తిరుమలకు వచ్చే భక్తుల రక్షణ విషయంలో తిరుపతి పోలీసులు అవలంబిస్తున్న విధానాలకు భక్తుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. చైల్డ్ ట్యాగ్ విధానం ద్వారా తప్పిపోయిన ఓ బాలికను గుర్తించి తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు తిరుమల పోలీసులు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, తిరుమలలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని చైల్డ్ ట్యాగ్ భద్రతా చర్యలు చేపట్టారు. నరసరావుపేట పట్టణం నివాసి ఉమా దంపతులు తమ ఐదు సంవత్సరాల కుమార్తెను తీసుకొని మంగళవారం తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చారు.
లేపాక్షి సర్కిల్ వద్ద చైల్డ్ ట్యాగ్ టీమ్ బాలికకు చైల్డ్ ట్యాగ్‌ను అమర్చింది. దర్శనం అనంతరం నాదనీరాజనం ప్రాంతం సమీపంలో ఆడుకుంటున్న సమయంలో బాలిక తన తల్లిదండ్రుల నుంచి దారి తప్పింది. వెంటనే అప్రమత్తమైన చైల్డ్ ట్యాగ్ టీమ్ సిబ్బంది, ట్యాగ్ ద్వారా బాలిక వివరాలను గుర్తించి, ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తదనంతరం బాలికను ఆమె తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. ఎంతో సంతోషపడిన దంపతులు పోలీసు శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా పోలీస్ శాఖ తరఫున, తిరుమలకు వచ్చే భక్తులు తమ పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని చైల్డ్ ట్యాగ్ విధానాన్ని తప్పనిసరిగా వినియోగించుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.



