Home » Culture » MoralStories: అత్తగారి అమెరికా కల 

MoralStories: అత్తగారి అమెరికా కల 

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

(యం.వి.రామారావు, సీనియర్ జర్నలిస్ట్ )

అనసూయమ్మ గారికి ఆరుగురు కూతుళ్లు.అల్లుళ్లు అందరూ ఆమె అంటే భయభక్తులతో ఉండేవారు.అందరూ పిల్లాపాపలతో బాగానే ఉన్నారు.ఆమె కుటుంబం మొత్తం 35 మంది ఉన్నారు. ఆమెకు 80 ఏళ్లు వచ్చినా అమెరికా చూడలేకపోయాననే బాధ పట్టిపీడుస్తుండేది. అమెరికాలో ఉన్న మనవళ్లు అన్నా తీసుకు వెళతారని ఆశపడేది. ఎందుకంటే అప్పటికే ఆమె రెండు సార్లు లండన్ వెళ్లి వచ్చింది. అందులోనూ ఒక కూతురు అమెరికాలో ఉంటున్నది.ఆమెతో పాటు వెళ్లాలని ఆశపడేది. లండన్ 60 ఏళ్ల లోపే వెళ్లి వచ్చింది. ఆరుగురు కూతుళ్ళు తల్లిని బాగా చూసుకునేవారు.చూసుకోవటమంటే ఆమె నోరుకు భయపడేవారేనేది వాస్తవం. ముదిమి వయస్సులో తనను చూసుకోవాల్సిన బాధ్యత తన పిల్లలకు ఉందని నమ్మేది.వారే చూసుకోవాలని వాదించేది.అందుకు భిన్నంగా జరిగితే ఊరుకునేది కాదు.నేను వాళ్లను చిన్నతనం నుంచి పెంచి పోషించాను.ఈ వయసులో నన్ను చూడాల్సిందేనని గట్టిగా పట్టిపట్టేది. భర్త పోయినా పిల్లలకు ఏ లోటూ రాకుండా చూసేది.ముగ్గురు పిల్లల పెళ్లి భర్త ఉండగానే జరిగింది.మిగిలిన పిల్లలను చదివించడం,పెళ్లి ఆమే చేసింది.అందరూ బాగానే ఉన్నారు.పిల్లలు,వారి పిల్లలంటే బాగా ప్రేమగానే ఉండేది.తేడా వేస్తే మాత్రం ఝాడించేది. ఒక కూతురు లండన్లో ఉండేది.ఆమె దగ్గరకు రెండు సార్లు వెళ్లివచ్చింది.లండన్ పరిసరాలు చూసి వచ్చింది.ఇక సందర్భం వేస్తే లండన్ కబుర్లు చెబుతునే ఉండేది. అమెరికాలో ఉన్న మరో కూతురు వద్దకు వెళ్లాలనే కోరిక తీవ్రంగా ఉండేది.ఆమె తన కుటుంబంతో ప్రతి ఏడాది వస్తుండడంతో ఆ కోరిక తీరలేదు. మనవలు,మనవరాళ్లు ఆమెను ఆటపట్టిస్తానికి “అమెరికా వెళ్లాలా అమ్మమ్మా “అని అడిగితే ఏం ‘ఎందుకు వెళ్లను’ అనేది.

తాను లండన్ ఎలా విమానంలో వెళ్లింది,విమానాశ్రయంలో చెకింగ్ ఇతర వివరాలను పూసగుచ్చినట్లు చెప్పేది.అలా లండన్ కబుర్లు చెప్పడం సరదా.ఎవరన్నా ఆమెను కదిపితే చాలు గంట సేపు ఆ కబుర్లు చెబుతునే ఉండేది.అలాగే అమెరికా వెళ్లి రావాలని,అక్కడ కబుర్లు తన బంధువులకు చెప్పాలని ఉవ్విళ్లూరేది.కాని పెద్దది అయింది ప్రయాణం చేయలేదని కూతుళ్లకు ఆమెను అమెరికా పంపడం ఇష్టం ఉండేదికాదు.

ఆవిడ కూతుళ్లు, వారి సంతతిలో ఏ శుభకార్యం జరిగినా హైదరాబాద్ లో అందరూ కలిసేవారు. మొత్తం కుటుంబం కూతుళ్లు,అల్లుళ్లు,వారి పిల్లలు,పిల్లల పిల్లలు మొత్తం హాజరయ్యేవారు. వారందరి లో ఆమె హైలైట్ గా ఉండేది.

కూతుళ్లు ఆరుగురు ఒకచోట కలిస్తే ఇంకా వారి లోకమే వేరు. అల్లుళ్లు ఆరుగురు అత్తగారితో సరదాగా మాట్లాడితే ఆవిడ కూతుర్లు ‘ఏమిటి అలా మాట్లాడతారు’,మా అమ్మకు కోపం వస్తుందని వారించేవారు. అలా 82 ఏళ్ల వయస్సులో కూడా ఆవిడే శివగామి లాగా పెత్తనం చేసేది.

