Telangana Global Summit: పెట్టుబడుల ఆకర్షణ, యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా రెండురోజుల పాటు తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. ఈ సదస్సులో 44కు పైగా దేశాలకు చెందిన 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొననున్నారు. దిగ్గజ కంపెనీల ప్రతినిధులు ఈ సమ్మిట్ లో పాల్గొని కీలక ప్రకటనలు చేస్తారు. అమెరికా నుంచే 46 కంపెనీల ప్రతినిధులు తరలివచ్చారు. ప్రారంభ వేడుకలో సుమారు రెండు వేల మంది దేశ, విదేశీ అతిధులు పాల్గొంటున్నారు. కాసేపట్లో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్– 2025’ ఆవిష్కృతం కాబోతోంది. దేశ, విదేశాలకు చెందిన ఫార్చ్యూన్–500 కంపెనీల ప్రతినిధులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, దిగ్గజ పారిశ్రామిక కంపెనీల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరు కానుండటంతో పోలీసులు భద్రతను పెంచారు.
సమ్మిట్ కోసం సోమవారం, మంగళవారం హైదరాబాద్ లో ట్రాఫిక్‌ను మళ్లించారు. అతిథులు, ప్రముఖుల వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా మళ్లించారు. హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారి లో వీడియోకాన్ జంక్షన్ నుంచి తుక్కుగూడ, నెహ్రూ ఔటర్ రోటరీ, హర్షాగూడ, మహేశ్వరం గేట్, కొత్తూర్ క్రాస్ రోడ్స్, పవర్ గ్రిడ్ జంక్షన్ మార్గంలో ట్రాఫిక్ ను మళ్లించారు. కొత్తూర్ క్రాస్ రోడ్స్ నుంచి పెద్ద గోల్కొండ, ఔటర్ ఎగ్జిట్–15 మధ్య ట్రాఫిక్ మళ్లించారు. ఔటర్ నుంచి ఎన్‌హెచ్–765 మీదుగా వచ్చే భారీ వాహనాలు తుక్కుగూడ ఔటర్ ఎగ్జిట్ నంబరు–14 వద్ద కాకుండా పెద్ద గోల్కొండ, ఓఆర్‌ఆర్ ఎగ్జిట్–15 వద్ద మళ్లింపులు తీసుకోవాలని తెలిపారు.

చర్చల తర్వాత ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీత కచేరి అతిధులను అలరించనుంది. తెలంగాణ ప్రత్యేక నృత్య రూపాలైన కొమ్ము కోయ, బంజారా, కోలాటం, గుస్సాడీ, ఒగ్గు డొల్లు, పేరిణి నాట్యం, బోనాల ప్రదర్శనతో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ల ప్రదర్శన ఉంటుంది. మరోవైపు నాగార్జున సాగర్ దగ్గర ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద వారసత్వ బౌద్ధ థీమ్ పార్కు అయిన బుద్ధవనం పర్యటనకు దౌత్య బృందం వెళ్లేలా టూరిజం శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సదస్సు జరిగే రెండు రోజుల పాటు హాజరైన అందరికీ పసందైన హైదరాబాదీ బిర్యానీతో పాటు, తెలంగాణ ప్రసిద్ద వంటలతో భోజనాలను అందించేందుకు వంటశాలలు సిద్దమయ్యాయి.

అతిధులకు డెలిగేట్లకు ప్రత్యేక సావనీర్లకు లోగోతో పాటు, పోచంపల్లి ఇక్కత్ శాలువా, చేర్యాల కళాకృతులు, హైదరాబాదీ అత్తర్, ముత్యాలతో కూడిన నగలు అందించునున్నారు. తెలంగాణలో ప్రత్యేకమైన వంటలైన ఇప్ప పువ్వు లడ్డు, సకినాలు, చెక్కలు, బాదం కీ జాలి, నువ్వుల ఉండలు, మక్క పేలాలతో కూడిన మరో ప్రత్యేక బాస్కెట్‌ను కూడా అతిధులకు అందజేస్తున్నారు.



