమాధానం ఇచ్చారు. అయితే పట్టువదలని తండ్రీకొడుకులు దీనిపై ఆరా తీయగా, సదరు ఏజెన్సీ ఉద్యోగులు గ్యాస్‌ సిలిండర్లను జుమేరాత్ బజార్ లోని ఒక ఇంట్లో అక్రమంగా చిన్న సిలిండర్లలోకి, వాణిజ్య అవసరాల కోసం రీఫిల్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. బహిరంగ ప్రదేశాల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారంటూ గోషామహల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  కేవలం గ్యాస్ తక్కువగా ఇవ్వడమే కాకుండా, జనసమ్మర్దం ఉన్న ప్రాంతాల్లో అత్యంత ప్రమాదకర రీతిలో రీఫిల్లింగ్ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సిద్దార్థ ఎంటర్ప్రైజెస్ ఏజెన్సీతో పాటు ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సాయి కుమార్, వినీత్ కుమార్, పూస గణేష్, ప్రవీణ్ కుమార్, అమిత్ కుమార్ లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 2 కమర్షియల్, 7 డొమెస్టిక్, 12 చిన్న సిలిండర్లతో పాటు రీఫిల్లింగ్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

Share to...