మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి ( Atal Bihari Vajpayee)ఈ దేశానికి రాష్ట్రపతి అయ్యే అవకాశం వచ్చిందా? ప్రధానిగా లాల్ కృష్ణ అద్వానీని చెయ్యాలన్న ప్రతిపాదన వచ్చిందా? బిజెపి పార్లమెంటరీ బోర్డులో ఈ చర్చ జరిగిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా అటల్ బిహారీ వాజ్పేయి ప్రత్యేక పుస్తకం రాశారు అశోక్ తాండాన్. ఆయన వాజ్పేయి వద్ద మీడియా సలహాదారుగా పనిచేశారు. ఆయనపై ఉన్న గౌరవంతో ప్రత్యేక పుస్తకం రాశారు. పుస్తకావిష్కరణలో కీలక అంశాలను వెల్లడించారు. 2001లో పార్లమెంట్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే కార్గిల్ ఫైట్ కూడా నడిచింది.
* బిజెపి పార్లమెంటరీ బోర్డులో..
కార్గిల్ యుద్ధం ( Kargil battle) సమయంలో కేంద్రంలో వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. అక్కడకు ఏడాది తర్వాత రాష్ట్రపతి ఎన్నికలు వచ్చాయి. కె.ఆర్ నారాయణణ్ పదవి విరమణ తో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యంగా మారింది. ఆ సమయంలోనే బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగింది. ప్రధానిగా ఉన్న వాజ్పేయి రాష్ట్రపతిగా వెళ్లి.. ప్రధాని స్థానంలో ఎల్కే అద్వానీని నిలబెడితే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు వాజ్పేయి. ప్రధాని లాంటి పెద్ద పదవి చేపట్టి రాష్ట్రపతిగా వెళ్లడం అంత శ్రేయస్కరం కాదని.. అది చాలా తప్పుడు సంకేతం అని వద్దని వారించినట్లు తెలుస్తోంది.
* గొప్ప నాయకత్వ ధ్వయం..
భారతీయ జనతా పార్టీలో( Bhartiya Janata Party) వాజ్పేయి, ఎల్కే అద్వానీ ద్వయం ఎన్నెన్నో సంక్షోభాలను దాటుకొని వచ్చింది. జన సంఘ్ ని భారతీయ జనతా పార్టీగా మార్చి ఈ దేశానికి సుపరిచితం చేసింది ఆ ద్వయం. 80 వ దశకంలో దేశంలో భారతీయ జనతా పార్టీకి రెండే రెండు పార్లమెంటు స్థానాలు ఉండేవి. కానీ బిజెపి అనుబంధ సంఘాల సాయంతో దేశవ్యాప్తంగా బిజెపిని విస్తరించడంలో వాజ్పేయి, ఎల్కే అద్వానీ జండా కృషి మరువరానిది. అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ వాజ్పేయి విషయంలో ప్రత్యేక గౌరవంతో ఉండేది. ఏకంగా ఐక్యరాజ్యసమితికి బిజెపి ఎంపీగా ఉన్న వాజ్పేయిని పంపించారు అంటే ఆయన స్థాయి ఏ పాటిదో అర్థం అవుతుంది.
* తీవ్రవాదుల దాడి..వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలోనే కార్గిల్ దాడి జరిగింది. ఢిల్లీలోని పార్లమెంట్ పై కూడా తీవ్రవాదులు దాడి చేశారు. అటు తరువాత జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రముఖ శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం అభ్యర్థిత్వాన్ని సమర్థించారు వాజ్పేయి. అప్పటికే దేశవ్యాప్తంగా సంకీర్ణ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ప్రాంతీయ పార్టీల హవా ఉంది. అయినా సరే అందర్నీ ఒప్పించి, మెప్పించి రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం ఎంపికను సుగమం చేశారు. అటువంటి అత్యున్నత పదవి తనకు ఇస్తామన్న.. అంగీకరించని ఒక యోధుడు వాజ్పేయి. ఇప్పుడు ఆయన శత జయంతి వేళ ఈ విషయం బయటకు రావడం నిజంగా గొప్ప పరిణామం.