ఆవిడకు ప్రత్యేకంగా ఇల్లు ఉండేది. పక్కనే ఒక కూతురు ఉండేది. ఇంట్లో తన భర్త కొన్న సామానులను ప్రాణం గా చూసుకుంటుంది.వాటి రిపేరు వస్తే బాగు చేయించేది. సోఫా,డైనింగ్ టేబుల్,టేబుల్ ఫ్యాన్ తదితరాలు 35 ఏళ్లుగా తన భర్త కొన్నవని జాగర్తగా కాపాడేది.పాతపడిపోయాయంటే ఊరుకునేది కాదు. ఆరోగ్యం ఏమాత్రం చిన్న తేడా వచ్చినా డాక్టర్ వద్దకు తీసుకువెళ్లే వరకూ ఊరుకునేది కాదు. ప్రతిరోజూ కూతుళ్లకు ఫోన్ చేసి మాట్లాడేది.అందరి క్షేమ సమాచారాలు కనుక్కుని మిగిలినవారికి సమాచారం చేరవేసేది.80 వచ్చిన తరువాత కూతుళ్ల వద్దే ఉంటున్నది.ఎవరివీలును బట్టి వారు తీసుకుని వెళ్లేవారు.మధ్యమధ్యలో తన ఇంటికి వచ్చి ఉండేది.ఇటీవల కూతుళ్లు తమకు కుదరక ఆమెకు తోడు వంట మనిషిని పెట్టారు.కాని అది ఆమెకు ఇష్టం ఉండేది కాదు. నన్ను నా కూతుళ్లు మాత్రమే చూడాలని పట్టుదలతో ఉండేది.అందుకోసం వంట మనిషిని పంపించే ప్రయత్నం చేసేది.అలా ముగ్గురు మానేసిన తరువాత కాని కూతుళ్లకు తెలియలా అసలు విషయం.చివరకు వాళ్లే రాజీకి వచ్చి మేమువస్తునే ఉంటాం వంటమనిషిని పంపవద్దని బతిమాలి ఒప్పించారు.

ఇక ఆరుగురు అల్లుళ్ల విషయానికి వస్తే వారు ఆమెకు ప్రత్యేక గౌరవం ఇవ్వాలని భావించేది.దానిలో ఏమాత్రం తేడా వచ్చినా మోహమాటం లేకుండా వాయించేది.సరదాకి మీ అమ్మాయిని మీ ఇంటికి పంపేస్తామని అంటే పంపండి నా కూతురు నావద్ద హాయిగా ఉంటుందని అనేదికాని,తన కూతురుని తక్కువగా చూస్తే ఊరుకునేది కాదు.కూతుళ్లలో ఎవరి ఇంటికి కన్నా వెళ్లి వచ్చిందంటే వారి గురించి గొప్పలు చెప్పి మిగతావారిని ఊదరగొట్టేసింది.అంతా మంచే చెప్పేది.

అల్లుళ్లు,కూతుళ్లు ఎక్కడికన్నా టూర్ వెళితే తీసుకుపోవాలని ఆశించేది.తీసుకుపోకపోతే అలిగేది.మోకాళ్ల నెప్పులు వచ్చినా దేకుతూనైనా బయలుదేరేది. అల్లుడి ఇంట్లో ఉన్నా అత్తగారిని ప్రతిరోజు పలకరించపోతే కూతురికి ఫిర్యాదు చేసేది.దాంతో మా అమ్మతో మాట్లాడకపోతే ఆమెకు కోపం వస్తుందని కూతురు బెదిరించేది.అల్లుడు చచ్చినట్లు “అత్తయ్య గారూ బాగున్నారా…విశేషాలు ఏమిటని” అడిగి అరగంట సేపు ఆవిడ మాటలు వింటే గాని తృప్తి పడేది కాదు. 

అందరూ అల్లుళ్లు కలిసినప్పుడు “అత్తగారూ..ఆరుగురు అల్లుళ్లు” అంటూ జోకులు వేసుకునే వాళ్లు.ఆవిడ గురించి సరదాగా చెప్పుకునేవారు.

మా చిన్నప్పుడు సినీ నటి భానుమతీ “అత్తగారూ-అవకాయ వంటి సరదా కథలు రాసేవారు.అలా అత్తగారూ- ఆరుగురు కూతుళ్లు,అల్లుళ్లు అంటూ సరదా కబుర్లులతో భలే కాలక్షేపం అయ్యేది.

ఎంతైనా అనసూయమ్మ లాంటి అత్తగారు ఉండడం చాలా గ్రేట్. ఈనాటికీ అందరిలో తన ప్రాముఖ్యత తగ్గితే ఊరుకోని అత్తగారు ఉండడం భలే తమాషా కదూ….అలాంటి మనుషులు మన కుటుంబాల్లో ఉండడం నిజంగా సంతోషమే కదా.”అత్తగారూ జిందాబాద్” అనుకోని అల్లుడు లేడంటే అతిశయోక్తికాదు.ఎందుకంటే వాళ్ల అమ్మని ఎమన్నాఅంటే భార్యలు సాధించి చంపుతారు కదా…అందుకే అల్లుళ్లు ” అత్తగారూ జిందాబాద్” అనక చస్తారా….సరాదాకండీ బాబూ…మా అత్తగారు నిజంగా గ్రేట్.

Share to...