తెలంగాణ( Telangana) పాలకులు చేయలేనిది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసి చూపించారు. తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ ఆలయానికి 35 కోట్ల రూపాయల టీటీడీ నిధులను మంజూరు చేయించారు పవన్ కళ్యాణ్. కొండగట్టులో 100 గదులతో ధర్మశాల నిర్మించనున్నారు. భక్తుల సౌకర్యార్థం వీటిని తీర్చిదిద్దనన్నారు. పవన్ కళ్యాణ్ చొరవపై తెలంగాణ బిజెపి నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజమైన అంజన్న భక్తుడు పవన్ అంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ అభినందనలు తెలిపారు. తెలంగాణకు 14 సంవత్సరాలు పాలించిన కేసీఆర్ ముఖం ఎక్కడ పెట్టుకుంటారు అన్నట్టు మాట్లాడారు.
జగిత్యాల( jagityala ) జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఉంది కొండగట్టు ఆంజనేయ ఆలయం. ఈ ఆలయం అంటే పవన్ కళ్యాణ్ కు విపరీతమైన సెంటిమెంట్. ఇష్ట దైవంగా భావిస్తారు పవన్ ఈ ఆలయాన్ని. గతంలో ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు సమయంలో.. తరువాత జనసేన ఆవిర్భావ సమయంలో ఈ ఆలయాన్ని సందర్శించి నిర్ణయం ప్రకటించారు పవన్ కళ్యాణ్. మొన్నటి ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా వారాహి యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ వారాహి వాహనానికి ఇదే ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు పవన్ కళ్యాణ్. అదే వారాహి విజయవంతం అయ్యింది. ఎన్నికల్లో పవన్ అధికారంలోకి రాగలిగారు. వెంటనే కొండగట్టు ఆలయాన్ని సందర్శించారు. ఆ క్రమంలో అక్కడి ఆలయ అధికారులు ప్రత్యేక వినతి ఇచ్చారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక గదులు నిర్మించాల్సి ఉందని చెప్పుకొచ్చారు. తప్పకుండా తన వంతు సహకారం ఉంటుందని పవన్ హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు 35 కోట్ల రూపాయలను మంజూరు చేయించారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( deputy CM Pawan Kalyan)చొరవ పై తెలంగాణ సమాజం హర్షం వ్యక్తం చేస్తోంది. ఇప్పటివరకు పవన్ పై నెగిటివ్ భావన ఉన్నవారు సైతం అభినందించక తప్పడం లేదు. అయితే ఇప్పటికే హిందుత్వవాదంతో పాటు సనాతన ధర్మ పరిరక్షణ కోసం గట్టిగానే పోరాటం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. తెలంగాణలో ప్రముఖ ఆలయానికి భారీ స్థాయిలో నిధులు కేటాయించడంతో పవన్ పట్ల సానుకూలత పెరిగింది. అదే సమయంలో పవన్ తీరును అభినందిస్తున్నారు బిజెపి నేతలు.
మరోవైపు ఇదే కొండగట్టు ఆలయాన్ని( Kondagattu Temple) అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. యాదాద్రి ఆలయ మాదిరిగా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు వేసింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చొరవతో 35 కోట్ల రూపాయలు టీటీడీ నిధులు మంజూరయ్యాయి. దీంతో ఆలయ అభివృద్ధి మరింత జరగనుంది. ఈ క్రమంలో రాజకీయాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఈ విషయాన్ని తెలంగాణ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. తద్వారా బిజెపి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటుందన్న కెసిఆర్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చినట్లు అవుతోంది. తెలంగాణలో వచ్చే ఎన్నికల నాటికి పవన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారే అవకాశం కూడా ఉంది.



