తెలంగాణలో సాదా బైనామా భూములకు సంబంధించి తొందరలోనే పరిష్కారం చూపించబోతున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉగాది పండుగ శుభదినం సందర్భంగా ప్రకటించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి రైతును రాజుగా నిలబెట్టాలన్న సంకల్పంతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతి శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన శ్రీ పరాభవ నామ ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి , ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తో కలిసి పాల్గొన్నారు.
✅ శ్రీ పరాభవ నామ ఉగాది పంచాంగాన్ని ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు. ఈ నెల 22న రైతు భరోసా అందించబోతున్నామని తెలియజేస్తూ రైతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
✅ రైతు సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి పునరుద్ఘాటిస్తూ.. “ధరణి రూపంలో భూతమై రైతులను బాధ పెడుతున్న సందర్భంగా రైతులకు అండగా దాన్ని తరిమేసి భూ భారతితో రైతాంగ సమస్యలను పరిష్కరిస్తున్నాం. సాదా బైనామాకు సంబంధించి తొందరలోనే పరిష్కారం చూపించబోతున్నాం.
✅ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రైతాంగాన్ని గట్టెక్కించడానికి పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు బోనస్ కూడా ఇచ్చి ఆదుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లెక్కల మేరకు దేశంలో అతితక్కువ రుణభారం కలిగిన రైతులున్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉండటం గర్వకారణం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.



