కాంగ్రెస్( Congress) పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. నాయకత్వాన్ని తిట్టినా క్షమించే గుణం ఆ పార్టీ సొంతం. అదే ఆ పార్టీ కొంపముంచింది. జాతీయస్థాయిలో ఈ హీన పరిస్థితికి కారణమైంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సంక్లిష్ట స్థితిలో ఉంది. ఎదగాలనుకున్న క్రమంలో తడబడుతోంది. తప్పటడుగులు వేస్తూ కిందపడుతోంది. క్రమేపి అన్ని రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోతూ వస్తోంది. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణతో పాటు కర్ణాటకలో అధికారాన్ని కొనసాగిస్తోంది. అక్కడ కూడా నేతల మధ్య విభేదాలు ఆ పార్టీని కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ పార్టీని సమన్వయం చేయడం అంత ఈజీ కాదు.
* సరిగ్గా ఏడాది కిందట..
గత ఏడాది ఫిబ్రవరిలో తెలంగాణ( Telangana) కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా మీనాక్షి నటరాజన్ నియమితులయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సీనియర్లను కాదని తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి అక్కడ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన క్యాబినెట్లో పనిచేస్తున్న మంత్రులంతా సీనియర్లే. తాము రేవంత్ రెడ్డి కంటే సీనియర్లం అనే భావనతో వారు ఉంటారు. క్షేత్రస్థాయిలో ఆ పార్టీ నేతల మధ్య విభేదాలు కూడా అదే స్థితిలో ఉంటాయి. అయితే గత ఏడాదికాలంగా మీనాక్షి నటరాజన్ చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే నామినేటెడ్ పదవులతో పాటు మొన్న పంచాయితీ ఎన్నికల్లో నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. అందుకే ఇక్కడ కాంగ్రెస్ సమన్వయ బాధ్యతలు చూడలేనని మీనాక్షి నటరాజన్ హై కమాండ్ కు విన్నవించినట్లు తెలుస్తోంది. అయితే ఇది కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం చేస్తున్న ప్రచారం అని కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి.
* అగ్రనేతకు సన్నిహిత నాయకురాలు..
మీనాక్షి నటరాజన్( Meenakshi Natarajan) రాహుల్ గాంధీకి సన్నిహిత నాయకురాలు. ఆయన ఆదేశాలతోనే కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా నియమితులయ్యారు. అంతకుముందున్న ఇన్చార్జిలు కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య సమన్వయం చేయలేక చేతులు ఎత్తేశారు. తమకు వద్దు ఈ బాధ్యతలు అని తేల్చి చెప్పి వెళ్లిపోయారు. అప్పుడే రాహుల్ గాంధీ ఆలోచన చేశారు. మీనాక్షి నటరాజన్ కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు.
* అంతర్గత ప్రజాస్వామ్యంతో..
తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో విభేదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదు. రోజురోజుకు పరిస్థితి జఠిలం అవుతోంది. అయితే ఇన్చార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ ఒక వర్గానికే కొమ్ముకాస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సీనియర్ మంత్రులలో సగం మంది ముఖ్యమంత్రి రేసులో ఉన్నవారే. పైగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వారు కొత్త తలనొప్పులు తెస్తున్నారు. మరోవైపు మంత్రుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒక మంత్రి అంటే ఒక మంత్రికి పడని పరిస్థితి. ఒకరి శాఖలో ఒకరు వేలు పెడుతున్నారు. ఈ పరిస్థితులన్నీ విభేదాలు మరింత ముదిరేందుకు కారణం అవుతున్నాయి.
* అదే పనిగా ప్రచారం..
అయితే తెలంగాణ బాధ్యతల నుంచి తనను తప్పించాలని మీనాక్షి నటరాజన్ హై కమాండ్ కు కోరినట్లు సోషల్ మీడియాలో( social media) ప్రచారం నడుస్తోంది. అయితే ఆమె సమర్థవంతమైన నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు. అదంతా ఉత్త ప్రచారమేనని ఒక వర్గం చెబుతోంది. కావాల్సి అలా కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం ప్రచారం చేస్తోందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పై ఇప్పుడు వార్తలు హల్ చల్ చేస్తుండడం విశేషం.



