తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. వచ్చే ఏడాది జరగనున్నాయి. ఇప్పటివరకు డీఎంకే వర్సెస్ అన్నాడీఎంకే కూటమిల మధ్య పోటీ నడిచింది. జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ ప్రాంతీయ పార్టీల కింద పనిచేస్తూ వచ్చాయి. అయితే అంతలా ఉంటుంది తమిళనాడులో ప్రాంతీయ పార్టీల ప్రభావం. ఇటువంటి తరుణంలో సినీ నటుడు విజయ్ నేతృత్వంలో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. అయితే నేరుగా పోటీ చేస్తే గెలవడం కాదు కానీ.. ప్రత్యర్థి పార్టీల గెలుపోవటములను ప్రభావితం చేయగలదు. అందుకే విజయ్ పొత్తుల ఆలోచన దిశగా ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆయన భారతీయ జనతా పార్టీ విషయంలో సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
తమిళనాడులో సినీ పరిశ్రమకు చెందిన చాలామంది పార్టీలను ఏర్పాటు చేశారు. విజయ్ కాంత్ పార్టీని సుదీర్ఘకాలం నడిపారు. పొత్తుల్లో భాగంగా ఆయన పార్టీ మంచి సీట్లు సాధించింది. కానీ ఆయన అకాల మరణంతో ఆ పార్టీ మనుగడ కష్టతరంగా మారింది. కమల్ హాసన్ సైతం రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. కానీ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. సూపర్ స్టార్ రజినీకాంత్ పార్టీని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించి విరమించుకున్నారు. అయితే ఇప్పుడు విజయ్ పార్టీని ఏర్పాటు చేసి తమిళనాడులో సత్తా చాటాలని చూస్తున్నారు. కానీ అది ఆయనకు ఒంటరిగా వీలు కాదు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తమిళనాడులో విజయ్ అభిప్రాయం క్రమేపి మారుతోంది. ప్రారంభంలో బిజెపిని సైదాంతిక శత్రువుగా ప్రకటించారు విజయ్. కానీ గత కొద్ది రోజులుగా బిజెపి పై ఎటువంటి విమర్శలు చేయడం లేదు. విజయ్ తన పార్టీ తొలి బహిరంగ సభలో డీఎంకేను రాజకీయ శత్రువుగా, బిజెపిని సైతాంతిక శత్రువుగా పేర్కొన్నారు. అయితే ఇటీవల ఓటర్ల జాబితా సవరణ, వన్ నేషన్ వన్ ఎలక్షన్ వంటి అంశాలపై కేంద్రాన్ని నేరుగా విమర్శించలేదు. రాష్ట్ర ప్రభుత్వంపై ఎక్కువ విమర్శలు చేశారు. కేంద్రం పై విమర్శలు చేస్తే రాష్ట్రంలో డీఎంకేకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉన్నందునే.. ఆయన తన పూర్తి ఫోకస్ను అధికార డిఎంకె పై పెట్టినట్లు తెలుస్తోంది.
తమిళనాడులో ఒంటరి పోరాటం అంటే కుదరదు. అందునా బలంగా ఉన్న డీఎంకేను ఢీ కొట్టాలంటే కూటమి అనివార్యం. ప్రస్తుతం తమిళనాడులో కూడా బిజెపి బలమైన స్థానాన్ని కోరుతోంది. ప్రత్యక్షంగా బిజెపితో పొత్తు పెట్టుకోకపోయినా.. అన్నా డీఎంకేతో కలిసి మూడో కూటమి ఏర్పాటు చేసే దిశగా విజయ్ అడుగులు వేస్తున్నట్లు సమాచారం. అందుకే బిజెపిని అనవసరంగా కెలకకూడదని విజయ్ భావిస్తున్నారు. వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు. కరూర్ తొక్కిసలాట ఘటన విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థల ఒత్తిడితో కూడా విజయ్ సాఫ్ట్ కార్నర్ అనుసరిస్తున్నట్లు విమర్శ ఉంది.
ఏపీలో పవన్ అనుసరిస్తున్న తీరును గమనించారు విజయ్. పవన్ కళ్యాణ్ సైతం ఒంటరిగా పోటీ చేసి ఏపీలో అధికారం అనేది అసాధ్యమని భావించి పొత్తులు పెట్టుకున్నారు. కూటమి కట్టి శత శాతం విజయం సాధించారు. తమిళనాడులో సైతం విజయ్ అటువంటి ప్రయత్నమే చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ అన్న డీఎంకేకు బలమైన క్యాడర్ ఉంది. కేంద్రంలో బిజెపి అధికారంలో ఉంది. తమిళనాడు యువతలో విజయ్ కు క్రేజ్ ఉంది. ఇవన్నీ కలిస్తే తమిళనాడులో అద్భుత విజయం సొంతం చేసుకోవచ్చని విజయ్ ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే బిజెపి విషయంలో విమర్శలు చేయకుండా జాగ్రత్తలు పడినట్లు సమాచారం.



