Home » Sports » IND vs SA T20: మూడో టీ20లో టీమిండియా ఆల్ రౌండ్ షో.. సౌతాఫ్రికాపై ఘన విజయం

IND vs SA T20: మూడో టీ20లో టీమిండియా ఆల్ రౌండ్ షో.. సౌతాఫ్రికాపై ఘన విజయం

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

IND vs SA T20: ధ‌ర్మశాల వేదిక‌గా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచులో టీమిండియా ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొట్టి సఫారీలను మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా బ్యాటర్లను భారత బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. ఆది నుంచే వికెట్లు తీస్తూ ప్రొటీస్ ప్లేయర్లను ఇబ్బంది పెట్టారు. ముఖ్యంగా హర్షిత్ రాణా, అర్ష్ దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. దీంతో 5 ఓవర్లలోనే దక్షిణాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి 14 పరుగులే చేసింది. తొలి ఓవర్‌ నాలుగో బంతికి హెండ్రిక్స్‌ (0)ను అర్ష్‌దీప్‌ ఔట్‌ చేశాడు. అనంతరం హర్షిత్‌ రాణా స్టార్ ప్లేయర్ క్వింటన్‌ డికాక్‌ (1)ను పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే హిట్టర్ బ్రెవిస్‌ (2)ను ఔట్‌ చేసి కోలుకోలేని దెబ్బ కొట్టాడు. దీంతో స్కోర్ బోర్డ్ నెమ్మదించింది.

ఈ స్థితిలో కెప్టెన్‌ మార్‌క్రమ్‌ కాస్త ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. ఓ వైపు మిగతా బ్యాటర్లు విఫలమవుతున్నా.. దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ చేశాడు. అనంతరం ధాటిగా ఆడే క్రమంలో వికెట్ కోల్పోయాడు. 46 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. ఇక డోనోవన్ ఫెరీరా (20), అన్రిచ్ నార్ట్జే (12) మాత్రమే రెండెంకెల స్కోర్ చేశారు. భార‌త బౌల‌ర్లలో అర్ష్‌దీప్ సింగ్, హ‌ర్షిత్ రాణా, వ‌రుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాద‌వ్ త‌లా రెండు వికెట్లు.. హార్దిక్ పాండ్యా, శివ‌మ్ దూబె చెరో వికెట్ తీశారు.

స్వల్ప ఛేదనలో బరిలో దిగిన టీమిండియా ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ తనదైన శైలిలో ఆడి స్కోరు బోర్డును పరిగెత్తించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లపై ఏమాత్రం దయలేకుండా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఇక కొంతకాలంగా ఫామ్‌ కోల్పోయి ఇబ్బందిపడుతున్న వైస్ కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్‌ కాస్త లైన్‌లోకి వచ్చాడు. 28 బంతుల్లో ఐదు ఫోర్లతో 28 పరుగులు చేశాడు. వీరిద్దరి జోరుకి 5 ఓవర్లలోనే భారత్ 60/0 పరుగులు చేసింది.

IND vs SA T20

అభిషేక్(35) ఔట్ అనంతరం క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కబెట్టాడు. అయితే మధ్య ఓవర్లలో దక్షిణాఫ్రికా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో 4 ఓవర్లలో కలిపి కేవలం 12 పరుగులే చేశారు. ఇక బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్(12) మరోసారి నిరాశపరిచాడు. చివర్లో శివమ్ దూబే (10)తో కలిసి తిలక్(26).. జట్టును గెలిపించాడు. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా 2-1తో ముందంజలో ఉంది.

ఇక ఈ మ్యాచులో ఓ వికెట్ తీసిన హార్దిక్ పాండ్యా టీ20ల్లో 1000 పరుగులు చేసి, 100 వికెట్లు తీసిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. భారత్‌ తరఫున టీ20ల్లో 100 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గానూ ఘనత సాధించాడు. అంతకుముందు అర్ష్‌దీప్‌ సింగ్, జస్ప్రీత్‌ బుమ్రా ఈ జాబితాలో ఉన్నారు.

Share to...