Hyderabad: ప్రస్తుత సమాజంలో రోజురోజుకు రక్తసంబంధాలు చెడిపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకే గొడవలు పడటం లేదంటే విడిపోవడం వంటివి చేస్తున్నారు. కొంతమంది అయితే క్షణికావేశంలో ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదు. కడుపున పుట్టిన బిడ్డలను కూడా చిధిమేస్తున్నారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన అభం శుభం తెలియన పసిపిల్లల జీవితాలను అర్థాంతరంగా ముగిస్తున్నారు. ఇలాంటి అమానవీయ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.
మల్కాజిగిరికి చెందిన మహ్మద్ సులేమాన్ జావీద్ అలియాస్ డేవిడ్ (49), రెడపాక మోనాలిసా(37) 2009లో కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు శాంసన్(10), షారోన్ మేరీ(7) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వసంతపురికాలనీలోని అపార్ట్మెంట్‌లో నివాసం ఉంటున్నారు. మోనాలిసా సేవాభారతి సంస్థలో పనిచేస్తూ క్రైస్తవ మత ప్రచారం చేస్తోంది. అయితే గత రెండేళ్లుగా మానసిక సమస్యలో బాధపడుతోంది. ఇందుకు చికిత్స కూడా తీసుకుంటుంది. ఈ క్రమంలోనే దంపతుల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. భర్త మీద కోపాన్ని పిల్లల మీద చూపించేది.
ఆదివారం రాత్రి కూడా దంపతులు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సోమవారం ఉదయం కూడా మోనాలిసా మళ్లీ భర్తతో గొడవపడింది. ఈ సమయంలో కూతురు మేరీ.. తల్లి ఫోన్ తీసుకొని ఆడుకుంటుంది. అప్పటికే కోపంతో ఉన్న మోనాలిసా ఫోన్ ఎందుకు వాడుతున్నావంటూ పాపను టెర్రస్ పైకి తీసుకెళ్లింది. నిన్ను చంపి నేనూ చస్తా.. అప్పుడు ఈ బాధలేవీ ఉండవు అంటూ పాపను కిందకు తోసేసింది. భర్త బయటకు వచ్చి చూసేసరికి మెట్ల మీద తీవ్రగాయాలలో కుమార్తె పడి ఉంది. హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే పాప చనిపోయిందని వైద్యులు నిర్థారించారు. సమాచారం అందుకున్న పోలీసులు భార్య మోనాలిసాను అదుపులోకి తీసుకున్నారు. భర్త మీద కోపంతో క్షణికావేశంలో భార్య చేసిన పనికి ఏడేళ్ల పసిపాప బలైపోయింది.



