తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో( Municipal Elections ) కీలక పరిణామం. ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా ఇక్కడ బిజెపికి మద్దతు ప్రకటించింది జనసేన. ఈ విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించినట్లు తెలుస్తోంది. దీంతో బిజెపిలో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. మరోవైపు బిజెపికి మద్దతుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారని కూడా తెలుస్తోంది. ఫిబ్రవరి 7, 8 తేదీల్లో పవన్ కళ్యాణ్ తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం కూడా చేయనున్నట్లు సమాచారం. తెలంగాణ బిజెపి ముఖ్య నేతలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను హైదరాబాదులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బిజెపి చీఫ్ రామచంద్రరావు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో జనసేన మద్దతు బిజెపికి ఇవ్వాలని కోరారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు. వారి మధ్య సంతృప్తికర స్థాయిలో భేటీ జరిగింది.
* అధికారిక ప్రకటన..
మరోవైపు తెలంగాణలో పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) బిజెపి తరఫున ప్రచారం చేస్తారని జనసేన కేంద్ర కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. ఎన్నికల ప్రచారానికి సంబంధించి రూట్ మ్యాప్ ను త్వరలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అయితే మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి తనదైన దూకుడు కనబరుస్తోంది. పట్టణాలతో పాటు నగరాల్లో ఆ పార్టీకి పట్టు ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎనిమిది ఎంపీ అభ్యర్థులను గెలుచుకుంది బిజెపి. దీని వెనుక పట్టణ ఓటర్లు ఉన్నారు.. అందుకే ఈసారి పట్టు బిగించాలని చూస్తోంది భారతీయ జనతా పార్టీ. దీనికి జనసేన సహకారం తోడైతే మాత్రం ఆ పార్టీకి కొండంత అండ. అధికార కాంగ్రెస్ పార్టీకి ధీటుగా బిజెపి సమాధానం చెప్పే అవకాశం ఉంది.
* గులాబీ పార్టీ అంతంత మాత్రం..
మరోవైపు గులాబీ పార్టీ మున్సిపల్ ఎన్నికలపై పెద్దగా దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. అక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని ఆ పార్టీకి తెలుసు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో గులాబీ పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ఒక్క గ్రేటర్ లో తప్పించి మిగతా చోట్ల ఆ పార్టీకి షాక్ తగిలింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అయితే ఎంపీ అభ్యర్థులంతా ఓడిపోయారు. ఒక్కచోట కూడా గెలవలేదు. మున్సిపల్ ఎన్నికల్లో పరిస్థితి అలానే ఉంటుందని ఒక అంచనా ఉంది. అయితే ఇప్పుడు గులాబీ పార్టీ ప్లేస్ లోకి వచ్చి బిజెపి గట్టిగానే పోరాటం చేస్తోంది. అధికార కాంగ్రెస్కు దీటైన సమాధానం చెబుతోంది.
* మెగా అభిమానులు అధికం..
తెలంగాణలో మెగా అభిమానులు( Mega fans ) ఎక్కువ. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు విపరీతమైన అభిమాన గణం ఉంది. పట్టణ ప్రాంతాల్లో జనసేన తన ఉనికి చాటుకుంటూ వస్తోంది. అటువంటి చోట భారతీయ జనతా పార్టీకి పవన్ కళ్యాణ్ మద్దతు తెలపడం కలిసి వచ్చే అంశం. ఇప్పటికే ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో నువ్వా నేనా అన్నట్టు తలపడుతోంది బీజేపీ. ఇక్కడ ఉనికి కోసం గులాబీ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే పవన్ కళ్యాణ్ బిజెపికి మద్దతు తెలపడం మాత్రం ఆ పార్టీకి ప్లస్ గా మారనుంది. పవన్ కళ్యాణ్ బిజెపికి మద్దతుగా చేస్తున్న ప్రచారం అన్నిచోట్ల సక్సెస్ అయ్యింది. ఇక్కడ కూడా బిజెపికి వరం గా మారే అవకాశం ఉంది. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలని చూస్తోంది బిజెపి. దానికి రిహార్సల్స్ గా ఈ ఎన్నికను భావిస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దిస్తోంది. కనీసం సగం స్థానాలు దక్కించుకున్నా బిజెపికి తిరుగు లేనట్టే. మొత్తానికి అయితే తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ద్వారా పట్టు పెంచుకోవాలని చూస్తోంది బిజెపి. చూడాలి తెలంగాణలో పవన్ ప్రయోగం ఎంతవరకు బిజెపికి సక్సెస్ ఇస్తుందో?



