దానం నాగేందర్( danam Nagender ) కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా? లేకుంటే గులాబీ పార్టీలోకి తిరిగి వెళ్తారా? యూటర్న్ తీసుకుంటారా? అనర్హత వేటుకు భయపడిపోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అలానే ఉన్నాయి. తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల అంశం కాక రేపుతోంది. ఐదుగురు ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇప్పటికే కీలక ప్రకటన చేశారు. వారిపై అనర్హత వేటు లేదని తేల్చేశారు. మరో ఐదుగురిపై నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఆ ఐదుగురిపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే ఆ ఐదుగురిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కూడా ఉన్నారు. ఆయన గులాబీ పార్టీ తరపున ఖైరతాబాద్ నుంచి గెలిచారు. కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. టెక్నికల్ గా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు స్పష్టమవుతోంది. అనర్హత పడడం ఖాయమని తెలుస్తోంది.
* అసెంబ్లీలో హాట్ కామెంట్స్..
అయితే దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవి వదులుకునేందుకు భయపడుతున్నట్లు ఒకవైపు ప్రచారం నడుస్తోంది. దానికి అర్థం వచ్చేలా తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో( assembly sessions) ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీసాయి. మూసీ నది ప్రక్షాళన పై చర్చ జరుగుతుండగా దానం నాగేందర్ మాట్లాడారు. సంబంధిత మంత్రి దృష్టి పెట్టడం లేదంటూ విమర్శలు చేయడంతో.. దానం నాగేందర్ తిరిగి గులాబీ పార్టీలోకి వెళ్తారా అన్న అనుమానాలు మరింత పెరిగాయి. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన బలమైన హామీ పొందినట్లు ప్రచారం నడుస్తోంది. ఒకవేళ అనర్హత వేటు పడితే తప్పకుండా ఉప ఎన్నిక వస్తుంది. అలా జరిగితే కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయనే ఉంటారు. ఒకవేళ గెలిస్తే మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. అందుకే ఆయన ఎంత మాత్రం గులాబీ పార్టీలోకి వెళ్ళరని తెలుస్తోంది.
* పార్టీలు మారుతారన్న విమర్శ..
దానం నాగేందర్ కు తరచూ పార్టీలు మారుస్తారన్న విమర్శ ఉంది. కాంగ్రెస్ పార్టీ( Congress Party) ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు దానం నాగేందర్. 1994, 1999, 2004 ఎన్నికల్లో ఆసిఫ్ నగర్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు దానం నాగేందర్. 2004లో వివిధ సమీకరణలో ఆయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కలేదు. వెంటనే తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వెంటనే తెలుగుదేశం పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో ఖైరతాబాద్ నుంచి పోటీ చేశారు దానం నాగేందర్. ఆ ఎన్నికల్లో గెలిచేసరికి రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. 2014 వరకు మంత్రిగా కొనసాగారు. అయితే తెలంగాణకు జరిగిన తొలి ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేశారు. కానీ ఆయనపై బిజెపి అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి ఘనవిజయం సాధించారు. 2018లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో గులాబీ పార్టీ తరఫున ఖైరతాబాద్ నుంచి పోటీ చేశారు దానం నాగేందర్. అదే బిజెపి అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి పై ఘనవిజయం సాధించారు. 2023లో గులాబీ పార్టీ తరఫున గెలిచిన ఆయన కొద్ది రోజులకే పార్టీ ఫిరాయించారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు.
* కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ..
దానం నాగేందర్ విషయంలో గులాబీ పార్టీ పట్టు పడడానికి ప్రధాన కారణం ఆయన ఏకంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం. కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ ను 2024 సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఆ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి కిషన్ రెడ్డి గెలిచారు. అయితే ఇప్పుడు దానం నాగేందర్ పై అనర్హత వేటు కత్తి వేలాడుతోంది. ఎందుకంటే టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి.. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడంతో ఆయన అడ్డంగా బుక్కయ్యారు. తప్పకుండా ఆయన అనర్హత వేటుకు గురికాక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇంత జరిగాక కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందా? లేదా? అనేది అనుమానమే. అయితే ఎమ్మెల్యే టికెట్ రాకుంటే ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రిని చేస్తామని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు దానం నాగేందర్ వెనక్కి తగ్గి బీఆర్ఎస్ లోకి వెళ్లే పరిస్థితి కూడా కనిపించడం లేదు. అయితే ఇప్పుడు సడన్గా కాంగ్రెస్ పార్టీపై చిన్నపాటి వ్యతిరేక మాటలు దానం నాగేందర్ నుంచి వినిపిస్తుండడంతో అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చూడాలి ఆయన పొలిటికల్ జర్నీ ఎలా ఉండబోతుందో.



