రాష్ట్రంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయా? వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడనుందా? ఈ మేరకు స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారా? ఎథిక్స్ కమిటీ ముందుగా నోటీసులు జారీ చేయనుందా? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సరైన సమాధానం ఇవ్వకుంటే స్పీకర్ వేటు వేస్తారా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. తాజాగా ఎథిక్స్ కమిటీ చైర్మన్ మండలి బుద్ధ ప్రసాద్ అధ్యక్షతన సభ్యులు సమావేశం అయ్యారు. దీనిపైనే చర్చించారు. దీంతో త్వరలో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే సూచనలు కనిపిస్తున్నాయి.
* అనర్హత వేటుకు ఛాన్స్..
2024 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి కూటమి( TDP Alliance ) ఘనవిజయం సాధించింది. 175 అసెంబ్లీ స్థానాలకు గాను 164 చోట్ల సత్తా చాటింది కూటమి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సభకు వచ్చారు వైసీపీ ఎమ్మెల్యేలు. తరువాత ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి ముఖం చాటేస్తూ వస్తున్నారు. అయితే శాసనసభ పని దినాలను ప్రామాణికంగా తీసుకుని.. వరుసగా 60 రోజులపాటు హాజరు కాని వారిపై అనర్హత వేటు వేసే అవకాశం ఉంది. ఈ లెక్కన జగన్మోహన్ రెడ్డి తో పాటు మరో ఆరుగురుపై వేటు పడుతుందని టాక్ నడుస్తోంది. ఓ ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రం శాసనసభ రిజిస్టర్లో సంతకాలు చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది.
* ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కావడం లేదు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు నిరసనగా వారు అసెంబ్లీని బాయ్ కట్( boy cut) చేస్తూ వచ్చారు. అయితే శాసనమండలిలో మాత్రం వైసీపీకి బలం ఉంది. 30 మందికి పైగా ఎమ్మెల్సీలు ఉన్నారు. కూటమికంటే వారిదే పై చేయి. అందుకే శాసనమండలికి హాజరవుతున్నారు ఆ పార్టీ ఎమ్మెల్సీలు. కానీ శాసనసభ విషయానికి వచ్చేసరికి మాత్రం ముఖం చాటేస్తున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వనిదే సభకు హాజరుకామంటూ తేల్చి చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే జగన్మోహన్ రెడ్డి తప్ప మిగతా ఎమ్మెల్యేలంతా జీతభత్యాలు తీసుకుంటున్నారు. ఇదే విషయంపై స్పీకర్ కూడా చాలా విధాలుగా వ్యాఖ్యానించారు. సభకు హాజరు కాని ఎమ్మెల్యేలు జీతభత్యాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. వారిపై అనర్హత వేటును పరిశీలిస్తున్నామని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఎథిక్స్ కమిటీ సమావేశమైంది. సభకు హాజరు కాని వైసీపీ ఎమ్మెల్యేలపై చర్చించింది. వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని కూడా నిర్ణయించింది. వారి నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోతే మాత్రం వేటు వేసే ఛాన్స్ ఉంది. అయితే ఈ అనర్హత వేటు విషయంలో నిబంధనలు సరిగా ఉంటే మాత్రం కోర్టులు కూడా కలుగజేసుకోవు. అదే జరిగితే ఏపీలో ఒకేసారి ఆరు అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు జరుగుతాయి.
* ఇరు వర్గాలకు సవాల్..
ఏకంగా ఆరు సీట్లకు ఉప ఎన్నికలు అంటే.. మినీ అసెంబ్లీ ఎన్నికలుగా భావించవచ్చు. అధికారపక్షంతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఇది గొప్ప సవాల్. 18 నెలల కాలంలోనే ప్రభుత్వ వైఫల్యాలు కనిపిస్తున్నాయని.. ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనం అయిందని కూటమి చెబుతోంది. అయితే ఈ ఉప ఎన్నికల్లో నెగ్గుకు రావడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అంత ఈజీ కాదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంది. ఆపై మూడు పార్టీల మధ్య సమన్వయం ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకున్న పరిస్థితి కనిపించడం లేదు. అందుకే ఉప ఎన్నికలకు ఆ పార్టీ ఎంత మాత్రం అవకాశం ఇవ్వదని పొలిటికల్ పండిట్స్ చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.



