IPL 2026 Auction: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఐపీఎల్ మినీ వేలం ముగిసింది. అబుదాబి వేదికగా జరిగిన ఈ వేలంలో కొంతమంది స్టార్ క్రికెటర్లు భారీ ధరకు అమ్ముడుపోగా.. మరికొంతమంది అన్ సోల్డ్‌గా మిగిలిపోయారు. వేలంలో పాల్గొన్న ఆటగాళ్లలో మొత్తం 77 మందిని ఆయా ఫ్రాంఛైజీలు కొనుగోలు చేశాయి. వీరిలో 29 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.
ముఖ్యంగా ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్(Cameron Green) రికార్డు ధర పలికాడు. అతడి కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య నువ్వానేనా అనే రీతిలో పోటీ జరిగింది. మధ్యలో చెన్నై సూపర్ కింగ్స్ కూడా గ్రీన్‌కు దక్కించుకునేందుకు రేసులోకి వచ్చింది. అయితే చివరకు కేకేఆర్ రూ.25.20 కోట్లకు కామెరూన్‌ను సొంతం చేసుకుంది.
💰 INR 25.20 Crore 🤯🤯
The third most expensive player in the history of #TATAIPL auction! 🔨
Cameron Green will play for @KKRiders 💜#TATAIPLAuction pic.twitter.com/c0ErBPWHju
— IndianPremierLeague (@IPL) December 16, 2025
ఇక శ్రీలంక పేస్ బౌలర్ మతీశ పతిరణకు జాక్ పాట్ తగిలింది. చెన్నై జట్టు అతడిని వదిలేయడంతో వేలంలోకి వచ్చాడు. రూ.2కోట్ల కనీస ధర ఉన్న పతిరణను సొంతం చేసుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు పోటీ పడ్డాయి. అయితే అనూహ్యంగా రేసులోకి వచ్చిన కేకేఆర్ రూ.18కోట్లకు కొనుగోలు చేసింది.
అలాగే ఇంగ్లాండ్ హిట్టర్ లియామ్ లివింగ్ స్టోన్ తొలుత అన్ సోల్డ్‌గా మిగిలిపోయాడు. తర్వాత మళ్లీ వేలంలోకి వచ్చిన ఇతడిని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏకంగా రూ.13కోట్లకు కొనుగోలు చేయడం గమనార్హం. అలాగే బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను రూ.9.20కోట్లకు కోల్‌కతా దక్కించుకుంది. ఆస్ట్రేలియా బ్యాటర్ ఇంగ్లిస్‌ను రూ.8.60 కోట్లకు లక్నో తీసుకుంది.
భాతర స్పిన్నర్ రవి బిష్ణోయ్ రూ.7.20కోట్లకు రాజస్థాన్ జట్టుకు అమ్ముడపోగా.. వెస్టిండీస్ ఆల్ రౌండర్ జేసన్ హెల్డర్‌ను గుజరాత్ టైటాన్స్ రూ.7కోట్లకు సొంతం చేసుకుంది. గతేడాది రూ.25కోట్లు పలికిన వెంకటేశ్ అయ్యర్.. ఈసారి కేవలం రూ.7కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ అమ్ముడుపోయాడు.
వీరితో పాటు భారత్ అన్ క్యాప్‌డ్ ప్లేయర్లు కూడా భారీ ధరకు పలకడం ఈసారి వేలంలో ఆసక్తి పరిణామంగా మారింది. ముఖ్యంగా ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మను చెన్నై సూపర్ కింగ్స్ తలా రూ.14.20 కోట్లకు సొంతం చేసుకోవడం విశేషం. ఇక మరో అన్ క్యాప్‌డ్ ప్లేయర్ ఆకిబ్ దార్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.8.40 కోట్లకు దక్కించుకుంది.
ఏ జట్టు ఎవరిని కొనుగోలు చేసిందో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.



