
బిజెపి జాతీయ అధ్యక్ష పదవి కోసం సన్నాహాలు ప్రారంభం అయ్యాయి. త్వరలో అధ్యక్ష పదవిని భర్తీ చేస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చాలామంది ఆశావహుల పేర్లు బయటకు వస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఇద్దరు మహిళా నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ వంటి వాటి సిఫారసు తోనే బిజెపి జాతీయ అధ్యక్ష పదవిని భర్తీ చేస్తుంటారు. దీంతో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సిఫారసు కీలకంగా మారింది. త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నిర్మల సీతారామన్ పేరు పరిగణలోకి తీసుకుంటారని ప్రచారం నడుస్తోంది.
* మొన్నటి గెలుపులో కీలక పాత్ర..
రాజమండ్రి ఎంపీగా ఎన్నికయ్యారు పురందేశ్వరి. మొన్నటి ఎన్నికల వరకు ఆమె ఏపీ బీజేపీ చీఫ్ కూడా. ఏపీలో పొత్తులు కుదర్చడంలో ఆమె పాత్ర కీలకం. మొన్నటి ఎన్నికల్లో ఏపీ నుంచి ఓట్లతో పాటు సీట్లను పెంచుకుంది బిజెపి. అప్పటినుంచి బిజెపిలో పురందేశ్వరి పరపతి కూడా పెరిగింది. రాజమండ్రి ఎంపీగా గెలిచిన ఆమెను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం సాగింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. అయితే తాజాగా ఆమెను జాతీయ బిజెపి అధ్యక్షురాలిగా ఎంపిక చేస్తారని ప్రచారం ప్రారంభం అయింది. మరోవైపు ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు సైతం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అది బిజెపి అంతర్గత విషయం అయినా.. చంద్రబాబు సలహా సైతం బిజెపి పెద్దలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్డీఏలో బిజెపి తర్వాత అతిపెద్ద రాజకీయ పార్టీ తెలుగుదేశం. అందుకే ఈ విషయంలో చంద్రబాబు సైతం చొరవ తీసుకుంటారని తెలుస్తోంది.
* కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా..
ప్రత్యేక రాజకీయ పరిస్థితుల నడుమ పురందేశ్వరి ప్రస్థానం నడిచింది. తెలుగుదేశం పార్టీలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు తో పాటు చంద్రబాబు ఉండేవారు. 1995 టీడీపీ సంక్షోభంలో చంద్రబాబు వైపు నిలబడ్డారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి దంపతులు. కానీ చంద్రబాబుతో తలెత్తిన విభేదాలతో పురందేశ్వరి తన భర్త వెంకటేశ్వరరావుతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ తరఫున రెండుసార్లు ఎంపీ అయ్యారు. కేంద్ర మంత్రి పదవి కూడా చేపట్టారు. 2014లో రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బిజెపిలో చేరారు పురందేశ్వరి. భర్త వెంకటేశ్వరరావు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఆమె మాత్రం బిజెపిలో కొనసాగారు. అప్పటినుంచి బిజెపిలోనే కొనసాగుతూ వచ్చారు. ఈ తరుణంలో ఏపీ బీజేపీ చీఫ్ అయిన ఆమె మొన్నటి ఎన్నికల్లో పొత్తులో భాగంగా రాజమండ్రి ఎంపీ స్థానానికి పోటీ చేసి గెలిచారు.
* తనకంటూ సొంత ముద్ర..
ఎన్టీఆర్ కుమార్తెగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పురందేశ్వరి తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు. మంచి వాగ్దాటితో పాటు అన్ని భాషల్లో ఆమెకు పట్టు ఉంది. ఆపై కేంద్రమంత్రిగా సుపరిపాలన అందించారని మంచి పేరు కూడా ఉంది. ఈ పరిణామాలన్నీ ఆమె బిజెపి జాతీయ చీఫ్ అయ్యేందుకు దోహదపడుతున్నాయి. అయితే ఆది నుంచి ఆమె బిజెపిలో లేరు. ఆ విషయంలో చిన్నపాటి అభ్యంతరం ఉంది. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో బలపడాలన్న ఆలోచనలో బిజెపి ఉంది. అందుకే నిర్మల సీతారామన్ కానీ.. పురందేశ్వరి కానీ.. వీరిద్దరిలో ఒకరికి జాతీయా అధ్యక్ష పదవి ఇవ్వాలని హై కమాండ్ గట్టి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. చూడాలి బిజెపి పెద్దలు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారో?



