పుకార్లు నమ్మొద్దు.. ఇంధన కొరత లేదు.
60 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి.
అనవసరంగా ఫుల్ ట్యాంకులు చేయించవద్దు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు : హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్
నగరంలో ఇంధన కొరత ఉందంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ స్పష్టం చేశారు. నగరంలో దాదాపు 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు. ఇంధన సరఫరాపై తలెత్తిన అపోహల నేపథ్యంలో బుధవారం టీజీసీసీసీలో జిల్లా కలెక్టర్ హరిచందన, ఐఏఎస్, అదనపు సీపీ తప్సీర్ ఇక్బాల్, ఐపీఎస్, జాయింట్ సీపీ శ్వేత, ఐపీఎస్ మరియు సివిల్ సప్లై అధికారులతో కలిసి ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనర్ మాట్లాడుతూ.. ఆయిల్ కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, నగరవ్యాప్తంగా సరఫరా నిరాటంకంగా కొనసాగుతోందని తెలిపారు. ప్రజలు ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు వచ్చి వాహనాలకు ఫుల్ ట్యాంకులు చేయించుకోవడం వల్ల అకస్మాత్తుగా డిమాండ్ పెరిగి, కొన్ని చోట్ల తాత్కాలికంగా నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని, దీనిని కొరతగా భావించవద్దని కోరారు. తప్పుడు ప్రచారాల వల్ల హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 22న 3,024 కిలోలీటర్ల ఇంధనం అమ్ముడవగా, 23న ఆ సంఖ్య రెట్టింపై 6,400 కిలోలీటర్లకు చేరుకుందని, జనం భయాందోళన చెందడం వల్లే అమ్మకాలు ఈ స్థాయిలో పెరిగాయని తెలిపారు.



