భారతీయ జనతా పార్టీ( Bhartiya Janata Party) బలమైన శక్తిగా ఎదిగింది. నరేంద్ర మోడీ నేతృత్వంలో మూడోసారి వరుసగా అధికారంలోకి వచ్చింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆ పార్టీ హవా నడుస్తోంది. అయితే బిజెపి ఎదుగుదలకు కారణం మాత్రం ముమ్మాటికి దాని అనుబంధ సంస్థలే. పార్టీ పట్ల, పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లడంలో ఈ అనుబంధ సంస్థలు సక్సెస్ అయ్యాయి. నాలుగు దశాబ్దాల కిందట రెండు పార్లమెంట్ స్థానాలతో ప్రారంభమైన బీజేపీ ప్రస్థానం.. ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. అయితే సగటు బిజెపి నేత సిద్ధాంతాలకు లోబడి పని చేస్తారు. అయితే ఇప్పుడు అదే సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ లో సైతం కనిపిస్తున్నాయి.
* సనాతన ధర్మంపై పోరాటం..
ఎవరు అవునన్నా కాదన్నా హిందుత్వ వాదాన్ని బలంగా తీసుకెళ్లడంలో బిజెపి పాత్ర ఉంది. అయితే ఇన్నాళ్ళ ప్రస్థానంలో బిజెపి నేతలు ఎప్పుడూ సనాతన ధర్మం గురించి ఎక్కువగా ప్రస్తావించిన సందర్భాలు లేవు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan) ఆ నినాదంతో ముందుకు వెళుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ హిందుత్వ వాదాన్ని ఒక మాస్ రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ అంటే పవన్ కళ్యాణ్ కు ఒక విధమైన ఆరాధన భావం ఉంది ఈ విషయాన్ని స్వయంగా పవన్ చాలా సందర్భాల్లో చెప్పారు కూడా. అయితే పవన్ కళ్యాణ్ కు సైతం బిజెపి ఎనలేని ప్రాధాన్యమిచ్చింది. అందుకే బిజెపిని, తెలుగుదేశం పార్టీని కలిపి ఏపీలో కూటమి కట్టడంలో పవన్ సక్సెస్ అయ్యారు.
* తరచూ ఇతర రాష్ట్రాల సందర్శన..
పవన్ కళ్యాణ్ ఒక్క ఏపీకి ( Andhra Pradesh) మాత్రమే పరిమితం కావడం లేదు. దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. తరచు ఆయన దక్షిణాది రాష్ట్రాల్లో ఆలయాల సందర్శన చేస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడు పై ఫుల్ ఫోకస్ పెట్టారు. వచ్చే ఏడాది అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే పవన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం వెనుక బిజెపి ఉంది అనేది ఒక వాదన. బిజెపి హిందుత్వ వాదానికి దగ్గరగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ నినాదాన్ని అందుకున్నారు. ఇది కచ్చితంగా ప్రభావం చూపిస్తుందని బిజెపి అంచనా వేస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల నుంచి 100 పార్లమెంటు సీట్లపై దృష్టి పెట్టింది భారతీయ జనతా పార్టీ. ఆ బాధ్యతను పవన్ కళ్యాణ్ కు కట్టబెట్టినట్లు స్పష్టమవుతోంది.
* పెరిగిన పవన్ మేనియా..
2024 సార్వత్రిక ఎన్నికలతో( general elections) పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. తెలుగుదేశం కూటమి ఘనవిజయం సాధించింది. జనసేన 100% స్ట్రైక్ రేట్ తో విజయం సాధించింది. యావత్ భారతదేశం ఏపీ వైపు చూసేలా చేసింది. పవన్ కళ్యాణ్ కు స్టార్ డం ఉంది. అంతకుమించి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఏపీలో ఘన విజయం సాధించడంతో పవన్ మేనియా జాతీయస్థాయిలో సైతం పెరిగింది. సరిగ్గా ఇటువంటి సమయంలో హిందూ మత పరిరక్షణకు బలమైన వ్యవస్థ అవసరమని పవన్ భావించారు. సనాతన ధర్మ పరిరక్షణకు నడుంబిగించారు. అయితే అప్పటివరకు హిందుత్వవాదం పై పెద్దగా ఎవరికి పట్టింపు ఉండేది కాదు. కానీ పవన్ నోటి నుంచి ఆ మాట రావడంతో హిందూ సమాజంలో ఒక రకమైన ఆలోచన ప్రారంభమైంది. క్రమేపి హిందూత్వవాదం కూడా పెరుగుతోంది.
* 100 ఎంపీ సీట్లు టార్గెట్..
మొన్నటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ( NDA) అధికారంలోకి వచ్చేందుకు దక్షిణాది రాష్ట్రాలు దోహదపడ్డాయి. అందుకే బిజెపి తన ప్లాన్ మార్చుకుంది. వచ్చే ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లోనే 100 పార్లమెంటు స్థానాలను లక్ష్యంగా పెట్టుకుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 42 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఎన్డీఏ పరంగా ఇక్కడ 29 ఎంపీ సీట్లు దక్కించుకుంది. మిగతా తమిళనాడు, కర్ణాటక, కేరళలో సైతం వీలైనంత ఎక్కువ సీట్లు సాధించాలని చూస్తోంది భారతీయ జనతా పార్టీ. అందుకే దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలను పవన్ కళ్యాణ్ కు కట్టబెట్టింది. సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ఎన్డీఏ గెలుపు కోసం బాధ్యతలు తీసుకుంటారన్నమాట. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఆయన ఎన్డీఏ కన్వీనర్ గా వ్యవహరిస్తారని సమాచారం.



