‘పండుగలు, నూతన సంవత్సరం వేడుకల సమయంలోనే డ్రగ్స్ కేసుల నమోదుకు పరిమితం అవుతున్నారే తప్ప రాష్ట్ర పభుత్వం సీరియస్ గా వ్యవహరించడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో జరిపిన ‘డ్రగ్స్ కేసు’ విచారణ నివేదికపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా నాటి డ్రగ్స్ కేసులో అనేక మంది బడా వ్యక్తుల పేర్లు, సినీ ప్రముఖులు ఉన్నారంటూ బండి సంజయ్ బాంబు పేల్చారు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన వాళ్లను అకున్ సబర్వాల్ టీం నాడు విచారణ చేస్తే కేసీఆర్ కుటుంబ సభ్యులకు డ్రగ్స్ విక్రయదారులతో సంబంధాలున్నాయని తేలిందన్నారు. ఆ కుటుంబ సభ్యులు సైతం తమతో కలిసి డ్రగ్స్ తీసుకున్నారని డ్రగ్స్ కేసులో పట్టుబడి నిందితులు ఆనాడు అకున్ టీం ఎదుట వాంగ్మూలమిచ్చారని పేర్కొన్నారు. ఆ వాంగ్మూలంతో కూడిన ఆడియో, వీడియో రికార్డులు బయటకొస్తే తన కుటుంబ సభ్యుల రాజకీయ భవిష్యత్తు సమాధి అవుతుందని భయపడ్డ నాటి సీఎం కేసీఆర్ ఆకున్ సబర్వాల్ ను అర్దాంతరంగా డ్రగ్స్ కేసు బాధ్యతల నుండి తప్పించారని తెలిపారు. అదే సమయంలో ఆ కేసుపై అకున్ సబర్వాల్ టీం రూపొందించిన నివేదికను, రికార్డు చేసిన ఆడియో, వీడియో, స్టేట్ మెంట్లన్నింటినీ నాటి సీఎస్ సోమేశ్ కుమార్ స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. ఆ తరువాత డ్రగ్స్ కేసును పూర్తిగా నీరుగార్చారని మండిపడ్డారు. అకున్ సబర్వాల్ సేకరించిన ఆధారాలు, ఆడియో, వీడియో రికార్డులు, స్టేట్ మెంట్లను సోమేశ్ కుమార్ తదుపరి విచారణ టీంకు అప్పగించలేదని, వాటిని కోర్టుకు స్వాధీనం చేయలేదని తెలిపారు. ఈ మేరకు బండి సంజయ్ కుమార్ కొద్దిసేపటి క్రితం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా డ్రగ్స్ నిర్మూలనపై చిత్తశుద్ది ఉంటే సీఎం ఆధ్వర్యంలో పనిచేస్తున్న ‘‘ఈగల్’’ టీం వెంటనే రంగంలోకి దిగి సోమేశ్ కుమార్ ను విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈగల్ టీం విచారణ తీరుపైనా ఈ సందర్భంగా బండి సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు. ఈగల్ టీంకు నిజంగా లీగల్ గా అధికారాలున్నాయా? అని ప్రశ్నించారు. ఈగల్ టీంలో సమర్ధులైన అధికారులు ఉన్నప్పటికీ, ఒకరిద్దరు అధికారులు మాత్రం డబ్బులకు అమ్ముడుపోయి డ్రగ్ పెడ్లర్లతో రాజీపడుతున్నారని తెలిపారు. నిన్నటి ఈగల్ టీం దాడిలో పెడ్లర్ల నుండి డ్రగ్స్ కొనుగోలు చేసిన ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? అని ప్రశ్నించారు.



