తెలంగాణలో( Telangana) బిజెపి సరికొత్త పోరాటాలకు సిద్ధమవుతోంది. పంచాయితీ ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలను సాధించింది భారతీయ జనతా పార్టీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సైతం ఆ పార్టీకి దక్కని గౌరవం తొలిసారిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో దక్కింది. ఉమ్మడి ఏపీ గా ఉండే సమయంలో 200 సర్పంచ్ స్థానాలను దక్కించుకోవడం గొప్ప విషయంగా ఉండేది. అటువంటిది ఈసారి 700 సర్పంచ్ స్థానాలను దక్కించుకుంది భారతీయ జనతా పార్టీ. ఇది ఒక విధంగా రికార్డ్. గతంలో ఎన్నడూ ఇంతటి స్థానాలను సాధించలేదు బిజెపి.
* ఇదే అదునుగా ఆ ఎన్నికలకు..
తెలంగాణలో ఓవరాల్ గా చూసుకుంటే కాంగ్రెస్( Congress) పార్టీ 50% పంచాయితీ స్థానాలను కైవసం చేసుకుంది. ఆ తరువాత స్థానంలో బీఆర్ఎస్ నిలిచింది. అయితే ఆ రెండు పార్టీలకు స్థానిక సంస్థలు అనేవి పట్టు అయినవి. దశాబ్దాలుగా ఉనికి చాటుకుంటూ వస్తున్నాయి ఆ రెండు పార్టీలు. ఆ రెండు పార్టీల ధాటిని తట్టుకొని 700 పంచాయితీ సర్పంచ్ స్థానాలు దక్కించుకోవడం అంటే చిన్న విషయం కాదు. బిజెపి పుంజుకోవడానికి ఈ ఫలితాలు చాలా దోహదపడతాయని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
* క్రమేపీ పెరిగిన బలం..
2023 అసెంబ్లీ ఎన్నికల్లో 8 నియోజకవర్గాల్లో గెలిచింది భారతీయ జనతా పార్టీ( Bhartiya Janata Party). 117 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను పోటీ చేసిన ఆ పార్టీ మంచి ఫలితాలను సాధిస్తుందని భావించారు. కానీ కేవలం నగరాలతో పాటు పట్టణాల్లో ఏక సంఖ్యకు మాత్రమే పరిమితం అయింది. గ్రామీణ ప్రాంతాల్లో వికసించలేదు కమలం. అయితే ఆ ఎన్నికలను గుణపాఠాలుగా మార్చుకుంది భారతీయ జనతా పార్టీ. 2024 సార్వత్రిక ఎన్నికల్లో నగరాలతో పాటు పట్టణాలకు సంబంధించిన పార్లమెంట్ స్థానాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. దాని ఫలితమే 8 పార్లమెంటు సీట్లు ఆ పార్టీ కైవసం చేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీతో సమానంగా సీట్లను కైవసం చేసుకుంది.
* ఆ సందేహానికి చెక్..
అయితే తాజా పంచాయితీ ఎన్నికల్లో అసలు బిజెపి ఉనికి చాటగలదా అనే ప్రశ్న వ్యక్తం అయింది. ఎందుకంటే ఆ పార్టీకి గ్రామీణ ప్రాంతాల్లో పట్టు తక్కువ. ఈ పరిస్థితుల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరుకుతారా దొరకరా అన్న సందేహాలు కూడా ఉన్నాయి. కానీ ఆ పార్టీ తరపున పోటీ చేసేందుకు ఔత్సాహికులు ముందుకు వచ్చారు. పల్లెపోరులో నిలబడ్డారు. వందలాది పంచాయితీలను బిజెపి కైవసం చేసుకుంది.
* మంచి అవకాశం..
అయితే పంచాయితీ ఎన్నికల్లో( Panchayati elections ) కాంగ్రెస్ పార్టీకి కాస్త సానుకూలత కనిపించింది. ఇదే అదునుగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని ఆ పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇది భారతీయ జనతా పార్టీకి ముమ్మాటికి మంచి అవకాశం. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ తో పాటు అన్ని కార్పొరేషన్లలో బిజెపికి మంచి ఓటు బ్యాంకు ఉంది. పట్టణాల్లో సైతం బిజెపి హవా నడుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో నేతలంతా ఏకతాటిపైకి వచ్చి కృషి చేస్తే మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో కమలం పూర్తిస్థాయిలో వికసించే అవకాశం ఉంది. అయితే బిజెపికి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. చాలామంది కీలక నాయకులు ఉన్నారు. ఆపై కేంద్రంలో అధికారంలో ఉంది ఆ పార్టీ. ఇటువంటి సమయంలో కానీ ఆ పార్టీ సర్వశక్తులు ఒడ్డితే తెలంగాణ మున్సిపాలిటీలు ఆ పార్టీకి చిక్కినట్టే.



