తాతలు నాటిన చెట్టు… మనవళ్లు మాత్రమే కాదు, ఐదో తరానికి కూడా ఫలాలు ఇస్తోంది అంటే నమ్మశక్యం కాని నిజమే!
నిర్మల్ జిల్లా మామడ మండలం కొరటికల్ గ్రామంలో ఉన్న ఈ మహా మామిడి చెట్టు వయసు 140 సంవత్సరాలకు పైగానే ఉంటుందని యజమాని 92 ఏళ్ల కిషన్‌రావు తెలిపారు. “మా తాత అప్పారావు నాటిన ఈ మొక్క… మా కుటుంబంలో ఐదు తరాలకు ఫలాలు అందిస్తోంది” అని గర్వంగా చెప్పారు.
ఈ చెట్టు ప్రత్యేకత ఏమిటంటే… దీని కాండం చుట్టుకొలత సుమారు 26 అడుగులు 2 అంగుళాలు. సాగునీటి కాలువ, వరి పొలాల దగ్గర ఉండటంతో నీరు, పోషకాలు సమృద్ధిగా లభిస్తూ… ఈ వృక్షం ఎప్పుడూ పచ్చగా, ఆరోగ్యంగా కనిపిస్తోంది.
ఉద్యాన శాఖ అధికారుల ప్రకారం… విత్తనం ద్వారా నాటిన చెట్లు 200 సంవత్సరాలకు పైగా కూడా జీవించే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఒక చెట్టు… ఐదు తరాల బంధాన్ని కలిపిన కథ. ప్రకృతి ఇచ్చే వరం ఎంత గొప్పదో గుర్తు చేసే అరుదైన ఉదాహరణ ఇది.



