ఆమె వృత్తిరీత్యా డాక్టర్. ప్రజలకు వైద్య సేవలతో పాటు ప్రజాసేవ చేయాలని బలమైన సంకల్పం పెట్టుకున్నారు. అందుకు గ్రూప్ 1 అధికారి అయితే మేలన్న నిర్ణయానికి వచ్చారు. డాక్టర్ గా సమాజంలో గుర్తింపు పొందేందుకు.. ఆర్థికంగా వృద్ధి సాధించేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నా.. ఆమె మాత్రం ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో గ్రూప్ 1 పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. ఏకంగా టాపర్ గా నిలిచి సత్తా చాటారు డాక్టర్ లక్ష్మీ దీపిక( Dr Lakshmi Deepika). గతంలోనూ తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లోనూ ప్రధమ ర్యాంక్ సాధించారు. కానీ ఏపీ నుంచి ఎంపిక కావాలని బలమైన ఆకాంక్షతో ముందుకు సాగారు. అనుకున్నది సాధించగలిగారు. ప్రస్తుతం డాక్టర్ లక్ష్మీదీపిక గురించి బలమైన చర్చ నడుస్తోంది తెలుగు రాష్ట్రాల్లో.
* రెండు రోజుల కిందట ఫలితాలు..
ఏపీ ప్రభుత్వం ఏపీపీఎస్సీ ( APPSC ) గ్రూప్ 1 ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. 89 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలు నిర్వహించారు. రెండు రోజుల కింద ఫలితాలను ప్రకటించారు. రెండు పోస్టులను మినహాయించి మిగిలిన 83 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో లక్ష్మీ దీపిక టాపర్గా నిలిచారు. ఆమె గురించి మరో ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. గతంలో వెల్లడించిన తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లో కూడా లక్ష్మీదీపిక స్టేట్ టాపర్ గా నిలవడం గమనార్హం. తాజాగా ఏపీ గ్రూప్ 1 రిజల్ట్ లో కూడా టాపర్గా నిలవడం మరోసారి ఆమె పేరు మార్మోగిపోతోంది. స్థానికేతర కోటాలో దరఖాస్తు చేసిన లక్ష్మీదీపిక ఏకంగా మొదటి ర్యాంకు సాధించి సంచలనం సృష్టించారు.
* తల్లిదండ్రులది ఏపీ నేపథ్యం.. హైదరాబాదులో( Hyderabad) పుట్టి పెరిగారు లక్ష్మీ దీపిక. అయితే తండ్రి కృష్ణది అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం.. తల్లి పద్మావతి ది పశ్చిమగోదావరి జిల్లా. లక్ష్మీ దీపిక విద్యాభ్యాసం అంతా హైదరాబాదులోనే కొనసాగింది. ఈ క్రమంలో ఆమె గతంలో తెలంగాణలో నిర్వహించిన గ్రూప్ 1 లో స్టేట్ టాపర్గా నిలిచి డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ సాధించారు. ప్రస్తుతం అక్కడ శిక్షణ తీసుకుంటున్నారు. అయితే తాజాగా ఏపీలో కూడా స్టేట్ టాపర్ గా నిలవడంతో ఇక్కడ కూడా డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ వచ్చింది. అయితే ఈ రాష్ట్రంలో కొనసాగాలన్న నిర్ణయం తీసుకోలేదు.
* విద్యాభ్యాసం అంతా హైదరాబాదులో..
ఎంబిబిఎస్( MBBS) పూర్తి చేశారు లక్ష్మీ దీపిక. ప్రజాసేవ చేయాలన్న ఆలోచనతో గ్రూప్ 1 రాయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ దిశగా ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. లక్ష్మీ దీపిక పదో తరగతి వరకు హైదరాబాదులోని సఫిల్ గూడా డి ఏ వి స్కూల్లో చదువుకున్నారు. ఆ తరువాత నారాయణగూడ లోని శ్రీ చైతన్యలో ఇంటర్ పూర్తి చేశారు. 2013లో మెడిసిన్ లో 119 వ ర్యాంకు సాధించి ఉస్మానియా యూనివర్సిటీ మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ పూర్తి చేశారు. ఆ తరువాత సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతూ వచ్చారు. అలా 2023 ఏపీ గ్రూప్ 1 ఫలితాల్లో ఎంపీడీవో పోస్ట్ వచ్చింది. కానీ చేరలేదు. యుపీఎస్సీపై దృష్టి పెట్టారు. రెండుసార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లారు.. అయితే ఇప్పుడు తెలంగాణతో పాటు ఏపీ గ్రూప్ 1 ఫలితాల్లో టాపర్గా నిలవడం విశేషం. అయితే ఆమె గ్రూప్ 1 పరీక్షల కోసం ఎటువంటి కోచింగ్ తీసుకోలేదు. సివిల్స్ సాధించడమే తన టార్గెట్ అని చెబుతున్నారు లక్ష్మీదీపిక.



