Home » Nation » NitinNabin: యువనేతకు బిజెపి పగ్గాలు.. నితిన్ నబీన్ ఎంపికలో అమిత్ షా మార్క్

NitinNabin: యువనేతకు బిజెపి పగ్గాలు.. నితిన్ నబీన్ ఎంపికలో అమిత్ షా మార్క్

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

భారతీయ జనతా పార్టీ( Bhartiya Janata Party) జాతీయ స్థాయిలో తిరుగులేని శక్తిగా ఉంది. నాలుగు దశాబ్దాల కిందట రెండు పార్లమెంట్ స్థానాలతో ప్రారంభమైన ఆ పార్టీ ప్రస్థానం ఇప్పుడు ఆ సేతు హిమాచలం అన్నట్టు మారింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆ పార్టీ విస్తరించింది. తిరుగులేని శక్తిగా మారింది. ఈ నేపథ్యంలో పార్టీ సంస్థాగత నిర్మాణం పై పూర్తి దృష్టి పెట్టింది నాయకత్వం. యువ నాయకత్వానికి పెద్ద పీట వేస్తూ బిజెపి పగ్గాలను బీహార్ కు చెందిన యువ నాయకుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన నితిన్ నబీన్ కు అప్పగించింది. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు, బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

 * ఆర్ఎస్ఎస్ నేపథ్యం..

 బీహార్( Bihar) రాజకీయాల్లో ఎదిగారు నితిన్ నబీన్. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందుతూ వచ్చారు. ప్రస్తుతం బీహార్ ప్రభుత్వంలో రోడ్లు, గృహ నిర్మాణ శాఖామంత్రిగా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉంది. పార్టీ అనుబంధ విభాగాలైన బీజేవైఎం లో జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో మంచి పట్టు సాధించారు. గత నెలలో ఆయనను జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నిర్మించారు. ఇప్పుడు అధ్యక్షుడిగా పూర్తిస్థాయి బాధ్యతలు కట్టబెట్టారు.

 * జేపీ నడ్డా వారసుడిగా..

 జేపీ నడ్డా( JP nadda )) పూర్తి కాలం జాతీయ అధ్యక్షుడిగా కొనసాగగలిగారు. ఆయన వారసుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు స్వీకరించారు. క్షేత్రస్థాయి కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి.. అంచలంచెలుగా ఎదిగిన నితిన్ నబీన్ వైపే ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా ధ్వయం మొగ్గుచూపింది. ఈ ఏడాదిలో పశ్చిమ బెంగాల్ తో పాటు తమిళనాడు వంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2029 సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోవాలంటే.. ఉత్సాహవంతులైన యువనేతకు పగ్గాలు అప్పగించడం ద్వారా పార్టీలో ఒక రకమైన వాతావరణం నింపాలని హై కమాండ్ బలమైన నిర్ణయం తీసుకుంది. అందులో భాగమే నితిన్ నబీన్ ఎంపిక.

 * సంచలన నిర్ణయం..

 భారతీయ జనతా పార్టీ చరిత్రలోనే ఇదో సంచలన నిర్ణయం. ఎవరు ఊహించని విధంగా.. ఎంతోమంది ఉద్దండులు ఉండగా.. వారికి కాదని కేవలం 45 ఏళ్ల వయసున్న యువనేత చేతికి కమలం పగ్గాలు అందించడం అంటే చిన్న విషయం కాదు. బీహార్ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరు తెచ్చుకున్న నితిన్ నబీన్( Nitin Navin) బిజెపి 12వ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే నితిన్ నబీన్ రాజకీయ ప్రవేశం ఒక విషాద సంఘటనతో మొదలయింది. ఆయన తండ్రి, బీహార్ బిజెపి సీనియర్ నేత నబీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా ఆకస్మిక మరణంతో 2006లో నితిన్ రాజకీయాల్లోకి రాక తప్పలేదు. చిన్న వయసులోనే తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు.

 * అప్రతిహాస విజయాలతో..

 రాజకీయాల్లోకి రావడం చాలా సులువు. కానీ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం అనేది చిన్న విషయం కాదు. 2006లో బైపోల్తో ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం.. వరుసగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో అధిష్టానం దృష్టిలో పడింది. కొద్ది రోజుల కిందట బీహార్ ఎన్నికల్లో ఆయన ఏకంగా తన ప్రత్యర్థి పై 50వేల పైచిలుకు మెజారిటీతో గెలిచారు. యువ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అనుభవం.. క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో ఆయనకు ఉన్న సంబంధాలే ఇంతటి స్థాయికి చేర్చాయి. సిక్కిం ఇన్చార్జిగా, చత్తీస్గడ్ కో ఇన్చార్జిగా వ్యవహరించి పార్టీ బలోపేతంతో పాటు ఆయా రాష్ట్రాల్లో విజయానికి దోహదపడ్డారు నితిన్ నబీన్. అందుకే మోడీ, షా ద్వయం ఆయన సేవలను గుర్తించింది. బిజెపి జాతీయ పగ్గాలను అప్పగించింది.

 

 

Share to...