తెలుగు నాట ఎంతో ప్రాచుర్యం పొందింది బాహుబలి సినిమా. రెండు విభాగాల్లో వచ్చిన ఈ చిత్రం తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ముద్ర చాటుకుంది. రాజసాన్ని, రాజ చరిత్రను, రాజకోటల రహస్యాన్ని కళ్ళకు కట్టినట్టు చూపింది బాహుబలి. అయితే ఇందులో కట్టప్ప పాత్ర నేటి రాజకీయాలకు దగ్గరగా ఉంటుంది. విశ్వాసాలకు, విశ్వాసఘాతకాలకు పెట్టింది ఆ పాత్ర. అయితే ఆ పాత్రను గుర్తు చేస్తున్నారు వైసిపి పూర్వపు నేత విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy ). తాజాగా ఆయన చేసిన ట్వీట్ పొలిటికల్ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. తన పూర్వపు బాస్ జగన్మోహన్ రెడ్డికి గట్టి హెచ్చరిక జారీచేసినట్టు అయింది.
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీలో నెంబర్ 2 గా ఎదిగారు విజయసాయిరెడ్డి. పార్టీ ఆవిర్భావానికి ముందే జగన్మోహన్ రెడ్డి వెంట అడుగులు వేసిన వ్యక్తి ఆయన. రాజశేఖర్ రెడ్డి కుటుంబ ఆడిటర్ గా ఎంట్రీ ఇచ్చారు విజయసాయిరెడ్డి. అనతి కాలంలోనే జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటుగా మారారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. రాజశేఖర్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమార్జనకు పాల్పడ్డారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో అక్రమాస్తుల కేసులు వెంటాడాయి. ఈ క్రమంలోనే జైలు పాలయ్యారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఆయన ఒక్కరే కాదు. ఆయన ఆర్థిక సలహాదారులతో పాటు ఆడిటర్ గా ఉన్న విజయసాయిరెడ్డి సైతం 16 నెలల పాటు జైలు జీవితం అనుభవించారు. ఈ క్రమంలోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పురుడుబోసుకుంది. ఆ పార్టీకి అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే.. కర్త,కర్మ, క్రియ విజయసాయిరెడ్డి. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు విజయసాయిరెడ్డి చేయని ప్రయత్నం లేదు. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎవరు అంటే.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో వినిపించే పేరు విజయసాయిరెడ్డి. అంతలా ఉండేది ఆయన ప్రభావం.
* ఎనలేని ప్రాధాన్యం..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) విజయసాయి రెడ్డికి ఎనలేని ప్రాధాన్యమిచ్చారు. మధ్య మధ్యలో రకరకాల పరిణామాలు జరిగాయి కానీ.. విజయసాయిరెడ్డి ప్రాధాన్యత మాత్రం తగ్గలేదు. ఎప్పుడైతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరం అయిందో.. ఆ మరు క్షణం నుంచి ఆ పార్టీలో క్రమశిక్షణ కట్టు దాటింది. గతంలో ఉన్న వైఫల్యాలు ఒక్కొక్కటి బయటకు రావడం ప్రారంభించాయి. ఈ క్రమంలో జగన్ చుట్టూ ఉన్న కోటరి అంటూ బయటకు వచ్చారు విజయసాయిరెడ్డి. వాస్తవానికి ఆయన పై అదే కోటరి ముద్ర ఉండేది. కానీ అదే ఆరోపణ చేస్తూ విజయసాయిరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడం విశేషం.
* మారిన అభిప్రాయం..
అయితే రాజకీయ ప్రత్యర్థుల చేతిలో కీలుబొమ్మగా మారి విజయసాయిరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుంటున్నట్లు అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా అభిప్రాయపడ్డారు. మద్యం కుంభకోణం కేసులో ఆయన రాజీ పడ్డారన్న అనుమానాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి. అయినా సరే ఎక్కడో మూల విజయసాయిరెడ్డి తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతారన్న టాక్ వినిపించింది. అందుకు తగ్గట్టుగా ఆయన ప్రకటనలు కూడా చేశారు. అయితే విజయసాయిరెడ్డి అభిప్రాయం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి కంటే ఆయన చుట్టూ ఉన్న కోటరీ పైనే ఆయన కోపం అన్నట్లు ఉంది. ఆ కోటరి పుణ్యమా అని తన ప్రాధాన్యత తగ్గినట్లు విజయసాయిరెడ్డి భావిస్తున్నట్లు అర్థం అవుతోంది. అయితే గత కొంతకాలంగా జగన్ చుట్టూ ఉన్న కోటరిని గుర్తు చేస్తూ విమర్శలు చేస్తున్నారు విజయసాయిరెడ్డి. ఇప్పుడు తాజాగా కూడా అటువంటి ప్రకటన చేశారు.
* సంచలన ట్వీట్
ఇటీవల అగ్రరాజ్యం అమెరికా( America) వెనిజువేలా లో ప్రదర్శించిన ఆధిపత్యం గురించి తెలిసిందే. చుట్టూ సైన్యం, సైన్యాధ్యక్షులు, మంది మాగధులు ఉన్నా ఆ దేశ సైన్యాధ్యక్షుడితో పాటు ఆయన భార్యను చాలా సులువుగా అమెరికా సైన్యం తమ అదుపులోకి తీసుకోగలిగింది. చాలా సులువుగా అమెరికా ఎత్తుకెళ్లిపోయింది. అయితే దీని వెనుక వెనిజువేలాలో అమెరికా కలహాలు సృష్టించగలిగింది. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి దానిని ఉదాహరించారు. ఎంత బలవంతుడైన అధినేత అయినా.. చుట్టూ ఉన్న కోటరి అమ్ముడుపోతే నష్టపోవాల్సిందేనని తేల్చి చెప్పారు. అయితే విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో ఈ పోస్ట్ చేయడంతో తన పూర్వ అధినేత జగన్మోహన్ రెడ్డి కేనని స్పష్టమవుతోంది. ఎందుకంటే విజయసాయిరెడ్డి పలుమార్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోటరీ గురించి ప్రస్తావించారు. తాను జగన్మోహన్ రెడ్డి మంచి కోరే వాడినని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు తాజా హెచ్చరికల ద్వారా.. కోటరీ నుంచి ముప్పు పొంచి ఉంది అని మరోసారి తేల్చి చెప్పారు. మొత్తానికి అయితే విజయసాయిరెడ్డి హెచ్చరికలు ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో హీట్ పెంచుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ప్రత్యర్థికి పనిచేస్తున్న నేతలు ఎవరు అనే చర్చ జోరుగా సాగుతోంది.



