పిళ్ళా కుమారస్వామి : అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళల హక్కులు, సమానత్వం, గౌరవం కోసం జరిగిన చారిత్రాత్మక పోరాటాలను గుర్తు చేసుకునే రోజు. మహిళల హక్కుల కోసం పోరాటం నిన్న మొన్నటి విషయం కాదు. 1908లో న్యూయార్క్ నగరంలోని వస్త్ర తయారీ రంగంలో పనిచేసే మహిళా కార్మికులు అమానవీయ దోపిడికి వ్యతిరేకంగా సమ్మెకు దిగారు. వీధుల్లో ప్రదర్శనలు నిర్వహిస్తూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పురుషులతో సమానంగా ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ పోరాటాల ఫలితంగా 1909లో అమెరికన్ సోషలిస్టు పార్టీ పిలుపుమేరకు ఫిబ్రవరి 28న అమెరికా అంతటా మొదటిసారి “నేషనల్ ఉమెన్స్ డే” జరుపుకున్నారు.
1910లో కోపెన్‌హాగెన్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళా సమ్మేళనంలో జర్మన్ నాయకురాలు క్లారా జెట్‌కిన్ మహిళల హక్కుల కోసం ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేక దినోత్సవాన్ని జరపాలని ప్రతిపాదించారు. తరువాత 1917లో రష్యాలో మహిళా కార్మికుల ఉద్యమాల తరువాత మార్చ్ 8ను మహిళా పోరాటాల ప్రతీకగా గుర్తించారు. *1975లో ఐక్యరాజ్యసమితి అధికారికంగా మార్చ్ 8ను అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా* ప్రకటించింది.
*భారతదేశంలో తొలి మహిళా సంఘం*
భారతదేశ చరిత్రలో మహిళలను సంఘటితం చేసి ఒక సంస్థగా ఏర్పాటుచేసిన తొలి ప్రయత్నం బౌద్ధ ధర్మంలో జరిగింది. మహిళా సంఘం స్థాపన విషయమై బుద్ధుడు మొదట కొంత వెనకడుగు వేశాడు. మహిళలకు ఎదురయ్యే భౌతిక ఇబ్బందులు, సామాజిక అవరోధాలు ఆధ్యాత్మిక సాధనకు అడ్డంకిగా మారవచ్చనే ఆలోచన ఆయనకు ఉండేది. అయితే ఆనందుడు చేసిన వాదనలతో, మహాప్రజాపతి గౌతమి పట్టుదలతో బుద్ధుడు చివరకు భిక్షుణీ సంఘాన్ని స్థాపించాడు. ఇది భారతదేశ చరిత్రలో తొలి మహిళా ఆర్గనైజేషన్‌గా చెప్పవచ్చు.
అంతకుముందు వేదకాలంలో గార్గి వంటి పండితులు ఉన్నప్పటికీ, మహిళలకు సమాన స్వేచ్ఛ లభించలేదు. గార్గి యాజ్ఞవల్క్యునితో తత్వవాదం చేసిన సందర్భంలో కూడా ఆమెను అణచివేసే ప్రయత్నాలు కనిపిస్తాయి. ఉపనిషత్తుల కాలంలో కూడా మహిళా స్వేచ్ఛకు పెద్దగా ప్రాధాన్యం లేదు.
పురాణకాలంలో స్త్రీలకు పాతివ్రత్యం వంటి నియమాలు విధించి, అనేక వ్రతాలు, ఆచారాల ద్వారా వారిని గృహబంధనాల్లో ఉంచారు. “మాతృదేవోభవ” అని మాటలలో గొప్ప స్థానం ఇచ్చినా, ఆ స్థానం ఆచరణలో కనిపించలేదు. చరిత్రలో అనేక మహర్షులు ఉన్నప్పటికీ మహిళలను సమాన శిష్యులుగా స్వీకరించిన ఉదాహరణలు చాలా తక్కువ.
ఈ పరిస్థితుల్లో మహిళల ఆధ్యాత్మిక మరియు సామాజిక సమానత్వాన్ని గుర్తించిన తొలి గొప్ప దార్శనికుడు బుద్ధుడే అని చెప్పవచ్చు. బౌద్ధ ధర్మంలో అనేక మహిళలు విద్యావంతులుగా, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి చేరుకున్నారు.
తరువాత కేరళలో శ్రీనారాయణ గురు స్త్రీలకు ఆధ్యాత్మిక స్వేచ్ఛను ప్రోత్సహించాడు. మహారాష్ట్రలో మహాత్మా జ్యోతిరావు ఫూలే మరియు సావిత్రీబాయి ఫూలే మహిళా విద్య కోసం గొప్ప ఉద్యమం చేశారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మా గాంధీ మహిళలను పెద్ద ఎత్తున ఉద్యమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించాడు.
ఆధునిక భారతదేశంలో మహిళల సమాన హక్కులకు రాజ్యాంగ పరంగా బలమైన పునాది వేసింది డా. బి.ఆర్. అంబేడ్కర్. రాజ్యాంగంలో సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం వంటి ప్రజాస్వామ్య సూత్రాలు మహిళల అభ్యున్నతికి మూలస్థంభాలుగా నిలిచాయి. అందువల్ల బుద్ధుడితో ప్రారంభమైన మహిళా సమానత్వ ఉద్యమం అంబేడ్కర్ కాలంలో మరింత బలపడిందని చెప్పవచ్చు.
ప్రస్తుత కాలంలో మహిళల పరిస్థితి
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి మహిళల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఉపాధి కోల్పోవడం వల్ల మహిళలు సుమారు 800 బిలియన్ డాలర్ల ఆర్థిక నష్టాన్ని చవిచూశారు. 2021లో దాదాపు 47 మిలియన్ల మహిళలు పేదరికంలోకి జారిపోయారు. మన దేశంలో కూడా పరిస్థితి భిన్నంగా లేదు. అసంఘటిత రంగంలో పనిచేసే మహిళల ఆదాయాలు తగ్గిపోయాయి. గృహపని భారం పెరిగింది. గృహహింస ఘటనలు కూడా పెరిగాయి.
గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2021 ప్రకారం ప్రపంచంలోని 156 దేశాల్లో భారతదేశం 140వ స్థానంలో ఉంది. ఇది మహిళా సమానత్వంలో మన దేశం ఇంకా వెనుకబడి ఉందని సూచిస్తుంది.
యునెస్కో మరియు ఐక్యరాజ్యసమితి పిలుపు
యునెస్కో మరియు ఐక్యరాజ్యసమితి సంస్థలు మహిళల సాధికారతను పెంపొందించడానికి విద్య, ఆర్థిక స్వావలంబన, మహిళలపై హింస నిర్మూలన, మరియు నిర్ణయాత్మక వ్యవస్థల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలని ప్రపంచ దేశాలకు పిలుపునిస్తున్నాయి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో కూడా లింగ సమానత్వం కీలక లక్ష్యంగా ఉంది.
పురాణాల కాలం నుండి నేటి ఆధునిక యుగం వరకు మహిళలపై అణచివేత రూపం మారినప్పటికీ పూర్తిగా తొలగిపోలేదు. చట్టాలు ఉన్నప్పటికీ అవి సమర్థంగా అమలవ్వాలి. సమాజం మొత్తం మహిళలకు సమాన హక్కులు, గౌరవం మరియు భద్రత కల్పించే దిశగా కృషి చేయాలి.
ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన పోరాటం ప్రచార ఆర్భాటాల నుండి నిజమైన హక్కులు, సమాన అవకాశాలు మరియు మహిళా సాధికారత వైపు సాగాలి.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో



