ఆయన తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు. కాంగ్రెస్లో పదవుల కోసం ప్రయత్నించాడు. వీలు కాలేదు. అయినా సరే కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గానే ఉన్నాడు. అటువంటి ఆయన చంద్రబాబు కోసం పాదయాత్ర చేస్తుండడం విశేషం. ఇంతకీ ఎవరా నేత? ఏంటా కథ? తెలియాలంటే లెట్ వాచ్ దిస్ స్టోరీ.
బండ్ల గణేష్( Bandla Ganesh).. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. సినిమా రంగంలో తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినీ పరిశ్రమలో ప్రవేశించి.. ప్రముఖ నిర్మాతగా ఎదిగారు. సినీ పరిశ్రమలో ప్రముఖుడుగా ఉన్నారు. అటువంటి బండ్ల గణేష్ షాద్నగర్ నుంచి తిరుపతికి మహా పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 19న షాద్ నగర్ లో తన ఇంటి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు బండ్ల గణేష్ ప్రకటించారు. ఆయన చేపడుతున్న ఈ పాదయాత్ర పై రాజకీయాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. సినిమాలు ఆయన వృత్తి అయినా.. ప్రవృత్తి మాత్రం రాజకీయాలు అన్నట్టు ఉంటుంది. అయితే ఇప్పుడు చంద్రబాబు కోసం ఆయన ఈ మహా పాదయాత్ర చేస్తున్నట్టు ప్రకటించడం హాట్ టాపిక్ అవుతోంది.
* చంద్రబాబు అరెస్టు సమయంలో..
వైసిపి( YSR Congress ) ప్రభుత్వ హయాంలో చంద్రబాబును అవినీతి కేసుల్లో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.. 52 రోజులపాటు ఆయన రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో. అప్పట్లో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ బండ్ల గణేష్ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. చాలా ఎమోషనల్ గా ప్రసంగించేవారు. చంద్రబాబు క్షేమంగా విడుదలయితే తిరుమలకు పాదయాత్రగా వస్తానని బండ్ల గణేష్ అప్పట్లో మొక్కుకున్నారు. అయితే చంద్రబాబు విడుదలయ్యారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన పాలన 19 నెలలు పూర్తయింది కూడా. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ మొక్కు తీర్చుకోవాలని నిర్ణయించారు.
* వీరాభిమానిగా..
కాంగ్రెస్( Congress) పార్టీలో ఉంటూనే ఎన్డీఏ సీఎంగా ఉన్న చంద్రబాబు కోసం మొక్కు తీర్చుకోవడం ఏమిటనేది ఇప్పుడు ప్రశ్న. అయితే రాజకీయంగా దారులు వేరైనా బండ్ల గణేష్ చంద్రబాబుకు వీరాభిమాని. చంద్రబాబు అరెస్టు సమయంలో బండ్ల గణేష్ హైదరాబాద్ తో పాటు ఏపీలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలకు హాజరయ్యారు. అప్పట్లో పలు యూట్యూబ్ ఇంటర్వ్యూలలో చంద్రబాబు కోసం గట్టిగానే వాదనలు వినిపించారు. అప్పట్లో చంద్రబాబు అరెస్టును మరింత హైప్ తీసుకెళ్లడంలో బండ్ల గణేష్ సక్సెస్ అయ్యారు. చంద్రబాబు అరెస్టు పట్ల సింపతి ఎక్కువ కావడానికి కూడా ఆయనలాంటివారు కారణం.
* దాదాపు 500 కిలోమీటర్ల మేర..
దాదాపు 500 కిలోమీటర్ల మేర బండ్ల గణేష్ మహాపాదయాత్రలో నడవనున్నారు. షాద్ నగర్( Shadnagar) నుంచి తిరుమల కు 460 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే ఆయన ఒక్కరే ఈ పాదయాత్ర చేస్తారా? లేకుంటే బృందంగా చేస్తారా? కాంగ్రెస్ పార్టీ ఈ పాదయాత్రను ఎలా చూస్తుంది? అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.



