వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగలనందా? ఆ పార్టీకి సీనియర్ నేత ఒకరు గుడ్ బై చెప్పనున్నారా? గత కొద్ది రోజులుగా అసంతృప్తితో ఉన్నారా? జగన్ పట్టించుకోవడం లేదా? అందుకే ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉండడం అంత సేఫ్ కాదని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఇంతకీ ఆ నేత ఎవరు అంటే మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి తో సన్నిహిత సంబంధాలు కొనసాగించే రాజమోహన్ రెడ్డి.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత జగన్ వెంట అడుగులు వేశారు. జగన్ సైతం ఆయన పెద్దరికాన్ని గౌరవిస్తూ వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరీ.. పార్టీ నడిపే తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు మేకపాటి రాజమోహన్ రెడ్డి. అయితే ఆయన సలహాలను జగన్మోహన్ రెడ్డి స్వీకరించకపోవడంతో ఇక పార్టీలో ఉండడం అంత భావ్యం కాదని భావిస్తున్నారట.
నెల్లూరు జిల్లాతో పాటు ప్రకాశం జిల్లాలో సైతం రాజకీయాలు చేశారు మేకపాటి రాజమోహన్ రెడ్డి. నెల్లూరు,ఒంగోలు పార్లమెంట్ స్థానాల నుంచి ఎంపీగా గెలిచారు కూడా. ఓసారి నరసరావుపేట ఎంపీగా కూడా విజయం సాధించారు. రాజకీయాల్లో క్లీన్ ఇమేజ్ ఉన్న నేతగా గుర్తింపు సాధించారు. 1989 తొలిసారిగా ఎంపీ అయ్యారు మేకపాటి. అంతకుముందు ఎమ్మెల్యేగా ఉదయగిరి నుంచి ప్రాతినిధ్యం వహించారు. రాజశేఖర్ రెడ్డి తో మంచి సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. అది మొదలు మొన్నటివరకు యాక్టివ్గానే ఉండేవారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టడంతో కుటుంబంతో సహా ఆ పార్టీలో చేరారు. నెల్లూరు జిల్లాలో పెద్దదిక్కుగా మెలుగుతూ వచ్చారు.
2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు రాజమోహన్ రెడ్డి తనయుడు గౌతమ్ రెడ్డి. ఎమ్మెల్యేగా గెలవడంతో జగన్మోహన్ రెడ్డి ఆయనను తన క్యాబినెట్ లోకి తీసుకున్నారు. అయితే మంత్రిగా ఉండగానే అకస్మాత్తుగా మృతి చెందారు గౌతంరెడ్డి. ఆ స్థానంలో మేకపాటి మరో కుమారుడు విక్రమ్ రెడ్డి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ క్యాబినెట్ లోకి విక్రం రెడ్డిని తీసుకోలేదు. పైగా నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్, కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి నేతలకు ఎంతగానో ప్రాధాన్యం ఇచ్చారు జగన్. అయితే మొన్నటి ఎన్నికల్లో మేకపాటి రాజమోహన్ రెడ్డి తో పాటు విక్రం రెడ్డి సైతం వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేశారు. పార్టీ ఓడిపోయిన తర్వాత వారికి అంతగా ప్రాధాన్యం ఇవ్వడం మానేశారు. ఇటువంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల కిందట మేకపాటి కీలక ప్రకటన చేశారు. జగన్మోహన్ రెడ్డికి వాస్తవాలు తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చుట్టూ ఉన్న భజన బృందంతో జగన్మోహన్ రెడ్డికి నష్టం జరుగుతుందని కూడా చెప్పుకొచ్చారు. అయితే మేకపాటి నుంచి ఈ తరహా వ్యాఖ్యలు రావడంతో జగన్మోహన్ రెడ్డి ఆయనను కనీసం పిలవడం లేదు. ఏం జరిగిందనే దానిపై ఆరా తీయడం లేదు. జగన్ పట్టించుకోకపోవడంతో మేకపాటి కుటుంబంతో సహా పార్టీకి గుడ్ బై చెబుతారని ప్రచారం సాగుతోంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో మేకపాటి రాజమోహన్ రెడ్డి టిడిపిలో చేరుతారని ప్రచారం సాగుతోంది. మొన్న మధ్యాహ్నం ఓ కార్యక్రమంలో చంద్రబాబు ఎదురుపడితే పరస్పరం గౌరవించుకున్నారని సమాచారం. మేకపాటి రాజమోహన్ రెడ్డి టిడిపిలో చేరితే ఆయనకు రాజ్యసభ ఆఫర్ చేసినట్లు ప్రచారం నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కుమారుడు విక్రమ్ రెడ్డికి సీటు సర్దుబాటు కూడా చేస్తారని సమాచారం. ఈ హామీ తోనే మేకపాటి కుటుంబం టిడిపిలో చేరేందుకు సిద్ధపడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. మరి ఆ ప్రచారంలో ఎంత వాస్తవం ఉందో చూడాలి.



