Home » Telangana » RajaSingh: బిజెపిలోకి రాజాసింగ్ రీఎంట్రీ?!

RajaSingh: బిజెపిలోకి రాజాసింగ్ రీఎంట్రీ?!

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

రాజా సింగ్.. తెలంగాణ బిజెపిలో వేగంగా ఎదిగిన నేత ఈయన. కానీ వివిధ కారణాలతో ఆయనపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో తిరిగి రాజాసింగ్ ను పార్టీలోకి తీసుకుంటున్నట్లు ప్రచారం నడుస్తోంది. గో రక్షకుడిగా, గరుడుగట్టిన హిందుత్వ వాదిగా పేరు తెచ్చుకున్నారు రాజాసింగ్. గోషామహల్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. దూకుడు కలిగిన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. వివాదాస్పద కామెంట్స్ తో పార్టీ నుంచి సస్పెండ్ కు గురయ్యారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సస్పెన్షన్ ఎత్తివేసి టిక్కెట్ కేటాయించడంతో గోషామహల్ నుంచి గెలిచారు. అయితే తాజాగా రాష్ట్ర బిజెపి నాయకత్వం పై రాజాసింగ్ తీవ్ర విమర్శలు చేయడంతో మళ్లీ సస్పెన్షన్ వేటు పడింది.

 చాలా రోజుల గ్యాప్ తర్వాత బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి భర్తీ జరిగింది. కానీ అధ్యక్ష ఎన్నికల్లో తాను కూడా పోటీ చేస్తానని సంకేతాలు పంపారు. రాష్ట్ర నాయకత్వాన్ని బహిరంగంగా ప్రశ్నించి పార్టీకి ఇబ్బందికరంగా మారారు. అయితే మరోసారి ఆయనపై సస్పన్సన్ వేటు తప్పలేదు.

 అయితే ఇప్పుడు రాజాసింగ్ తిరిగి బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ద్వారా మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. గతంలో సస్పెన్షన్ వేటు పడినప్పుడు రాజాసింగ్ సీనియారిటీ, సిన్సియారిటీని పరిగణలోకి తీసుకొని పార్టీలోకి రప్పించారు. ఇప్పుడు కూడా అలానే జరుగుతోందన్న అనుమానాలు ఉన్నాయి. కానీ రాజాసింగ్ రాకను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు వ్యతిరేకంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. పార్టీలోని అంతర్గత విషయాలను బహిర్గతం చేయడంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. కొద్దిరోజుల పాటు రాజాసింగ్ ను బిజెపి నుంచి బయట ఉంచడమే మేలన్న నిర్ణయం పెద్దల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మద్దతుతో గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో?

 ఇటీవల తెలంగాణ బిజెపి ఎంపీలను పిలిచి ప్రధాని నరేంద్ర మోడీ క్లాస్ తీసుకున్నట్లు ప్రచారం నడిచింది. తెలంగాణలో ఎందుకు ఉదాసీనంగా ఉండి పోతున్నారని ఆయన అడిగినట్లు టాక్ నడిచింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో గెలవాలని ప్రధాని సూచించినట్లు తెలుస్తోంది. నేతలంతా సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని సూచించారు ప్రధాని. ఈ నేపథ్యంలో రాజా సింగ్ ను సైతం పార్టీలోకి తీసుకుంటారని ప్రచారం సాగుతోంది. అయితే కేవలం రాజాసింగ్ బిజెపి లైన్ దాటి మాట్లాడారే తప్ప.. ఆయన బిజెపి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో మాత్రం ముందుంటారు. అందుకే రాజాసింగ్ చేరిక ఉంటుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

Share to...