ఏపీలో( Andhra Pradesh) కొత్త పార్టీ ఏర్పాటు కానుందా? కాపులు, ఎస్సీలకు వేదిక కానుందా? త్వరలో పురుడు పోసుకోనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. కొద్ది రోజుల కిందట సీనియర్ ఐపిఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కాపులతో పాటు దళితులు ఒకే తాటి పైకి వస్తే రాజ్యాధికారం దక్కుతుందని స్పష్టం చేశారు. తాజాగా వంగవీటి మోహన్ రంగ వర్ధంతి సందర్భంగా విశాఖలో రంగా సేన సభ నిర్వహించారు. అదే సభలో కాపులకు కొత్త పార్టీ ఉండాలన్న అభిప్రాయం ఎక్కువమంది వ్యక్తం చేశారు. దీంతో త్వరలో ఏపీలో కొత్త పార్టీ ఖాయమని ప్రచారం నడుస్తోంది.
ఉమ్మడి ఏపీలోనైనా.. నవ్యాంధ్రప్రదేశ్లోనైనా కాపులు అధికం. సంఖ్యా బలంగా ఎక్కువగా ఉన్న ఆ సామాజిక వర్గానికి నేరుగా అధికారం చిక్కలేదు. నాలుగు శాతం వరకు ఉండే రెడ్డి లు, కమ్మ సామాజిక వర్గం వారు రాష్ట్ర ముఖ్యమంత్రులు అయ్యారు. చివరకు దళితులు సైతం ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ కాపుల విషయానికి వచ్చేసరికి ఎప్పటికీ మొండిచేయే. అందుకే ఆ సామాజిక వర్గం నుంచి రాజ్యాధికారం దక్కాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది.
1985లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయ్యారు వంగవీటి మోహన్ రంగ. అప్పటికే రంగా రాధా మిత్రమండలి ద్వారా విజయవాడలో సేవా కార్యక్రమాలు చేపట్టేవారు. ఈ నేపథ్యంలో కాపులకు బలమైన రాజకీయ అధికారాలు దక్కాలని ఆకాంక్షించేవారు. అలా ఆయన మదిలో పుట్టుకొచ్చింది కాపునాడు. ఉమ్మడి రాష్ట్రంలో భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చారు. లక్షలాదిమంది తరలి రావడంతో ఆ సభ సక్సెస్ అయింది. అప్పుడే కాపు ప్రతినిధిగా వంగవీటి మోహన్రంగా గుర్తింపబడ్డారు. కాపులు సీఎం కావాలన్నా బలీయమైన ఆకాంక్ష అప్పుడే ఏర్పడింది. కానీ 1988లో మోహన్ రంగా దారుణ హత్యకు గురయ్యారు. అయినా సరే కాపు సామాజిక వర్గానికి ఇచ్చిన రాజకీయ స్ఫూర్తి ఇప్పటికీ రగులుతూనే ఉంటుంది.
మెగాస్టార్ చిరంజీవి రూపంలో కాపులకు రాజ్యాధికారం దక్కుతుందని అంతా భావించారు. అలా ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేయడంతో కాపులకు ఒక వేదిక దొరికిందని అనుకున్నారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో చిరంజీవి పార్టీ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. చివరకు కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో కాపులకు నిరాశ తప్పలేదు.
ముద్రగడ పద్మనాభం రూపంలో కాపు రిజర్వేషన్ ఉద్యమం పతాక స్థాయికి చేరింది.. అదో రాజకీయ మలుపుగా మారుతుందని అంతా భావించారు. కానీ ముద్రగడ పద్మనాభం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలకు పని చేశారన్న విమర్శ ఉంది. అందుకు తగ్గట్టుగానే ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడంతో ఈ అనుమానాలు బలపడ్డాయి.
ప్రస్తుతం వంగవీటి మోహన్రంగా కుమార్తె తెరపైకి వచ్చారు. రంగా రాధా మిత్రమండలి ద్వారా ప్రజల్లోకి బలంగా వెళ్లాలని భావిస్తున్నారు. కాపులతో పాటు అణగారిన వర్గాల అభిప్రాయాన్ని సేకరిస్తారు. వారి అభిమతానికి అనుగుణంగా అడుగులు వేస్తారు. అయితే సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటుకు మొగ్గు చూపుతారన్న వార్తలు వస్తున్నాయి. మరోవైపు సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ సైతం కొత్త రాజకీయ పార్టీ పుట్టుకు రావాలని.. కాపులతో పాటు దళితులను ఐక్యంగా కలుపుకొని ముందుకెళ్తే మంచి ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. 2026 ద్వితీయార్థంలో కొత్త పార్టీ ఏర్పాటు ఖాయమని ప్రచారం నడుస్తోంది. మరి ఆ ప్రచారంలో ఎంత వాస్తవం ఉందో చూడాలి.



