వంగవీటి మోహన్ రంగ( vangaveeti Mohan Ranga) .. ఈ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. కాపుల ఆశాజ్యోతి గా పేరుపొందారు రంగ. ఆయన భౌతికంగా దూరమై మూడు దశాబ్దాలు దాటుతున్నా.. ఎన్నికల వచ్చిన ప్రతిసారి ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తూనే ఉంది. కాపు సామాజిక వర్గం ఓట్ల కోసం ప్రతి రాజకీయ పార్టీ ఆయన పేరును తలస్తూనే ఉంది. అయితే రాజకీయంగా ఆ పేరును వాడుకుంటున్న పార్టీలు.. ఆయన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాయన్న విమర్శ ఉంది. ఇటువంటి క్రమంలో వంగవీటి మోహన్ రంగా కుమార్తె ఆశా కిరణ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారు అని ప్రచారం నడుస్తోంది. ఈనెల 26న రంగ వర్ధంతి సందర్భంగా విశాఖలో రంగా సేన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఇదే వేదికపై వంగవీటి ఆశాకిరణ్ రాజకీయ రంగ ప్రవేశం పై ప్రకటన చేస్తారని ప్రచారం నడుస్తోంది.
పేదలకు దేవుడిగా
విజయవాడ ( Vijayawada) కేంద్రంగా వంగవీటి మోహన్ రంగ చాలా రకాలుగా సేవలు అందించేవారు. అణగారిన వర్గాలకు అండగా నిలిచేవారు. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. 1985 లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ ప్రభంజనంలో సైతం నిలిచారు. అయితే నాడు కాపులకు రాజ్యాధికారం కోసం ఆయన కాపు సేనను ఏర్పాటు చేశారు. అప్పట్లో భారీ బహిరంగ సభకు లక్షలాదిమంది జనాలు తరలివచ్చారు. ఇళ్లకు వెళ్లేందుకు మూడు రోజుల సమయం పట్టిందంటే ట్రాఫిక్ ఎంత రద్దీగా మారిందో అర్థం చేసుకోవచ్చు.
నేటికీ దక్కని ప్రాధాన్యం
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న వంగవీటి మోహన్రంగా 1988లో బలహీన వర్గాల కోసం నిరాహార దీక్షకు దిగారు. దీక్షా శిబిరంలోనే దారుణ హత్యకు గురయ్యారు. దాని ప్రభావం 1989 ఎన్నికల్లో కనిపించింది. తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ హత్య జరగడంతో ఆ పార్టీకి వ్యతిరేకంగా మారారు కాపు సామాజిక వర్గం ప్రజలు. అలా 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఈ ఘటన దోహద పడింది. అయితే వంగవీటి మోహన్ రంగ భౌతికంగా దూరమై మూడు దశాబ్దాలు దాటుతోంది. కానీ ఇప్పటికీ కాపులు ఆయనను దేవుడిగా భావిస్తాయి. అయితే ఆయన వారసుడు వంగవీటి రాధాకృష్ణ అనుకున్న స్థాయిలో రాజకీయాల్లో రాణించలేకపోయారు. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటుతోంది. కానీ ఇంతవరకు ఆయనకు సరైన పదవి దక్కలేదు.
వంగవీటి మోహన్ రంగా కుమార్తె ఆశా కిరణ్( Asha Kiran) కొద్ది రోజుల కిందట తెరపైకి వచ్చారు. తన తండ్రి ఆశయ సాధనకు కృషి చేస్తానని చెప్పారు. తద్వారా తన పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని గట్టి సంకేతాలు పంపించారు. అయితే ఏ పార్టీలో చేరుతారని చెప్పలేదు. రంగా రాధా మిత్రమండలి ఐక్యతకు కృషి చేస్తానని మాత్రమే చెప్పుకొచ్చారు. ఈనెల 26న రంగా రాధా మిత్రమండలి ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధపడ్డారు ఆశ కిరణ్. అదేరోజు విశాఖలో కాపు సేన పేరిట భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. భవిష్యత్తు కార్యాచరణను వెల్లడిస్తారు. దీంతో అందరి దృష్టి విశాఖపై ఉంది. మరి ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారో చూడాలి.



