Home » Andhra Pradesh » కేంద్ర క్యాబినెట్ విస్తరణ.. తెలుగు రాష్ట్రాల్లో ఛాన్స్ వారికే!

కేంద్ర క్యాబినెట్ విస్తరణ.. తెలుగు రాష్ట్రాల్లో ఛాన్స్ వారికే!

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi) కేంద్ర క్యాబినెట్ను పునర్వ్యవస్థీకరిస్తారా? ఏడాదిన్నర గడిచిన వేళ మంత్రివర్గ విస్తరణ ఉంటుందా? తెలుగు రాష్ట్రాలకు మరో రెండు మూడు కేంద్రమంత్రి పదవులు దక్కనున్నాయా? పొలిటికల్ సర్కిల్లో దీనిపైనే చర్చ నడుస్తోంది. గత కొంతకాలంగా మంత్రివర్గ విస్తరణ పై ఊహాగానాలు రేగుతున్నాయి. అయితే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని క్యాబినెట్ ను విస్తరిస్తారని చర్చ నడుస్తోంది. బిజెపితో పాటు మిత్రపక్షాలకు భారీగా మంత్రి పదవులు దక్కనున్నాయని ప్రచారం జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటికే ఐదుగురు కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా కొనసాగుతున్నారు. ఏపీ నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతి రాజు శ్రీనివాస్ వర్మలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 42 పార్లమెంట్ స్థానాలు ఉన్న ఉమ్మడి రాష్ట్రం నుంచి ఐదుగురు మాత్రమే మంత్రులుగా ఉన్నారు.

* ఏపీ నుంచి ఇద్దరికీ..
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh)నుంచి మరో ఇద్దరికి మంత్రి పదవులు దక్కుతాయని ప్రచారం సాగుతోంది. టిడిపి కూటమికి ఒకటి, బిజెపి నుంచి మరొకరికి చాన్స్ దక్కుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. బిజెపి నుంచి ముగ్గురు ఎంపీలు అయ్యారు. రాజమండ్రి నుంచి పురందేశ్వరి, అనకాపల్లి నుంచి సీఎం రమేష్ ఎంపీలు అయ్యారు. నరసాపురం నుంచి గెలిచిన భూపతి రాజు శ్రీనివాస వర్మ కు కేంద్ర క్యాబినెట్ లో చోటు దక్కింది. అయితే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ ఎవరికీ అనేది సస్పెన్స్ గా మారింది. ప్రముఖంగా పురందేశ్వరి పేరు వినిపిస్తోంది. ఇప్పటికే సీఎం రమేష్ కు కీలకమైన రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ బాధ్యతలు కట్టబెట్టారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్ని పార్లమెంటరీ కమిటీల్లో సీఎం రమేష్ సభ్యుడిగా ఉన్నారు. పురందేశ్వరిని చూస్తే రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి వైదొలిగారు. అప్పట్లో ఆమెను కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకుంటారని ప్రచారం సాగింది. అందుకే ఇప్పుడు బిజెపికి మరో మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే మాత్రం పురందేశ్వరిని కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకోవడం ఖాయం.

* జనసేన కు ఛాన్స్..
జనసేనకు( janasena ) కేంద్ర మంత్రివర్గంలో చోటు లేదు. ఆ పార్టీకి ఇద్దరు ఎంపీలు ఉన్నారు. మచిలీపట్నం నుంచి ఎంపీగా బాలశౌరి గెలిచారు. కాకినాడ నుంచి జనసేన తరఫున తంగెళ్ళ శ్రీనివాస్ విజయం సాధించారు. ఇందులో బాలశౌరి సీనియర్. పైగా కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. జనసేనకు పదవి ఇవ్వాలనుకుంటే మాత్రం ఆయనకు చాన్స్ తప్పకుండా ఇచ్చే అవకాశం ఉంది. తంగేళ్ల శ్రీనివాస్ సైతం పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడు. ఆయన పేరును సైతం పరిగణలోకి తీసుకునే ఛాన్స్ ఉంటుంది.

* రాయలసీమ నుంచి..
తెలుగుదేశం ( Telugu Desam)పార్టీకి 16 మంది ఎంపీలు ఉన్నారు. అందులో ఇద్దరికీ ఇప్పటికే కేంద్రమంత్రివర్గంలో చోటిచ్చారు. శ్రీకాకుళం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కింజరాపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రులుగా ఉన్నారు. ఒకవేళ మరో మంత్రి పదవి దక్కితే రాయలసీమకు చెందిన మహిళా నేత బైరెడ్డి శబరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఎస్సీలకు ఇస్తామనుకుంటే మాత్రం మాజీ స్పీకర్ జీవీఎంసీ బాలయోగి కుమారుడు అమలాపురం నుంచి టీడీపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు ఛాన్స్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అయితే మూడో మంత్రి పదవి గురించి చంద్రబాబు పట్టు పట్టే పరిస్థితి లేదు. కేంద్రం ఇస్తామంటే వద్దనరు.

* తెలంగాణకు రెండు?
మరోవైపు తెలంగాణలో( Telangana) బిజెపి నుంచి 8 మంది ఎంపీలు గెలిచారు. ప్రస్తుతం కిషన్ రెడ్డి తో పాటు బండి సంజయ్ కేంద్రమంత్రులుగా ఉన్నారు. కేంద్ర మంత్రి పదవిలో బండి సంజయ్ అంతా ఆసక్తిగా లేరని ప్రచారం నడుస్తోంది. ఒకవేళ ఆయనకు రాష్ట్ర బిజెపి అధ్యక్ష బాధ్యతలు కట్టబెడితే.. ఆయన వద్ద ఉన్న కేంద్ర మంత్రి పదవి మరో బిజెపి ఎంపీ కి సర్దుబాటు చేసే అవకాశం ఉంది. మరోవైపు 2028 ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలని భావిస్తోంది బిజెపి. కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ ఎంపీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని చూస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?

Share to...