Home » Sports » IND VS SA T20: తిలక్ వర్మ పోరాటం వృథా.. రెండో టీ20లో భారత్ ఓటమి

IND VS SA T20: తిలక్ వర్మ పోరాటం వృథా.. రెండో టీ20లో భారత్ ఓటమి

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

IND VS SA T20: సౌతాఫ్రికా జట్టుతో జరిగిన రెండో టీ20లో భారత్ ఓటమిపాలైంది. దక్షిణాఫ్రికా అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి 51 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తిలక్ వర్మ 62 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది.

తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ అందుకు మూల్యం చెల్లించుకుంది. బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా ఆటగాళ్లు దూకుడుగా ఆడారు. ఓపెనర్ క్వింటన్ డికాక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 46 బంతుల్లో 5 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో 90 పరుగులు చేసి భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. కెప్టెన్ మార్‌క్రమ్ తో కలిసి రెండో వికెట్‌కు 83 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. చివర్లో డొనోవాన్ ఫెరీరా 16 బంతుల్లో 30, డేవిడ్ మిల్లర్ 12 బంతుల్లో 20 పరుగులతో మెరుపులు మెరిపించడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది.

IND VS SA T20

214 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శుభ్‌మన్ గిల్ తొలి బంతికే డకౌట్ అయ్యాడు. అభిషేక్ శర్మ(17), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(5) కూడా స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. దీంతో 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన తెలుగు ఆటగాడు తిలక్ వర్మ ఒంటరి పోరాటం చేశాడు. ఓవైపు తిలక్ వర్మ పోరాడుతున్నా మరోవైపు ఇతర బ్యాటర్లు వికెట్లు కోల్పోతూనే ఉన్నారు.

Tilak Varma

దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేసి భారత బ్యాటర్లను కట్టడి చేశారు. ముఖ్యంగా ఒట్నీల్ బార్ట్‌మన్ నాలుగు కీలక వికెట్లు పడగొట్టి భారత పతనాన్ని శాసించాడు. దీంతో భాతర్ 19.1 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌట్ అయి ఓటమిని మూటగట్టుకుంది. కాగా ఈ గెలుపుతో 5 మ్యాచుల టీ0 సిరీస్‌లో ఇరు జట్లు చెరో విజయంతో సమంగా ఉన్నాయి. ఇక ఇరు జట్ల మధ్య మూడో టీ20 డిసెంబరు 14న ధర్మశాలలో జరగనుంది.

 

Share to...