గులాబీ పార్టీలో ఆందోళన మొదలైందా? ఫోన్ ట్యాపింగ్ కేసు తుది అంకానికి చేరిందా? మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడంతో బిఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరి అవుతోందా? దాని నుంచి జనాన్ని మళ్లించేందుకు ప్రయత్నిస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి.
* విచారణ వేగవంతం.. తెలంగాణలో( Telangana) ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ వేగవంతం అవుతోంది. ఇప్పటివరకు సిట్ అధికారులను మాత్రమే విచారించింది. ఇక రాజకీయ నేతల వంతు వచ్చింది. తాజాగా మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు అందాయి. గత రెండేళ్లుగా ఈ కేసు విచారణ కొనసాగుతుండగా గులాబీ పార్టీ అగ్ర నేతలకు నోటీసులు ఇవ్వడం ఇదే తొలిసారి. నిన్ననే సిట్ అధికారులు హరీష్ రావు ఇంట్లో నోటీసులు ఇచ్చారు. అయితే జిల్లాల పర్యటనలో ఉన్న హరీష్ రావు హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. పార్టీ కార్యకర్తలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో హరీష్ రావు అరెస్టు ఉంటుందని ప్రచారం ప్రారంభమైంది.
* ప్రత్యర్థుల బలాబలాలపై ఆరా..
అప్పట్లో అధికార పార్టీగా ఉన్న గులాబీ పార్టీ అగ్ర నేతలు ఫోన్ ట్యాపింగ్( Phone tapping) జరిపించారన్నది ప్రధాన ఆరోపణ. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ తీవ్రంగా ఉందనుకున్న నియోజకవర్గాల్లో ప్రతిపక్షం తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారికి సహకరించిన వారి డీటెయిల్స్ సేకరించి ప్రభాకర్ రావు పంపేవాడన్న అంశాన్ని సీరియస్ గా తీసుకొని ఈ దర్యాప్తు సాగింది. అందులో గులాబీ పార్టీ అగ్రనేతగా ఉన్న హరీష్ రావు ను ఇప్పుడు సిట్ విచారణ పేరిట పిలవడం సంచలనంగా మారింది.
*:కేటీఆర్ ఆగ్రహం..
మరోవైపు హరీష్ రావుకు( Harish Rao ) నోటీసులు ఇవ్వడం పై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. రాజకీయ వేదింపులే కాంగ్రెస్ పార్టీకి ఏకైక అజెండాగా మారిపోయిందని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పసలేదని పస లేదని సాక్షాత్ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పిందని.. కేసును కొట్టేసిందని ప్రస్తావించారు. మళ్లీ హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడం చూస్తుంటే రేవంత్ సర్కార్ ఎంత దిగజారిందో అర్థమవుతోందని పేర్కొన్నారు. మీ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. బొగ్గు గనుల కేటాయింపు అంశాన్ని పక్కదారి పట్టించేందుకు ఈ డైవర్షన్ పాలిటిక్స్ కు దిగారని ఆరోపించారు కేటీఆర్.
* పార్టీ శ్రేణుల్లో చర్చ..
మరోవైపు సిట్ నోటీసుల వ్యవహారంపై గులాబీ పార్టీలో బలమైన చర్చ నడుస్తోంది. అగ్రనేతలకు ఈ పరిస్థితి ఉంటే తమ మాట ఎలా ఉంటుందోనని చర్చించుకోవడం కనిపిస్తోంది. రానున్న రోజుల్లో మరికొందరికి నోటీసులు వచ్చే అవకాశం ఉందని కూడా ప్రచారం నడుస్తోంది. అయితే ఈ విషయంలో రేవంత్ సర్కార్ దూకుడుగా ముందుకు సాగితే చాలామంది గులాబీ పార్టీ నేతలు ఇబ్బందుల్లో పడటం ఖాయం. ఇప్పుడిప్పుడే ఓటమి నుంచి తేరుకొని ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు గులాబీ పార్టీ నేతలు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు వారిని భయపెడుతోంది.



