Home » Sports » Matheesha Pathirana: ధోనీకి రుణపడి ఉంటా.. సీఎస్కేకు ధన్యావాదాలు.. పతిరణ ఎమోషనల్

Matheesha Pathirana: ధోనీకి రుణపడి ఉంటా.. సీఎస్కేకు ధన్యావాదాలు.. పతిరణ ఎమోషనల్

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

Matheesha Pathirana: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) ఎంతో మంది యువ క్రికెటర్లను వెలుగులోకి తీసుకొచ్చాడు. ధోని ప్రోత్సాహంతో వారంతా స్టార్ క్రికెటర్లుగా ఎదిగారు. భారత జట్టుతో పాటు ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌లో కూడా ప్రతిభ ఉన్న ఆటగాళ్లను గుర్తించి ప్రోత్సహించాడు. అలాంటి వారిలో శ్రీలంక పేసర్ మతీశా పతిరణ కూడా ఉన్నాడు. లంక దిగ్గజ ఆటగాడు లసిత్ మలింగ బౌలింగ్ యాక్షన్‌ను పోలిన పతిరణకు ధోనీ అనేక అవకాశాలు ఇచ్చాడు. దీంతో పతిరణ తన టాలెంట్‌ను నిరూపించుకున్నాడు. డెత్ ఓవర్లలో యార్కర్లతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టి వికెట్లు తీసేవాడు.

నాలుగేళ్లపాటు చెన్నైకి ఆడిన పతిరణ.. 32 మ్యాచుల్లో 47 వికెట్లు తీశాడు. ఇటీవల సీఎస్కే జట్టు అతడిని వదిలేయడంతో వేలంలోకి వచ్చాడు. మంగళవారం జరిగిన మినీ వేలంలో కోల్‌కతా జట్టు రూ.18కోట్లకు పతిరణను దక్కించుకుంది. ఈ క్రమంలో తనను ప్రోత్సహించిన ఎంఎస్ ధోనీ, సీఎస్కేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. ధోనీ రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేనని తీవ్ర భావోద్వేగంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

‘ఎల్లో జెర్సీని ధరించాలనే కోరిక కలిగిన ఓ పిల్లాడిగా వచ్చిన నాపై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నమ్మకం ఉంచింది. నన్నొక కుటుంబ సభ్యుడిగా ఆదరించింది. 2022 నుంచి 2025 సీజన్ వరకూ ప్రతి క్షణం ఆస్వాదించా. క్రికెటర్‌గా, వ్యక్తిగా అద్భుతంగా తీర్చిదిద్దింది. చెన్నై తరఫున 50 వికెట్ల మైలురాయిని అందుకోవాలని భావించా. బట్ బ్యాడ్ లక్ అలా జరగలేదు. ముఖ్యంగా నన్ను ముందుండి నడిపించిన ధోనీ భాయ్‌కి ఎప్పటికీ రుణపడి ఉంటా. మేనేజ్‌మెంట్‌ నన్ను చాలా నమ్మింది. ప్రతి విషయంలోనూ జట్టులోని సహచరులు సోదరులుగా మద్దతు ఇచ్చారు. నాకు మద్దతుగా నిలిచిన సీఎస్కే అభిమానుల ప్రేమను మరిచిపోలేను. నా హృదయంలో చెన్నైకి ప్రత్యేక స్థానం ఉంటుంది. సీఎస్కేకు ధన్యవాదాలు. ఇప్పుడు నేను కోల్‌కతా తరఫున కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నా’ అని భావోద్వేగానికి గురయ్యాడు.

 

Share to...