తెలంగాణలో( Telangana) ఇప్పుడు బిజెపి దూకుడు పెంచుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. బిజెపి పెద్దలు కూడా ఈ విషయంలో చాలా చొరవ తీసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు రామచంద్ర రావు ఢిల్లీ టూర్ పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పార్టీ అంతర్గత సమావేశాలకు సంబంధించిన లీకులు, నేతల మధ్య విభేదాలు, క్రమశిక్షణ ఉల్లంఘనలు.. ఇలా వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టేందుకే ఢిల్లీ పెద్దలతో రామచంద్రరావు కీలక భేటీ జరిగిందన్న టాక్ వినిపిస్తోంది. పార్టీ లైన్ దాటిన నేతలపై కఠిన చర్యలు తీసుకునే సర్వాధికారాలు తెలంగాణ పార్టీ అధ్యక్షుడు రామచంద్ర రావు కె హై కమాండ్ అప్పగించినట్టు ప్రచారం జరుగుతోంది.
మొన్న ఆ మధ్యన తెలంగాణ బిజెపి ఎంపీలను పిలిచారు ప్రధాని మోదీ( Prime Minister Narendra Modi) . రాష్ట్రంలో బిజెపి పరిస్థితిని తెలుసుకొని కీలక సూచనలు చేసినట్లు కూడా ప్రచారం నడిచింది. అయితే ఆ విషయాలు బయటకు రావడంతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి మంచిది కాదని కూడా హెచ్చరించారు. పార్టీ హై కమాండ్ కూడా తెలంగాణ బిజెపిలో లీకుల రాజకీయాలు నడుస్తున్నాయని ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లోనే ఢిల్లీ టూర్ లో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు రామచంద్రరావు లీకు వీరులపై ఘరంగరం అయినట్లు సమాచారం. ఢిల్లీలో ప్రధాని మోదీ తో జరిగిన తెలుగు రాష్ట్రాల ఎంపీల సమావేశంలో రహస్య అంశాలు ఎలా బయటకు వచ్చాయి అని ఐ కమాండ్ ఆరా తీసినట్లు సమాచారం. తెలంగాణలో బిజెపి నేతల పరిస్థితి ఏంటి? వారు ఎంతవరకు సహకరిస్తున్నారు? ఎవరెవరు పనితీరు ఎలా ఉంది అని ఆరా తీసినట్లు సమాచారం.
మొన్న ఆ మధ్యన పార్టీ కీలక నేత బి ఎల్ సంతోష్( BL Santosh) గట్టి హెచ్చరికలు జారీచేశారు. బిజెపిలో ఆర్గానిక్, అన్ ఆర్గానిక్ నేతలంటూ వ్యాఖ్యానించారు. క్లాస్ పీకారు కూడా. అయినా సరే గ్రామపంచాయతీ ఎన్నికల తర్వాత మళ్లీ నేతల మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీనిపై హై కమాండ్ కు ఫిర్యాదులు వెళ్లాయి. కరీంనగర్ లో బండి సంజయ్, ఈటల వర్గాల మధ్య మాటల యుద్ధం, ఫండింగ్ ఆరోపణలు, ఓటములపై ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం పార్టీకి డ్యామేజ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇకనుంచి ఆ పరిస్థితి రాకుండా నేతలపై చర్యలు తీసుకునే స్వేచ్ఛను రాష్ట్ర బిజెపి అధ్యక్షుడికి కట్టబెట్టినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన స్ట్రోక్ తో కొంతమంది తెలంగాణ ఎంపీలు ఫ్రస్టేషన్లోకి వెళ్లారు. బిఎల్ సంతోష్ సైతం చురకలు అంటించారు. ఇప్పుడు ఏకంగా బిజెపి ఇచ్చి రాంచంద్రరావును ఢిల్లీకి రప్పించారు. ఢిల్లీ వేదికగా పార్టీలో లీకులపై రామచంద్రరావు గట్టిగానే తన వాదనలు వినిపించారు. దీంతో హై కమాండ్ కొంతమంది బిజెపి నేతల తీరుపై ఒక కన్నేసి ఉంచినట్లు తెలుస్తోంది. బిజెపిలో ఉంటూ ఎవరి ప్రయోజనాల కోసం వారు పాటుపడుతున్నారు? రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలిపిన వారు ఎవరు? అనే దానిపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు ఎంపీలు లీకులు ఇవ్వడమే కాదు.. పార్టీ లైన్ క్రాస్ చేస్తున్నారని హై కమాండ్ గుర్తించింది. పార్టీకి మైనస్ చేస్తే ఎంతటి వారు అయినా విడిచిపెట్టకూడదని.. ఈ విషయంలో గట్టిగానే ఉండాలని పార్టీ చీఫ్ రామచంద్రరావుకు హై కమాండ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.



