సుజనా చౌదరి( Sujana Chaudhari ).. పరిచయం అక్కర్లేని పేరు ఇది. కేంద్ర మంత్రిగా సుపరిచితులు. ప్రస్తుతం బిజెపిలో ఎమ్మెల్యేగా ఉన్నారు. రాష్ట్రమంత్రి అవుతారని భావించి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కానీ సమీకరణల దృష్ట్యా ఆయనకు చాన్స్ దక్కలేదు. అయినా సరే ఎమ్మెల్యేగా విశేష సేవలు అందిస్తున్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలను ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పై ఫుల్ ఫోకస్ పెడుతున్నారు.
గత రికార్డులను తిరగరాసి విజయవాడ( Vijayawada) పశ్చిమ స్థానం నుంచి గెలిచారు సుజనా చౌదరి. ఆ సీటు ఎప్పుడు హాట్. వైశ్యులతో పాటు ముస్లింల ప్రాబల్యం ఉన్న ప్రాంతం. అయినా సరే కమ్మ సామాజిక వర్గానికి చెందిన సుజనా చౌదరి ఘన విజయం సాధించారు. అప్పటివరకు జనసేన లో ఉండి టికెట్ ఆశించారు పోతిన మహేష్. సుజనా చౌదరికి ఇవ్వడాన్ని సహించుకోలేక పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇన్ని ప్రతికూలతల మధ్య బిజెపి అభ్యర్థిగా బరిలో దిగిన సుజనా చౌదరి ఘనవిజయం సాధించారు. దీనికి వన్ అండ్ ఓన్లీ కారణం ఆయనే. క్లీన్ ఇమేజ్ ఉండడంతో తమ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ప్రజలు ఆయనకు అవకాశం ఇచ్చారు.
* క్షేత్రస్థాయిలో పర్యటనలు..
అయితే తనపై పశ్చిమ నియోజకవర్గ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు సుజనా చౌదరి. తన నియోజకవర్గంలో చేపడుతున్న పనులను నిశితంగా పరిశీలించడంతో పాటు లోటుపాట్లను కూడా గుర్తిస్తున్నారు. అధికారులు చెప్పారని.. స్థానికంగా ఉన్న నాయకులు వచ్చి కోరారని కాకుండా క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలను స్వయంగా తెలుసుకుని.. ఆయా పనులకు ప్రాధాన్యమిస్తున్నారు. ఇటీవల పశ్చిమ నియోజకవర్గంలో 80 లక్షల రూపాయలతో ఓ ప్రాజెక్టును ప్రారంభించాలని అధికారులు ఆయనను కోరారు. స్వయంగా పరిశీలించిన సుజనా చౌదరి 80 లక్షలు ఎందుకు ఖర్చు అవుతుందో చెప్పాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను కోరారు. 40 నుంచి 50 లక్షలతో పూర్తి చేయవచ్చని తేల్చి చెప్పారు. ఆ పనులను చేపట్టేందుకు ముందుకు వచ్చిన కాంట్రాక్టర్లను కూడా తప్పించి.. తక్కువ ఖర్చుతో పనులు పూర్తయ్యేలా కాంట్రాక్టర్లను ఒప్పించారు. తద్వారా ప్రజలకు అవసరమైన విధంగా.. ప్రజలు కోరుకుంటున్న విధంగా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే క్రమంలో సుజనా చౌదరి కీలక పాత్ర పోషిస్తున్నారు.
* టిడిపిలో సుదీర్ఘకాలం..
తెలుగుదేశం( Telugu Desam ) పార్టీలో సుదీర్ఘకాలం పని చేశారు సుజనా చౌదరి. ఆయన స్వగ్రామం కృష్ణా జిల్లా కంచికచర్ల. ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసిన ఆయన పారిశ్రామిక రంగంలో అడుగుపెట్టి అనతి కాలంలోనే ఉత్తమ పారిశ్రామికవేత్తగా నిలిచారు. సుజనా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ స్థాపించి రాజకీయాల్లో ప్రవేశించే వరకు విశేష సేవలు అందించారు. తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చి వివిధ హోదాల్లో పనిచేశారు. 2010లో తొలిసారిగా టిడిపి తరఫున రాజ్యసభ సభ్యుడు అయ్యారు. 2014 నుంచి 2018 వరకు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అయితే 2019 ఎన్నికల అనంతరం టిడిపి నుంచి బిజెపి గూటికి వెళ్లారు సుజన. 2024 ఎన్నికల్లో పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి పదవి ఆశించారు. దక్కకపోయినా ఎటువంటి అసంతృప్తికి గురి కాలేదు.
* ఎనలేని ప్రాధాన్యం..
బిజెపి( Bhartiya Janata Party) హై కమాండ్ సుజనా చౌదరికి ఎనలేని ప్రాధాన్యమిస్తోంది. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ భవిష్యత్తు రాజకీయాల దృష్ట్యా బీసీలకు ఇవ్వాలని భావించి పివిఎన్ పేరును ఖరారు చేసింది. త్వరలో మంత్రివర్గ విస్తరణలో సుజనా చౌదరికి చాన్స్ ఖాయమని ప్రచారం నడుస్తోంది. జాతీయస్థాయిలో బిజెపిలో కీలక పదవి దక్కనున్నట్లు సమాచారం. మరోవైపు వచ్చే ఎన్నికల్లో సుజనా చౌదరి ఎంపీగా పోటీ చేసి కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కించుకుంటారన్న ప్రచారం కూడా ఉంది. ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా తన మార్కు చూపిస్తున్నారు సుజన. అటు అసెంబ్లీ తో పాటు నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి ఫలాలను అందిస్తున్నారు.



