రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి: 2034 నాటికి ఆదిలాబాద్‌ను పారిశ్రామిక, విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతాం – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నియోజకవర్గాల పట్ల వివక్ష లేకుండా “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”.
ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సస్యశ్యామలం.
జూన్ 2 లోపు ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేసే అవకాశం.
బాసర క్షేత్ర అభివృద్ధికి ₹225 కోట్ల నిధుల కేటాయింపు.
జిల్లాకు నూతన యూనివర్సిటీ మరియు పారిశ్రామిక వాడ మంజూరు.
Adilabad, Bharat Today: తెలంగాణ అభివృద్ధి విషయంలో నియోజకవర్గాల పట్ల తారతమ్యం లేకుండా, ఎవరి పట్ల వివక్ష చూపించకుండా రాజకీయాలకు అతీతంగా కార్యక్రమాలను చేపడుతున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో అధికార, ప్రతిపక్ష నియోజకవర్గాల తేడా లేకుండా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని వివరించారు. ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి , ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , జిల్లా ప్రజా ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు.
✳️ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ, మా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు లేకపోయినా, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామంటూ, అందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులను ఉటంకించారు.
✳️ 2034 నాటికి ఆదిలాబాద్ జిల్లా అత్యంత అభివృద్ధి చెందిన పారిశ్రామిక వాడగా, పర్యాటక ప్రాంతంగా, విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతామంటూ సమీప భవిష్యత్తులో జిల్లాలో చేపట్టబోయే అభివృద్ధి లక్ష్యాలను వివరించారు.
✳️ “ఆదిలాబాద్ జిల్లాలో అపారమైన ఖనిజ సంపద ఉన్నప్పటికీ ప్రభుత్వాలు సరైన ప్రణాళికలు చేయకపోవడం వల్ల వెనుకబడిన ప్రాంతంగా మిగిలిపోయింది. జిల్లాలో అపారమైన జలవనరులు, అపారమైన ప్రాచీన సంస్కృతి ఉంది. అయినప్పటికీ వ్యవసాయం విస్తరించలేదు. విద్య, వైద్యం అందలేదు. తాగడానికి నీళ్లు అందని పరిస్థితి..” అని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
✳️ “ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేస్తాం. “వీలైతే వచ్చే జూన్ 2 లోపు ఆదిలాబాద్‌లో తలపెట్టిన విమానాశ్రయం శిలాఫలకం వేసే బాధ్యత తీసుకుంటాం. ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేసే విషయంలో ఇప్పటికే ప్రధానమంత్రి తో, కేంద్ర రక్షణ శాఖ, పౌర విమానయాన శాఖల మంత్రులతో మాట్లాడినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.


