దేశంలో రెండో రాజధాని ఆవిర్భవించనుందా? కేంద్రంలో ఉన్న బిజెపి సీరియస్ గా ఆలోచిస్తుందా? దక్షిణాది రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దశాబ్దాలుగా దేశానికి రెండో రాజధాని కావాలన్న డిమాండ్ ఉండేది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒక రాజధానిని ఎంపిక చేయాల్సిన అవసరాన్ని ఈ ప్రాంతీయులు ఎప్పటికప్పుడు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో దేశానికి రెండో రాజధాని అవసరం అంటూ కేంద్ర ప్రభుత్వం గుర్తించినట్లు సమాచారం. దక్షిణాది రాష్ట్రాల్లో ఒక ప్రాంతంలో మాత్రం రెండో రాజధాని ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం దేశానికి రాజధానిగా ఢిల్లీ ఉంది. అక్కడ విపరీతమైన పొగ మంచు కురుస్తోంది. ఆపై విపరీతమైన కాలుష్యం ఉంటుంది. ఎప్పటికప్పుడు కాలుష్య నియంత్రణకు చర్యలు చేపడుతున్న సత్ఫలితాలు ఇవ్వడం లేదు. మరోవైపు ఢిల్లీ ప్రత్యర్థి దేశాలకు దగ్గరగా ఉంది. భవిష్యత్తులో యుద్ధ వాతావరణం లో ఎటాక్ చేయడానికి శత్రువులకు అనువుగా ఉంటుంది. గతంలో ఒకసారి తీవ్రవాదులు నేరుగా పార్లమెంట్ పై గురి పెట్టారు. ఆ సమయంలో కూడా రెండో రాజధాని ప్రస్తావన వచ్చింది.
ఒకవేళ రెండు రాజధాని పెట్టాలనుకుంటే మాత్రం దక్షిణాది రాష్ట్రాలే అందుకు అనుకూలం. దక్షిణ భారతదేశంలో ఐదు రాష్ట్రాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు కీలకంగా ఉన్నాయి. ఈ రాష్ట్రాల నుంచి దేశ రాజధాని ఢిల్లీ వెళ్లాలంటే ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధులకు కష్టమే. అందుకే దక్షిణాది రాష్ట్రాల్లో రెండో రాజధాని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ గతం నుంచి వినిపిస్తూనే ఉంది.
* హైదరాబాద్ కి ఎక్కువ అవకాశాలు
ప్రస్తుతం హైదరాబాదులో రాష్ట్రపతి భవన్ ఉంది. ఏటా ఇక్కడకు రాష్ట్రపతి వస్తూనే ఉంటారు. ఒకవేళ దక్షిణాది రాష్ట్రాలకు రెండో రాజధాని ఇవ్వాలంటే అనువైన ప్రాంతం హైదరాబాద్. లేకుంటే చెన్నై తో పాటు బెంగళూరు నగరాలు ఉన్నాయి. హైదరాబాద్ విజయవాడ మధ్య అనువైన ప్రాంతాలు అధికం. దేశ అంతర్గత భద్రత, పాలనా సౌలభ్యం వంటి వాటిని పరిగణలోకి తీసుకుంటే మాత్రం దక్షిణాది రాష్ట్రాల్లో రెండో రాజధాని ఏర్పాటు ఆవశ్యం. అందుకే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో కూడా సత్తా చాటాలని బిజెపి చూస్తోంది. అది జరగాలంటే దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా ఏదో ఒక పెద్ద సాయం చేయాలి. అది రెండో రాజధాని అని కేంద్ర పెద్దలు గుర్తించినట్లు తెలుస్తోంది. అందుకే దక్షిణాది రాష్ట్రాల్లో రెండో రాజధాని ఏర్పాటుకు బిజెపి లోలోపల సన్నాహాలు మొదలుపెట్టినట్లు సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో? ఆ ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో?



