దేవినేని అవినాష్( devineni Avinash ).. పరిచయం అక్కర్లేని పేరు ఇది. దివంగత మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కుమారుడు. అయితే రాజకీయాల్లో ఇప్పటివరకు ఫెయిల్యూర్ తప్ప సక్సెస్ కాలేదు ఈ వారసుడు. రాజకీయంగా తప్పటడుగులు.. తప్పుడు నిర్ణయాలతో రాజకీయాల్లో వెనుకబడి పోయారు. విజయం అనేది అందని ద్రాక్షగా మిగిలింది. చట్టసభల్లో అడుగు పెట్టాలన్న కోరిక తీరనంటోంది. కనీసం 2029 ఎన్నికల్లోనైనా గెలుపు బాట పట్టాలని అవినాష్ భావిస్తున్నారు. అయితే ఆయన తన తండ్రి సొంత నియోజకవర్గ పెనమలూరు కావాలని కోరుతున్నారు. అందుకు అధినేత జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోవడం లేదు. దీంతో డిఫెన్స్ లో పడ్డారు దేవినేని అవినాష్.
* సుదీర్ఘ నేపథ్యం..
కాంగ్రెస్( Congress) పార్టీలో ఒక వెలుగు వెలిగారు మాజీ మంత్రి దేవినేని నెహ్రూ. తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆయన చంద్రబాబును విభేదించారు. అయితే ఆయన వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు దేవినేని అవినాష్. కానీ పరిస్థితులకు తగ్గట్టు రాజకీయ నిర్ణయాలు తీసుకోలేకపోయారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో రాజకీయంగా మూల్యం చెల్లించుకున్నారు. గడిచిన 3 ఎన్నికల్లో పోటీ చేశారు కానీ.. ఒక్కసారి కూడా ఆయన గెలవలేకపోయారు. అయితే ప్రతి పార్టీకి ఆయన ప్రయోగంగా మారారే తప్ప.. తన మనసులో ఉన్నది చేయలేకపోయారు. సొంత నియోజకవర్గాన్ని విడిచిపెట్టి ఇతర ప్రాంతాల్లో పోటీ చేసి మూల్యం చెల్లించుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే నేల విడిచి సాము చేశారు.
* కాంగ్రెస్ లో కొనసాగుతూ..
రాష్ట్ర విభజనతో 2014లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బతింది. అటువంటి సమయంలో ఆ పార్టీకి చెందిన మెజారిటీ నేతలు వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో చేరిపోయారు. కొద్దిమంది మాత్రమే తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇలా చేరిన వారిలో కొందరు సక్సెస్ అయ్యారు. మరికొందరు ఫెయిల్యూర్ అయ్యారు. తొలి విడత ఓడిపోయిన కొందరు 2019 ఎన్నికల్లో గెలిచారు. అయితే 2014లో దేవినేని అవినాష్ సరైన నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు. ఆ పార్టీ అభ్యర్థిగా విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
* టిడిపికి దగ్గరై..
2014లో తెలుగుదేశం( Telugu Desam) పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీకి దగ్గరయ్యారు. ఆ పార్టీ అధినాయకత్వం సైతం బాగానే ప్రోత్సాహం అందించింది. 2019 ఎన్నికల్లో గుడివాడలో కొడాలి నాని పై టిడిపి అభ్యర్థిగా పోటీ చేశారు దేవినేని అవినాష్. ఆ ఎన్నికల్లో ఓడిపోయేసరికి అవినాష్ పొలిటికల్ గా సైలెంట్ అయ్యారు. కొద్ది రోజులకే తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి అనతి కాలంలోనే విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జిగా మారారు. 2024 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
* కొత్త ఆలోచనతో..
అయితే మూడుసార్లు ఓడిపోయేసరికి దేవినేని అవినాష్ కాస్త మనస్థాపానికి గురయ్యారు. అందుకే తన సొంత నియోజకవర్గం పెనమలూరు( penamaluru ) వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. గతంలో దేవినేని నెహ్రూ కంకిపాడు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించేవారు. ఆ నియోజకవర్గమే పునర్విభజనలో భాగంగా పెనమలూరుగా మారింది. అయితే అక్కడ జోగి రమేష్ ప్రస్తుతం ఇన్చార్జిగా ఉన్నారు. ఆయన కల్తీ మద్యం కేసులో అరెస్టై జైలులో ఉన్నారు. అందుకే అక్కడ నియోజకవర్గ ఇన్చార్జిగా తనకు అవకాశం కల్పించాలని అవినాష్ కోరుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం అందుకు అంగీకరించడం లేదని తెలుస్తోంది. మొత్తానికైతే సొంత ప్రాంతంలోనైనా గెలిచి చట్టసభల్లో అడుగు పెట్టాలన్న ఆ యువనేత కోరిక తీరేలా లేదు. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.



