తెలంగాణలో టిడిపి యాక్టివ్ అవుతుందా? చంద్రబాబు పార్టీని బలోపేతం చేస్తారా? కొత్త నాయకత్వాన్ని తెరపైకి తీసుకొస్తారా? పంచాయితీ ఎన్నికల ఫలితాలతో చలనం వచ్చిందా? పొలిటికల్ వర్గాల్లో ఇదే ఆసక్తికర చర్చ. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి గణనీయమైన చరిత్ర ఉంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణలోనే ఆ పార్టీకి మంచి ఫలితాలు వచ్చేవి. కానీ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తెలుగుదేశం పార్టీ పట్ల శాపంగా మారింది. మారిన రాజకీయ పరిణామాలతో పూర్తిగా తెలంగాణలో ఉనికి కోల్పోయింది. చివరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా ఆ పార్టీ ఆసక్తి చూపలేదంటే పరిస్థితి ఎంత దాకా వచ్చిందో అర్థం అవుతుంది.
* విభజన వరకు బలం..
2014 వరకు తెలంగాణలో( Telangana) తెలుగుదేశం తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ వచ్చింది. రాష్ట్ర విభజన తరువాత 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో 15 సీట్లను సాధించింది. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయ్యారు. నవ్యాంధ్రప్రదేశ్ కు చంద్రబాబు సీఎం అయ్యారు. ఇద్దరి మధ్య రాజకీయ వైరుధ్యాలు ఉండడం తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి శాపంగా మారింది. తెలంగాణలో టిడిపి అస్తిత్వం ఉంటే భవిష్యత్తులో తనకు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని కేసిఆర్ కు తెలుసు. అందుకే తెలంగాణలో తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేసేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నించాలి అన్ని రకాలుగా ప్రయత్నించారు కేసీఆర్.
* ప్రతిసారి చంద్రబాబు బూచిగా చూపి..
ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కెసిఆర్ చంద్రబాబును బూచిగా చూపించారు తెలంగాణ సమాజానికి. అయితే ఈ క్రమంలో చంద్రబాబు సైతం తప్పిదాలకు పాల్పడ్డారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు. కానీ ఈ పొత్తును తెలంగాణ సమాజం హర్షించలేదు. అటు తెలుగుదేశం పార్టీని ఓడించారు. గెలవాలనుకున్న కాంగ్రెస్ పార్టీని సైతం మట్టి కరిపించారు.
* కెసిఆర్ వ్యూహానికి దొరకకుండా..
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి కెసిఆర్ ను ఓడించాలని చంద్రబాబు( Chandrababu) ప్రయత్నించారు. దీంతో ఆ ఇద్దరి నేతల మధ్య విభేదాలు పతాక స్థాయికి చేరాయి. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి అన్ని విధాల సహకారం అందించి టిడిపి ఓటమికి కారణమయ్యారు కెసిఆర్. అయితే కార్యక్రమంలో కెసిఆర్ సైతం తెలంగాణలో బలహీనం కావడం మొదలైంది. అయితే ఈసారి కెసిఆర్ వ్యూహానికి దొరకకుండా చంద్రబాబు చతురత ప్రదర్శించారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు ఏపీలో అరెస్ట్ అయ్యారు. దాదాపు 52 రోజులపాటు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. ఆ ఎన్నికల్లో పోటీ చేయాలని తెలంగాణ టిడిపి శ్రేణులనుంచి ఒత్తిడి ఎదురైంది. కానీ చంద్రబాబు వ్యూహాత్మకంగా సైలెన్స్ పాటించారు. అదే సమయంలో తన ఆత్మీయుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మారారు. దీంతో ఆటోమేటిక్గా తెలంగాణలో టిడిపి క్యాడర్, ఏపీ సెటిలర్స్ అంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. అలా తనను దెబ్బతీసిన కేసిఆర్ ను రాజకీయంగా దెబ్బతీయ గలిగారు చంద్రబాబు.
* విస్తరించాలని డిమాండ్..
అయితే ప్రస్తుతం తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు ఏవి జరగడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో పంచాయితీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులు( TDP candidates) 20 మంది సర్పంచులుగా గెలిచారు. దీంతో తెలంగాణలో టిడిపిని విస్తరించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.



