తెలంగాణలో( Telangana) పొలిటికల్ హై టెన్షన్ నెలకొంది. అక్కడ మున్సిపల్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు నువ్వా నేనా అన్న రీతిలో తలపడుతున్నాయి. అయితే వార్డుల ఏకగ్రీవాల్లో కాంగ్రెస్ పార్టీ బోణి కొట్టింది. అధికార పార్టీగా తన దూకుడును ప్రారంభించింది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఈనెల 11న జరగనుంది. ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగిసింది. అయితే అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ మూడు వార్డులను ఏకగ్రీవం చేసుకుంది. మెదక్ మున్సిపాలిటీ లోని 32 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. కాంగ్రెస్ నుంచి మానస, బిఆర్ఎస్ నుంచి జ్యోతి నామినేషన్ వేశారు. చివరి నిమిషంలో జ్యోతి నామినేషన్ విత్ డ్రా చేసుకోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి మానస ఏకగ్రీవం కానున్నారు.
* మహబూబ్ నగర్ లో.. మహబూబ్నగర్( Mahabubnagar ) నగరపాలక సంస్థ పరిధిలోని 58వ డివిజన్ కార్పొరేటర్ ఎన్నిక లాంఛనం కానుంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి రమాదేవి నామినేషన్ వేశారు. బిజెపి నుంచి నాగవల్లి నామినేషన్ వేశారు. కానీ సోమవారం నాగ వల్లి నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు. దీంతో రమాదేవి ఎన్నికల లాంచనమే.
* రామగుండంలో.. రామగుండం( Ramagundam) నగరపాలక సంస్థ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ బోణి కొట్టింది. ఒకటో డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఇక్కడ ముగ్గురు అభ్యర్థులు రంగంలోకి దిగారు. కానీ చివరి నిమిషంలో టిఆర్ఎస్ తో పాటు బిజెపి అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి విజయ ఎన్నిక లాంచనమేనని తెలుస్తోంది.
* బిఆర్ఎస్ ప్లేస్ లోకి బిజెపి..
మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు గులాబీ పార్టీ మాత్రం అనుకున్న స్థాయిలో ఎదుర్కోలేకపోతోంది. ఈ క్రమంలో అక్కడ బిజెపి బలమైన ప్రతిపక్షంగా నిలుస్తోంది. ప్రతి చోటా బలమైన అభ్యర్థులను రంగంలోకి దించింది. ఈ పరిస్థితి చూస్తుంటే మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీ తర్వాత… నిలిచేది బిజెపి అని స్పష్టమవుతోంది. ముఖ్యంగా గులాబీ పార్టీ ప్లేస్ లోకి బిజెపి రావడం గమనార్హం. ఫలితాల్లో కూడా ఇదే ట్రెండ్ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.



