తెలంగాణలో( Telangana) మరో కొత్త పార్టీ రాబోతుంది. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నారు. సాధారణంగా ఒక పార్టీపై అసంతృప్తికి గురైనా.. లేకుంటే అలిగినా పార్టీలు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో ఇలా చాలా పార్టీలు వచ్చాయి. అలానే కనుమరుగయ్యాయి. అయితే ఇలా వచ్చే పార్టీలు ఎదుటి పార్టీలను డ్యామేజ్ చేయగలుగుతాయి. ఆపై మరో పార్టీకి లాభం చేకూర్చుతాయి. అయితే అసంతృప్తితో పార్టీలు పెట్టిన వారిలో ఎవరు నెగ్గలేకపోయారు. ఏదో లక్ష్యంతో సమాజానికి సేవ చేద్దామని పెట్టిన పార్టీలు చాలావరకు సక్సెస్ అయ్యాయి. అయితే ఇప్పుడు కవిత పార్టీ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
* అత్యంత కీలకమైన సమయం..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండున్నర సంవత్సరాల వ్యవధి ఉంది. ఇది అత్యంత కీలకమైన సమయం కూడా. కొత్త పార్టీని పెట్టి ఇప్పటినుంచి జనం మధ్యలోకి తేకపోతే మాత్రం ఆ ప్రభావం ఎంత మాత్రం ఉండదు. అందుకే కవితమ్మ ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా యువత, బడుగు బలహీన వర్గాలు, తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన వారు, అమరవీరుల బంధువులు, కుటుంబాలు, మైనారిటీలకు ఒక రాజకీయ వేదికగా పార్టీని తీసుకురావాలన్నది కవిత( kalvakuntla Kavita ) అభిమతం. కవిత కొత్త పార్టీ ప్రకటన ఆశ్చర్యం అనిపించలేదు. ఎందుకంటే ఆమె గులాబీ పార్టీని విభేదిస్తూ సస్పెన్షన్కు గురయ్యారు. అది మొదలు తాను సొంతంగానే రాజకీయం చేయాలని ఆమె బలంగా భావిస్తున్నారు.
* షర్మిల మాదిరిగా కాకుండా..
అయితే ఏదైనా రాజకీయ పార్టీ ప్రారంభించే సమయంలో హడావిడి ఉంటుంది. గతంలో షర్మిల వైయస్సార్ తెలంగాణ( YSR Telangana ) పార్టీ ఏర్పాటు చేసినప్పుడు ఇటువంటి హడావిడి నడిచింది. కానీ కొద్ది రోజులకే ఆ పార్టీ కాంగ్రెస్లో విలీనం అయింది. అటువంటి పరిస్థితి లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కవితపై ఉంది. అయితే కవిత కొత్త పార్టీ తెలంగాణలో ఏ మేరకు అవకాశాలు దక్కించుకుంటాయి అంటే మాత్రం ఇప్పుడే చెప్పలేం. అయితే పార్టీ పెట్టె వారి సత్తా పై ఆధారపడి ఉంటుంది. వారి సామర్థ్యం పై ఆధారపడి ఉంటుంది.
* స్పేస్ ఉంటుందా?
ప్రస్తుతం తెలంగాణ సమాజంలో అధికార పార్టీగా కాంగ్రెస్( Congress) ఉంది. ప్రతిపక్ష పార్టీగా గులాబీ పార్టీ ఉంది. భారతీయ జనతా పార్టీ విస్తరించాలని చూస్తోంది. మజ్లిస్ మాత్రం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం అయింది. ఇటువంటి పరిస్థితుల్లో కవిత పార్టీకి స్పేస్ ఉంటుందా? అనేది ఒక అనుమానం. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపి.. తెలంగాణ ఉద్యమ పార్టీగా బి ఆర్ ఎస్ కు సంప్రదాయ ఓటు బ్యాంకు ఉంది. ఇప్పుడు కవిత ప్రత్యేకంగా తనకంటూ ఒక ఓటు బ్యాంకును క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అది అంత ఈజీ కాదు అని పొలిటికల్ పండిట్స్ అభిప్రాయపడుతున్నారు.
* ఓట్లు చీలేది ఆ పార్టీకే..
తెలంగాణలో కవిత కొత్త పార్టీతో అత్యంత ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోబోతుంది గులాబీ పార్టీ. ఎందుకంటే తాను అన్ని బంధాలు తెంచుకున్నాను అని కవిత చెబుతున్నారు. అయితే ఈరోజుకి కూడా కేసీఆర్ కుమార్తె గానే ఆమెను చూస్తున్నారు. వేరే పార్టీలో చేరలేక.. తప్పనిసరి పరిస్థితుల్లో బిఆర్ఎస్ లో ఉన్నవారికి కవిత పార్టీ ప్రత్యామ్నాయంగా మిగులుతుంది. అందుకే గులాబీ పార్టీకి ఎక్కువగా ప్రమాదం. ఆమె ఎక్కువగా చీల్చేది కూడా ఆ పార్టీ ఓట్లని. ఒక్క మాటలో చెప్పాలంటే కవిత ద్వారా ముళ్ళు గుచ్చుకునేది గులాబీ పార్టీకేనని పొలిటికల్ పండిట్స్ అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.



