Home » Sports » IND vs SA T20: తొలి టీ20లో సౌతాఫ్రికా చిత్తు.. దుమ్మురేపిన టీమిండియా..

IND vs SA T20: తొలి టీ20లో సౌతాఫ్రికా చిత్తు.. దుమ్మురేపిన టీమిండియా..

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

IND vs SA T20: కటక్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు అదరగొట్టారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుతంగా రాణించి ఘన విజయం సాధించారు. టీమిండియా ధాటికి ప్రొటీస్ ఆటగాళ్లు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 175/6 పరుగులు చేసింది. ఓపెనర్ శుభమన్ గిల్ 4 పరుగులకే ఔట్ అయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(12) కూడా వేగంగా ఆడలేకపోయాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ(17) కూడా ఈసారి తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు. దీంతో 48 పరుగులకే భారత్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది.

IND vs SA T20

ఆ తర్వాత తెలుగు ఆటగాడు తిలక్ వర్మ(26), అక్షర్ పటేల్(23) ఇన్నింగ్స్ కాస్త చక్కదిద్దారు. అయితే వీరిద్దరు కూడా వెంటవెంటనే ఔట్ కావడంతో 104 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 28 బంతుల్లో 4 సిక్సర్లు, 6 ఫోర్లతో అజేయంగా 59 పరుగులు చేసి స్కోర్ బోర్డును పరిగెత్తించాడు. దాంతో భారత్ 175 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి 3 వికెట్లు, సిప్మలా 2 వికెట్లు తీశారు.

IND vs SA T20

 

176 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన దక్షిణాఫ్రికా జట్టు ఆది నుంచే చతికిలపడింది. వరుస వికెట్లు కోల్పోతూ ఓటమి దిశగా సాగింది. ఇన్నింగ్స్ రెండో బంతికే ఓపెనర్ క్వింటన్ డికాక్ డకౌట్‌గా వెనుదిరిగాడు. కీలక బ్యాటర్లు డేవిడ్ మిల్లర్, ఫెరీరా పూర్తిగా విఫలమయ్యారు. డివాల్డ్ బ్రెవిస్ కాస్త దూకుడుగా ఆడినా ఫలితం లేకుండా పోయింది. భారత బౌలర్ల దెబ్బకి కేవలం 12.3 ఓవర్లలో 74 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో టీమిండియా 101 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలో 2 వికెట్లు తీశారు. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్ లో సూర్యకుమార్ సేన 1-0తో ముందంజలో ఉంది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ గురువారం న్యూ ఛండీగఢ్‌లో జరగనుంది.

Share to...