(యం.వి.రామారావు , సీనియర్ జర్నలిస్ట్)
అధికారంలో ఉన్న ప్రభుత్వాలు తమ విధానాలతో తలసరి ఆదాయం పెరిగిందని, అభివృద్ధి బాటలో రాష్ట్రం పయనిస్తున్నదని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు.వాస్తవంగా అభివృద్ధి,తలసరి అదాయం, జియన్ డిపిఓ జాతీయ స్థాయికంటే ఎక్కువ ఉందని ఇటీవల సీఎం తన ప్రసంగంలో చెప్పారు.లెక్కలవరకూ అన్నీ బాగానే ఉన్నాయి. అన్నీ బాగుంటే నిత్యావసరాల రోజురోజుకు ఎందుకు పెరుగుతున్నాయి. నిరుద్యోగం 20 శాతం ఎందుకు దాటింది.ప్రభుత్వ ఉద్యోగాలు ఎందుకు భర్తీ కావడంలేదు.ప్రైవేట్ ఉద్యోగాలు ఎన్నాళ్లు ఉంటాయో గ్యారంటీ ఉండడంలేదు. పల్లెల్లో రోజురోజుకు ఉపాధి కరువవుతున్నది. పని దినాలు రోజురోజుకు కుదించుకుపోతున్నాయి.యాంత్రీకరణ పెరుగుతోంది. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటుధరలు లభించడంలేదు.ఏ పంట చూసినా సరైన ధర లభించడంలేదు.పోనీ వినియోగదారునికి చవకగా లభిస్తున్నదా అంటే అసలు లేదు.మధ్య దళారీలు దోచుకుంటున్నారు. రైతు వ్యవసాయం దండగమారి అనే అభిప్రాయానికి వస్తున్నాడు.ఇప్పటికే భూమి సొంతదారు వ్యవసాయం చేయడం మానివేసాడు.కౌలురైతులే అత్యధికంగా ఉన్నారు.వాళ్లు చేతులు ఎత్తివేస్తే ఇంతే సంగతులు.ఆహారం పండించే రైతు సెలవు తీసుకుంటే దేశం ప్రమాదంలో పడుతుంది.తిండికి మాడే స్థితి వస్తుంది.మరోవైపు వ్యవసాయంపై కార్పొరేట్ల కన్ను పడిందని వార్తలు వస్తున్నాయి.వ్యవసాయం వాళ్లచేతుల్లోకి వెళితే ధరలు వారి నిర్ఢయాలమేరకే ఉంటాయి.రైతుకు పంట ధర నిర్ణయించే అధికారం ఇవ్వని ప్రభుత్వాలు కార్పొరేట్లకు ఆ అవకాశం ఇస్తుంది.సమాజంలోని కార్పొరేట్,బడా పారిశ్రామికవేత్తలు,వ్యాపారులు ఉన్నత ఉద్యోగులు,రాజకీయనాయకులు తప్ప మరే వర్గం ఆదాయసముపార్జనలో,సౌకర్యాలలో సంతోషంగా లేరు.వారికి ఏడాదికి 500 శాతం ఆదాయ అభివృద్ధి కనిపిస్తున్నది.మిగిలిన వర్గాల వారికి ఆదాయం 1000 శాతం దిగజారి కనిపిస్తోంది.రైతు సంతృప్తిగా లేడు.సామాన్య ఉద్యోగి ఆనందంగా లేడు.కార్మికుడు కడుపునిండా తినే పరిస్థితి లేదు.
