Home » Andhra Pradesh » Dharmana: ధర్మానకు కీలక బాధ్యతలు కట్టబెట్టిన జగన్!

Dharmana: ధర్మానకు కీలక బాధ్యతలు కట్టబెట్టిన జగన్!

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉంది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) పరిస్థితి. పార్టీ ఆవిర్భావం నుంచి సీనియర్లు అంటే లెక్క చేయని విధంగా వ్యవహరించేవారు ఆయన. పార్టీ అంటే తాను ఒక్కడినే సోలో పెర్ఫార్మెన్స్ అన్నట్టు ఉండేది ఆయన పరిస్థితి. పార్టీలో మరో సీనియర్ కు అవకాశం లేదని.. అవకాశం ఇవ్వనన్నట్టు వ్యవహరించేవారు. తన తండ్రి రాజశేఖరరెడ్డికి సమకాలీకులైన నేతలను సైతం లెక్కచేసే వారు కాదు. తన చుట్టూ ఓ నలుగురు ఆప్తులను పెట్టుకొని రాజకీయాలు నడిపారు. ఒక విజయసాయిరెడ్డి.. ఒక సజ్జల రామకృష్ణారెడ్డి.. ఒక వైవి సుబ్బారెడ్డి అన్నట్టు పరిస్థితి ఉండేది. అయితే ఈ నేతలంతా జనం నుంచి వచ్చిన వారు కాదు. కేవలం జగన్ మెచ్చిన వారు. జగన్ కోసం మాత్రమే పనిచేసేవారు. అటువంటి వారిని పెట్టుకుని ఇన్ని రోజులపాటు రాజకీయం చేశారు జగన్ మోహన్ రెడ్డి. అయితే ఇంతవరకు ఎలాగో ముందుకు సాగింది కానీ.. మొన్నటి ఎన్నికల్లో ఓటమితో అసలు తత్వం బోధపడింది జగన్మోహన్ రెడ్డికి. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారి సలహాలతో పని జరగదని ఒక నిర్ణయానికి వచ్చినట్టు ఉన్నారు. అందుకే ఇక్కడ నుంచి సీనియర్ల సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. మీరే వచ్చి మంచి సలహాలు ఇవ్వండి అంటూ నేరుగా జగన్మోహన్ రెడ్డి విన్నవించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారితో డ్యామేజ్ జరిగిందని గుర్తించారు. దానికి దిద్దుబాటు చర్యలకు దిగుతున్నారు జగన్మోహన్ రెడ్డి.

 * బొత్సకు కీలక బాధ్యతలు..

 శాసనమండలిలో విపక్ష నేతగా పార్టీ సీనియర్ బొత్స సత్యనారాయణ ను( Botsa Satyanarayana) నియమించారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ భర్తీ విషయంలో జగన్మోహన్ రెడ్డి తగ్గినట్లు కనిపించారు. ఎందుకంటే వైసీపీ ఆవిర్భావం నుంచి అధికారం చేపట్టే వరకు సీనియర్ నేతలను జగన్ పెద్దగా లెక్క చేసిన దాఖలాలు లేవు. కానీ 2024 కు ముందు ఒక ఎత్తు.. తరువాత ఒక ఎత్తు అన్నట్టు పరిస్థితి మారింది. సీనియర్ల సేవలను దూరం చేసుకోవడం వల్ల తనకు ఈ పరిస్థితి ఎదురయిందని జగన్మోహన్ రెడ్డి గుర్తించారు. అందుకే విశాఖలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా సీనియర్ నేత బొత్సకు అవకాశం ఇచ్చారు. శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పక్ష నేతగా కూడా ఆయనకే అవకాశం కల్పించారు.

 * తాడేపల్లి కార్యాలయ బాధ్యతలు..

 తాజాగా మరో సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు కు( dharmana Prasad Rao ) సైతం కీలక బాధ్యతలు కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది. వైసిపి ప్రధాన కార్యాలయ బాధ్యతలను ఈ సీనియర్ నేతకు అప్పగించనున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఆ బాధ్యతలను చూసేవారు సజ్జల రామకృష్ణారెడ్డి. పార్టీని రాష్ట్రవ్యాప్తంగా సమన్వయం తీసుకునే కోఆర్డినేటర్ గా ఉండేవారు. ఏవైసీపీ నేత ఏం మాట్లాడాలి? ఏ అంశంపై మాట్లాడాలి? అనే దానిపై దిశా నిర్దేశం చేసేవారు. అయితే ఇక నుంచి ఆ బాధ్యతలను ధర్మాన ప్రసాదరావుకు అప్పగించనున్నట్లు సమాచారం. ఇకనుంచి మీడియా ముందుకు వచ్చి ఏ మాట అంటే ఆ మాట అనేందుకు వైసిపి నేతలకు వీలు లేదట. ఇకనుంచి ధర్మాన ప్రసాదరావు ప్రభుత్వానికి కౌంటర్ ఇస్తారట. ఆయనే అన్ని రకాల బాధ్యతలను తీసుకొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తారట. అయితే జగన్మోహన్ రెడ్డిలో ఈ మార్పును పార్టీ శ్రేణులు ఆహ్వానిస్తున్నాయి. సీనియర్ల సేవలను ఉపయోగించుకోవడంపై సంతృప్తి కూడా వ్యక్తం అవుతోంది. 

* కుమారుడికి టికెట్ హామీతో..

 మొన్నటి ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు ధర్మాన ప్రసాదరావు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఓ సామాన్య సర్పంచ్ నామినేషన్ వేయగా.. ఆయన చేతిలో దారుణ పరాజయం ఎదురయింది ధర్మాన ప్రసాదరావుకు. అప్పటినుంచి తీవ్ర మనస్థాపంతో ఉన్నారు ధర్మాన. కానీ ఆయనకు ప్రత్యామ్నాయం లేదు. ఆపై కుమారుడికి రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలి. అయితే వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఇవ్వడమే కాదు.. పార్టీ అధికారంలోకి వస్తే ధర్మానకు రాజ్యసభకు పంపిస్తానని జగన్ హామీ ఇచ్చారట. అందుకే పార్టీ కేంద్ర కార్యాలయ బాధ్యతలను తీసుకోవడానికి ధర్మాన ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

Share to...