FIFA World Cup 2026: ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ ఆటకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన క్రీడ. నరాలు తెగే ఉత్కంఠతో మ్యాచులు సాగుతాయి. నువ్వానేనా అనే రీతిలో ప్లేయర్స్ తలపడుతూ ఉంటారు. ఇక ప్రపంచకప్ అయితే ఆ క్రేజే వేరు. ఫిఫా ప్రపంచ కప్ పోటీలు 1930లో మొదలయ్యాయి. ప్రతి నాలుగేళ్ళకోసారి ఈ వరల్డ్ కప్ జరుగుతుంది. 2022లో జరిగిన ప్రపంచకప్‌ను అర్జెంటీనా ముద్దాడింది.
2026లో జరిగే వరల్డ్ కప్ కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ మెగా టోర్నీని అమెరికా, కెనడా, మెక్సికోలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. తాజాగా ఫిఫా ప్రపంచ కప్-2026కి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఫిఫా అధికారికంగా ప్రకటించింది. 39 రోజులపాటు జరిగే ఈ మెగా టోర్నీలో ఈసారి 48 దేశాలు పోటీపడబోతున్నాయి. మొత్తం మూడు దేశాల్లోని 16 వేదికల్లో 104 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. 48 జట్లను 12 గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూపులో నాలుగు జట్లు ఉంటాయి. లీగ్ దశలో ప్రతి జట్టు తమ గ్రూపులోని మిగతాజట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ప్రతి గ్రూపు నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి. అయితే ఆరు జట్ల స్థానాలు ఇంకా ఖరారు కాలేదు. ఇందుకోసం ఇటలీ సహా పలు దేశాలు పోటీపడనున్నాయి.
జూన్ 11న తొలి మ్యాచ్ ప్రారంభం కానుండగా.. జులై 19 ఫైనల్ జరగనుంది. తొలి మ్యాచ్ జూన్ 11న మెక్సికో సిటీ స్టేడియం వేదికగా మెక్సికో, సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతుంది. ఇక జూన్ 16న అల్జీరియాతో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా తన తొలి మ్యాచ్ ఆడనుంది. జూన్ 11 – 27వరకు గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు, జూన్ 28 – జులై 2 వరకు రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లు , జులై 4 – 7వరకు రౌండ్ ఆఫ్ 16 , జులై 9 – 11 మధ్య క్వార్టర్ ఫైనల్స్ , జులై 14 -15 మధ్య సెమీ ఫైనల్స్, జులై 18న సెమీ ఫైనల్, జులై 19న ఫైనల్ మ్యాచ్ జరగనున్నాయి. అమెరికాలోని ది మెట్‌లైఫ్ స్టేడియంలో తుది పోరు జరగనుంది.