విద్య,వైద్యం ఖర్చులు ఊహించని విధంగా పెరిగిపోతున్నాయి.వృద్ధులు వేసుకునే బీపీ,సుగర్ ఇతర మందులు నెలకు ఎంతో కొంత పెరుగుతునే ఉన్నాయి.ప్రైవేట్ ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసిన ఉద్యోగికి పించను వెయ్యి రూపాయలు వస్తున్నది.దాన్నిరూ. 7500 పెంచాలని ఎన్ని విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.వృద్ధులు బతకడం చాలా భారంగా మారుతున్నది.రవాణా రంగం, సేవల రంగంలో పెరుగుతున్న ధరలు సామాన్యుడి ఠారెత్తిస్తున్నాయి. మరోపక్క సంక్షేమం పేరుతో ప్రభుత్వాలు వేలకొలది రూపాయలు అప్పులు చేసి ప్రజలకు ఉరితాడు కల్పిస్తున్నారు.అయినా వారి జీవన ప్రమాణాలు పెరగడం లేదు.కొనుగోలుశక్తి పెరగడంలేదు. దానివల్ల ఉపయోగం లేకపోగా అప్పులగ్రాఫ్ పెరుగుతుంది. తలసరి ఆదాయంకన్నా పలురెట్లు పెరుగుతున్నాయి.తలసరి అప్పు ఏపీలో రూ.92 వేలకు పైగా ఉంది.యువత నిరాశానిస్మృహలకు గురవుతున్నది.ఇది చాలా ప్రమాదకరమైన పరిణామం.వారి చూపు అసాంఘిక శక్తుల వైపు మరలే అవకాశం ఉంది.ప్రభుత్వం ఉపాధి,ఉద్యోగాల కల్పన విషయాల్లో తగిన చర్యలు తీసుకోవాలి.ప్రభుత్వ నిరర్ధకమైన ఖర్చును తగ్గించాలి. “అప్పుచేసి పప్పుకూడు” అన్నట్లు కాకూడదు.ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడుల సమీకరణకు అత్యధిక ప్రాముఖ్యత పెరిగింది.పెట్టుబడి దారులకు సకల సౌకర్యాలు కల్పించినా ఉద్యోగిత,ఉత్పత్తి లేక పోతే ప్రయోజనం లేదు. రెండురాష్టాలలో ప్యూచర్ సిటీ,అమరావతి పేర అభివృద్ధికి బాటలు వేయడం సంతోషమేకాని,వాటి ఫలాలు ఎంతవరకూ సామాన్యుడికి అందుతున్నాయనే సమీక్ష తప్పనిసరి.ప్రజా ధనాన్ని కార్పొరేట్ సౌకర్యాలకు, ప్రభుత్వం ధారాదత్తం చేస్తే వారిలోవ్యక్తిగత అభివృద్ధి కనిపిస్తుందిగానీ సామాన్యుడి జీవనప్రమాణంలో కనబడదు.ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు తగిన ప్రణాళికతో ముందుకుపోవాలి. అభివృద్ధి,సంక్షేమం,రుణం మూడింటినీ తగిన మేరకు అందిస్తూ సామాన్యుడి జీవన ప్రమాణం పెరగడమే తక్షణకర్తవ్యంగా విధాన రూపకల్పన చేయాలి. షరాబుల ఆదాయం పెరిగినంతగా గరీబుల ఆదాయం పెరగకపోతే అంతరాలు అధికమై అంతర్ యుద్ధం వస్తుంది. నేటి ప్రభుత్వాల సంక్షేమం ప్రజలకు సరైన ఊరట ఇవ్వడం లేదు.దాని బదులు ఉపాధి రంగాన్ని బలో పేతం చేస్తే తలసరి ఆదాయాలు పెరిగి అంతరాయం తగ్గుతుంది.అందుకు ప్రభుత్వాలు ఉపాధి,ఉద్యోగి త,ధరల అదుపు రైతుకు గిట్టుబాటుధరలు,కౌలు రైతులకు రుణ సౌకర్యాల వంటి చర్యలు తీసుకోవాలి.అలాగే విద్యా,వైద్య రంగాలకు పర్యవేక్షణ తప్పనిసరిగా పెంచాలి. అప్పుడే సామాన్యుడు ఎంతో కొంత సంతోషంగా బతుకుతాడు.



