Home » Latest » రెబల్ స్టార్ యాక్షన్ ధమాకా ‘యమధర్మరాజు’:ముద్దుకు హద్దులు లేవే

రెబల్ స్టార్ యాక్షన్ ధమాకా ‘యమధర్మరాజు’:ముద్దుకు హద్దులు లేవే

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

Subramanyam Dogiparthi :హమ్మయ్య ! అలనాటి అందాల భామలందరూ పోలీస్ ఆఫీసర్లుగా నటించేసారు . మిగిలింది మరో అందాల తార బి సరోజాదేవే . ఆమె కూడా 1990 లో వచ్చిన ఈ యమధర్మరాజు సినిమాలో DIG గా నటించేసింది . బహుశా బి సరోజాదేవి మాత్రమే ఈ సినిమాకు ముందు కృష్ణంరాజు పక్కన హీరోయిన్ గా నటించలేదు అనుకుంటా . అందుకే కృష్ణంరాజు తల్లిగా సరోజాదేవి నటించింది ఈ సినిమాలో . 

ఏది ఏమయినా బి సరోజాదేవి , లక్ష్మి , జయప్రద , శ్రీదేవి , జయసుధ వంటి అందాల తారల్ని పోలీస్ ఆఫీసర్లుగా చూడటం కష్టమే వాళ్ళ అభిమానులకు . ముఖ్యంగా వాళ్ళ సౌందర్యాభిమానులకు . 

కృష్ణంరాజు స్వంత బేనర్ సినిమా ఇది . హీరో ప్రభాస్ తల్లి శివకుమారి ఈ సినిమాకు నిర్మాత . మరో విశేషం ఏమిటంటే హాస్య సినిమాల స్కూల్ నుండి వచ్చిన రేలంగి నరసింహారావు ఈ ఏక్షన్ సినిమాకు దర్శకత్వం వహించటం . ఓంకార్ నేసిన ఈ కధకు రేలంగి నరసింహారావు స్క్రీన్ ప్లేని కృష్ణంరాజు రెబెల్ స్టార్డంకు అనుకూలంగా మలుచుకున్నారు . 

తారాగణం కూడా భారీగానే ఉంది . ఇద్దరు అన్నదమ్ములుగా కృష్ణంరాజు ద్విపాత్రాభినయం చేసారు . వారికి జోడీగా రాధ , సుహాసినిలు , తల్లిదండ్రులుగా సరోజాదేవి , జగ్గయ్యలు నటించారు . విలన్లుగా సత్యనారాయణ , మోహన్ బాబు , త్యాగరాజు , కోట శ్రీనివాసరావు , అల్లు రామలింగయ్యలు నటించారు .అందరూ హేమాహేమీలే కావటంతో అందరి నటనా బాగా ఉంటుంది . రాజ్-కోటి సంగీత దర్శకత్వంలో పాటలనన్నీ చాలా శ్రావ్యంగా ఉంటాయి . మూడు డ్యూయెట్లనీ రేలంగి నరసింహారావు అందంగా చిత్రీకరించారు . గడబిడ గడబిడ , ముద్దుకు హద్దులు లేవే , అమ్మాడి పండు గుమ్మడి పండు అంటూ సాగే మూడు డ్యూయెట్లు కృష్ణంరాజు , రాధల మీద రొమాంటిగ్గా ఉంటాయి . 

ముద్దుకు హద్దులు లేవే పాట చిత్రీకరణ బాగుంటుంది . లిరిక్సుని భువనచంద్ర బాగా వ్రాసారు . మిగతా పాటల్ని వేటూరి వ్రాసారు . కొండంత దేవుడివి కోటకే సూర్యుడివి అనే పాట చాలా బాగుంటుంది . కృష్ణంరాజు కర్ణుడు , విశ్వామిత్రుడు , అల్లూరి సీతారామరాజు గెటప్పుల్లో బాగా కనిపిస్తారు . 

బేక్ గ్రౌండులో వచ్చే పాట కూడా శ్రావ్యంగా ఉంటుంది . బాలసుబ్రమణ్యం , జేసుదాస్ (టైటిల్సులో జేసుదాస్ అనే వ్రాసారు) , సుశీలమ్మ , శైలజలు పాడారు . కృష్ణంరాజు , రాధల డాన్సుల్ని శీను , తార , రఘులు బాగా కంపోజ్ చేసారు . 

ఓంకార్ డైలాగులు బాగానే ఉన్నా అక్కడక్కడా ముఖ్యంగా తీవ్రవాది కృష్ణంరాజు పాత్రకు డైలాగులు కాస్త మొనాటనస్ గా అనిపిస్తాయి . ఆయన స్వంత సినిమా కదా ! ఇతర పాత్రల్లో డబ్బింగ్ జానకి , ప్రియాంక , తదితరులు నటించారు . 

న్యాయవ్యవస్థ , చట్టవ్యవస్థల వైఫల్యాల వలన సత్వర న్యాయం కొరకు తీవ్రవాదులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం సినిమా ప్రధాన కధాంశం . ఈ సత్వర న్యాయం vs చట్టప్రకారం న్యాయం చర్చ తెమిలేది కాదు . సినిమా కాబట్టి డబ్బులు తిరిగి రావాలి కాబట్టి ప్రేక్షకులకు ఏది నచ్చుతుందో ఊహించి సినిమాను నడిపిస్తారు . క్లైమాక్సులో దుష్టులను అందరినీ తీవ్రవాది కృష్ణంరాజు చంపేస్తాడు . ఆ క్రమంలో పోలీసులు అతన్ని చంపేస్తారు . ఆయన ప్రేయసి సుహాసిని ఆయన గొడ్డలి తీసుకుని ఆయన దుష్టశిక్షణ అమాయకరక్షణను కొనసాగిస్తానికి అడవుల్లోకి వెళ్ళిపోవడంతో సినిమా ముగుస్తుంది . సినిమా యూట్యూబులో ఉంది.

Share to...