అనంతపురంలో మాట్లాడుతున్న టిడిపి నాయకులు
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ను జోక్ క్యాలెండర్ అంటూ కామెంట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ వ్యాఖ్యలపై అనంతపురం అర్బన్ టిడిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యల్ని నిరసిస్తూ నగరంలోని టవర్ క్లాక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. తాటిపర్తి చంద్రశేఖర్ దిష్టిబొమ్మతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బన్ టిడిపి నాయకులు మాట్లాడుతూ గత ఐదేళ్లలో ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా నిరుద్యోగ యువతను మోసం చేసిన వ్యక్తి జగన్ రెడ్డి అని విమర్శలు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంత్రి నారా లోకేష్ 16 వేలకు పైగా పోస్టులతో మెగా డీఎస్సీ విడుదల చేశారని… ఇప్పుడు మరో 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు విడుదల చేసిన జాబ్ కేలండర్ లో కూడా ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారని తేదీలు కూడా ప్రకటించడం మంత్రి నారా లోకేష్ నిబద్ధతకు అది నిదర్శనమన్నారు. మరోసారి కూటమి ప్రభుత్వంపై కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.



